అనంతపురం, జూన్ 24,
రిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన శ్రీరామ్ ఈసారి ధర్మవరం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీ చేసే అవకాశాలున్నాయి. ధర్మవరంలోనూ పరిటాల కుటుంబానికి కొంత గ్రిప్ ఉండటంతో ఈసారి అక్కడి నుంచి పోటీ చేసి శాసనసభలోకి అడుగు పెట్టాలని శ్రీరామ్ భావిస్తున్నారు. సూరి వెళ్లిపోవడంతో... ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీకి పట్టుంది. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరుపున గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి ధర్మవరం నుంచి గెలిచారు. అయితే 2019లో ఓటమి పాలయిన తర్వాత తనకున్న సమస్యల దృష్ట్యా ఆయన బీజేపీలో చేరారు. దీంతో ధర్మవరం నియోజకవర్గ ఇన్ ఛార్జి బాధ్యతలను పరిటాల శ్రీరామ్ కు చంద్రబాబు అప్పగించారు. తొలుత అయిష్టంగానే బాధ్యతలను తీసుకున్న శ్రీరామ్ తర్వాత ధర్మవరం నియోజకవర్గంలో తన పట్టును పెంచుకునే ప్రయత్నం గత కొంతకాలంగా చేస్తున్నారు. తరచూ పర్యటిస్తూ తనకంటూ ప్రత్యేక క్యాడర్ ను ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీలోకి సూరి... ప్రస్తుతం బీజేపీలోనే వరదాపురం సూరి కొనసాగుతున్నారు. కానీ ఎన్నికల నాటికి వరదాపురం సూరి తిరిగి టీడీపీలోకి వస్తారన్న ప్రచారాన్ని ఆయన అనుచరులు చేస్తున్నారు. ఇది పరిటాల వర్గానికి మింగుడుపడటం లేదు. దీంతో వరదాపురం సూరిపై నేరుగా మాటల యుద్ధానికి దిగుతున్నారు. సూరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అక్రమాలను పరిటాల వర్గం తరచూ బయటపెడుతూ ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకోవద్దని ఎప్పటికప్పుడు పరిటాల శ్రీరామ్ పార్టీ అధినాయకత్వానికి తెలియజేస్తున్నారు. చంద్రబాబు కూడా పార్టీ కష్టకాలంలో ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తామని చెప్పడంతో పరిటాల శ్రీరామ్ కు తనకు ధర్మవరం టిక్కెట్ గ్యారంటీ అని భావిస్తున్నారు. కానీ లాబీయింగ్ చేసి చివరి క్షణంలోనైనా వరదాపురం సూరి పార్టీలో చేరగలరని, లేకుంటే పొత్తులు కుదిరితే అటువైపు నుంచి సూరి వస్తారని భావించిన పరిటాల శ్రీరామ్ నేరుగా ఆయనపై విమర్శలు చేస్తున్నారు. మొత్తం మీద పరిటాల శ్రీరామ్ ధర్మవరం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి సూరి చివరకు ఎగరేసుకుపోతారా? లేక శ్రీరామ్ కే సీటు దక్కుతుందా? అన్నది చూడాలి. అయితే ఇద్దరి మధ్య విభేదాలు మరోసారి సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి అడ్వాంటేజీగా మారే అవకాశాలు లేకపోలేదు.