కాకినాడ, జూన్ 22,
పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన కాపు ఓట్లను సంఘటితం చేస్తోందో, చీలుస్తోందో అర్థం కావడం లేదు. గత ఐదు రోజుల నుంచి జరుగుతున్న పవన్ వారాహి పర్యటనలో పవన్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ చర్చనీయాంశం అవుతున్నాయి. జనసేనాని భాష పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముద్రగడ పద్మనాభం నిన్న ఒక బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలో ముద్రగడ పవన్ భాష ను ఆక్షేపించారు. 'కింద కూర్చోబెడతా, గుండు కొట్టిస్తా'లాంటి మాటలు నాయకుడు వాడాల్సిన మాటలు కాదని ముద్రగడ హితవు పలికారు. దశాబ్దాల పాటు కాపుల హక్కుల కోసం పోరాడుతున్న నాయకుడిగా ముద్రగడకు గోదావరి జిల్లాల్లో మంచి పేరు ఉంది. ఆంధ్రాలో రాజకీయం వేడెక్కుతున్న వేళ ఆయన విడుదల చేసిన బహిరంగ లేఖ ఆంధ్రప్రదేశ్ లో కొత్త వివాదానికి తెర తీసింది. ఆంధ్ర రాజకీయమంతా ముద్రగడ బహిరంగ లేఖ చుట్టూనే తిరిగింది. సీనియర్ కాపు నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య ముద్రగడ లేఖ పై మండిపడ్డారు. 'తనకు అధికారం ఇవ్వాలని ఒకవేళ తాను బాగా పనిచేయలేక పోతే రెండేళ్లలోనే పదవి నుంచి దిగిపోతాన'ని అన్న పవన్ మాటలపై ఆంధ్ర ప్రదేశ్ లోని కాపు సామాజిక వర్గం సంతృప్తి ప్రకటించిందని ఆయన చెప్పారు. ముద్రగడ గతంలో కాపుల కోసం ఉద్యమాలు చేశారని అనుకున్నానని, కానీ అవి రాజకీయ లబ్ధి కోసం చేశారని ఇప్పుడు అర్థమవుతోందని హరి రామజోగయ్య విమర్శించారు. ఇలా పవన్ వైఖరిని ఆయన సమర్ధించారు. అయితే పవన్ భాషపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం విశేషంముద్రగడ లేఖని సమర్థిస్తున్న కాపు నాయకులు కూడా ఉన్నారు. ఈ లేఖపై కొంతమంది నాయకులు ఉలిక్కిపడడం ఆశ్చర్యంగా ఉందని కాపు సమాఖ్య జాతీయ అధ్యక్షుడు నరహరిశెట్టి శ్రీహరి పేర్కొన్నారు. రాష్ట్రంలో వంగవీటి మోహన రంగా తర్వాత ఆ స్థాయిలో కాపుల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి ముద్రగడ అని శ్రీహరి కితాబిచ్చారు. పవన్ మంచి కోరుతూ ముద్రగడ లేఖ రాశారని, దానిని గ్రహించకుండా కొంతమంది సరిగ్గా లేదని ఆయన పరోక్షంగా హరి రామ జోగయ్యని విమర్శించారు. ఈ కాపు రాజకీయాన్ని తెలుగు దేశం పార్టీ మౌనంగా పరిశీలిస్తోంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఆ పార్టీలోని కాపు నేతలు పవన్ కి మద్దతుగా మాట్లాడేవారు. ఇప్పుడు వారెవరూ స్పందించక పోవడం విశేషం.