విజయవాడ, జూన్ 24,
ఏపీలో కాపు రాజకీయం హీటెక్కింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో కాపు నేతలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చాలా రోజులు తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ప్రశాంతంగా కనిపించే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంలో ఆవేశం కట్టలు తెగింది.. నిరసనలు తప్ప విమర్శలకు సైతం దూరంగా ఉండే పెద్దాయన ఒక్కసారిగా సవాళ్లు విసిరారు. రాజకీయాలు వదిలేసిన ఆయన మళ్లీ పోటీకి సై అంటున్నారు. ఎక్కడ చెడిందో కానీ.. ఈ ఇద్దరి మధ్య యుద్ధం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇందులో పార్టీలు, వ్యక్తులు, సినిమా ప్రముఖులు సైతం ఎంట్రీ ఇవ్వడం సంచలనంగా మారింది.ఏపీలో కాపు రాజకీయం కొత్త మలుపు తిరుగుతోంది. కాపు వర్సస్ కాపు యుద్ధం మొదలైంది. కాపు ఉద్యమ నాయకుడు ముదగ్రడ తనదైన లేఖలతో జనసేనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పిఠాపురం నుంచి తనపై పోటీకి సిద్ధపడాలని పవన్ కల్యాణ్‌కు సవాల్ చేశారు ముద్రగడ. కాకినాడ ఎమ్మెల్యేతో కలిపి తనను ఎందుకు తిట్టారని ప్రశ్నించారు. శక్తి..పౌరుషం మీకు ఉన్నాయని భావిస్తున్నానంటూ తీవ్రంగా లేఖ రాశారు ముద్రగడ. కాపుల గురించి మాట్లాడే అర్హత ఉందా అని పవన్ ను ముద్రగడ ప్రశ్నించడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వంగవీటి రంగా హత్య నుంచి నిన్నటి ద్వారంపూడి ఇష్యూ వరకూ అన్ని అంశాలను లేఖలో ప్రస్తావించిన ముద్రగడ లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది.మరోవైపు పవన్ కల్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు పోసాని కృష్ణమురళి. కాపుల్లో గొప్ప నాయకుడిగా ఉన్న ముద్రగడను తిడుతూ చంద్రబాబును పవన్ కల్యాణ్ పొగడటం వింతగా ఉందన్నారు పోసాని. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని.. ఇందులో భాగంగానే ముద్రగడపై పవన్‌ను విమర్శలు చేస్తున్నారన్నారు సజ్జల. ముద్రగడ వెనుక వైసీపీ ఉందనేది అవాస్తవమన్న సజ్జల.. ముద్రగడ కాపులకోసం పనిచేసే వ్యక్తి అన్నారు. ముద్రగడ లేఖ వెనక వైసీపీ ఉందంటోంది జనసేన. ఏవరో రాసిస్తే సంతకాలు చేస్తున్నారని ఆరోపించారు ఈ పార్టీ నాయకులు. మొత్తానికి గోదావరి తీరంలో కాపు రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. పవన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో పవన్ అభిమానులు ముద్రగడను టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందుకు ముద్రగడ కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్‌పై తాను పోటీ చేస్తానని ముద్రగడ సవాల్ విసిరారు.ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభంపై కాపు సీనియర్ నాయకుడు హరిరామజోగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధికోసమే ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం చేపట్టారన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేసింది సున్నానేనని విమర్శించారు. ముద్రగడకు పవన్ విమర్శించే స్థాయి లేదని హరి రామ జోగయ్య వ్యాఖ్యానించారు. కాపుల కోసం పవన్ కల్యాణ్ పార్టీ పెట్టలేదని చెప్పారు. ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకే పవన్ రాజకీయాల్లోకి వచ్చారని హరిరామ జోగయ్య పేర్కొన్నారు.