విజయవాడ, జూన్ 21,
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ చర్చే నడుస్తోంది. అధికార వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల్ని కూడగడతానని గతంలో పదే పదే ప్రకటించి తీరా వారాహి యాత్ర మొదలుపెట్టగానే రూటుమార్చేసి ఇప్పుడు తానే సీఎం అవుతానంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలు, వైసీపీ ఎమ్మెల్యేల్ని టార్గెట్ చేస్తున్న తీరు ఆయన పేరు మార్మోగేలా చేస్తోంది. ఇదే క్రమంలో కాపు నేత ముద్రగడ సైతం వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడికి మద్దతుగా రంగంలోకి దిగి పవన్ ను టార్గెట్ చేయడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఇదే సమయంలో పవన్ కంటే ముందే యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన టీడీపీ యువనేత నారా లోకేష్ తన యాత్ర కొనసాగిస్తున్నా దాని ప్రభావం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. పాదయాత్రలో లోకేష్ ఏం చేస్తున్నాడో తెలియదు కానీ.. రాష్ట్రంలో రాజకీయాన్ని తనవైపు మళ్లించుకోవడంలో మాత్రం విఫలమైనట్లే కనిపిస్తోంది. పవన్ కంటే ముందే యాత్ర ప్రారంభించినా, పవన్ తరహాలోనే వైసీపీ ఎమ్మెల్యేల్ని ఎక్కడికక్కడ టార్గెట్ చేసుకుంటూనే వస్తున్నా లోకేష్ యాత్రకు మాత్రం ఆశించిన మైలేజ్ రాకపోగా ఇప్పుడు అసలు కొనసాగుతుందా లేదా అన్నట్లుగా తయారైంది. దీనికి భిన్నంగా పవన్ కళ్యాణ్ వారాహియాత్ర తొలి రోజు నుంచే కాకరేపుతున్నారు. ముఖ్యంగా పొత్తులపై గతంలో మాట్లాడిన మాటలకు భిన్నంగా పవన్ స్పందిస్తున్న తీరు, వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్న తీరు అధికార పార్టీకి మంటపుట్టిస్తున్నాయి. దీంతో అధికార వైసీపీ నేతలు సైతం పవన్ ను టార్గెట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పవన్ టార్గెట్ చేసిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి వెంటనే తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు కౌంటర్లు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత పవన్ స్పందిచకపోవడంతో ఇవాళ కూడా తన విమర్శల దాడి కొనసాగించారు. కానీ లోకేష్ మాత్రం పాదయాత్రలో భిన్నవర్గాలను కలిసి వారికి టీడీపీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తామన్న దానిపై హామీలు ఇచ్చుకుంటూ సాగిపోతున్నారు. అన్నింటికంటే మించి రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న పాదయాత్రపై ప్రత్యర్ధి పార్టీలు కానీ, ఇతర ప్రాంతాల ప్రజల ఫోకస్ కానీ ఉండేలా చూసుకోవడంలో విఫలమవుతున్నారు. ఇదే పరిస్దితి కొనసాగితే లోకేష్ పాదయాత్ర పూర్తయినా టీడీపీకి అసలు మైలేజ్ రాకపోగా ఆయనకు కాళ్లు నొప్పులు వచ్చేలా కనిపిస్తున్నాయి.