YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గంటన్నరలో విజయవాడ 2 వైజాగ్

గంటన్నరలో విజయవాడ 2 వైజాగ్

విశాఖపట్టణం, జూన్ 21, 
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య నగరాలైన విశాఖపట్నం, విజయవాడ మధ్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు నగరాల మధ్య వందే భారత్ రైలు నడుస్తుండగా.. మరి కొన్నేళ్లలో బుల్లెట్ రైలు పరుగులు తీసే అవకాశం ఉంది. వచ్చే 5-10 ఏళ్లలో ఈ రూట్లో బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. మన దేశంలో ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు నడిచేందుకు వీలుగా హై స్పీడ్ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2026 ఆగస్టులో సూరత్, బిలిమోర మధ్య 63 కిలోమీటర్ల దూరం బుల్లెట్ రైలు ప్రయోగాత్మకంగా నడవనుంది.త్వరలోనే దేశంలోని ఇతర ప్రధాన నగరాల మధ్య కూడా బుల్లెట్ రైలు సేవలను అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ముంబై, అహ్మదాబాద్, న్యూ ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా నగరాలకు బుల్లెట్ రైలు కారిడార్లు వచ్చే అవకాశం ఉంది. న్యూ ఢిల్లీ-కోల్‌కతా, న్యూ ఢిల్లీ-ముంబై, ముంబై-చెన్నై, ఢిల్లీ-అమృత్‌సర్ వయా ఛండీగఢ్ మధ్య హై స్పీడ్ రైలు కారిడార్ సాధ్యాసాధ్యాలపై రైల్వే శాఖ ఇప్పటికే అధ్యయనం నిర్వహించింది.ఢిల్లీ-ముంబై, ముంబై-చెన్నై, చెన్నై-కోల్‌కతా, కోల్‌కతా-ఢిల్లీ మధ్య బుల్లెట్ రైల్ కారిడర్లను ఏర్పాటు చేయడం ద్వారా హై స్పీడ్ రైళ్ల డైమండ్ చతుర్భుజి ఏర్పడుతుంది. ఢిల్లీ-చెన్నై, ముంబై-కోల్‌కతా మధ్య కూడా హై స్పీడ్ రైళ్లు నడపాలని రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. ఈ రెండు మార్గాలు చతుర్భుజానికి కర్ణంలా ఉంటాయి. ఈ మార్గాల్లోనూ హై స్పీడ్ రైల్ నెట్‌వర్క్ సాధ్యాసాధ్యాలపై రైల్వే శాఖ అధ్యయనం చేసింది.ఈ మార్గాల్లో బుల్లెట్ రైలు పరుగులు పెడితే.. హైదరాబాద్‌ లేదా వరంగల్‌తోపాటు విజయవాడ, విశాఖపట్నం నగరాలకు బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి. ఢిల్లీ-చెన్నై మధ్య వెళ్లే బుల్లెట్ రైలు హైదరాబాద్ లేదా వరంగల్ మీదుగా వెళ్లే అవకాశం ఉండగా.. చెన్నై-కోల్‌కతా మీదుగా నడిచే బుల్లెట్ రైలు ద్వారా విజయవాడ-విశాఖపట్నం నగరాల మధ్య బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి వచ్చే వీలుంది.ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య బుల్లెట్ రైలు కారిడార్‌ నిర్మాణ పనులను నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ చేపడుతోంది. ఈ ప్రాజెక్ట్‌ వ్యయం రూ.1.25 లక్షల కోట్లు కాగా.. ఎక్కువ మొత్తాన్ని జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జికా) రుణంగా అందిస్తోంది. మిగతా ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల దూరం ఉండగా.. ప్రస్తుతం బస్సు ప్రయాణానికి 9 గంటలు, రైలు ప్రయాణానికి 6 గంటల టైం పడుతోంది. గంటకు 320 కి.మీ. వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలు సేవలు అందబాటులోకి వస్తే రెండు గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్ చేరుకోవచ్చు. ఈ కారిడార్ మహారాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ, గుజరాత్ మీదుగా వెళ్లనుంది. ఈ కారిడార్లో 12 స్టేషన్లు ఉంటాయి.ఈ చొప్పున చెన్నై-కోల్‌కతా మధ్య బుల్లెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి వస్తే.. విజయవాడ నుంచి విశాఖపట్నానికి 75 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది.

Related Posts