YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైఎస్ భారతికి ఏమైంది...

 వైఎస్  భారతికి ఏమైంది...

విజయవాడ, జూన్ 24, 
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఇదివరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారాయన. అనంతరం పదోన్నతి మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎలివేట్ అయ్యారు. కిందటి నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలను కూడా స్వీకరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నేపథ్యంలో- ప్రశాంత్ కుమార్ మిశ్రా సన్మాన కార్యక్రమం, ఆయన గౌరవార్థం విందును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్‌‌లో ఈ కార్యక్రమం ఏర్పాటయింది. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి, ఏపీ హైకోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి తదితరులు హాజరయ్యారు వైఎస్ జగన్, వైఎస్ భారతి.. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి విజయవాడకు చేరుకున్నారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా.. కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నప్పుడు వైఎస్ జగన్ ఎదురెళ్లి స్వాగతం పలకడం కనిపించింది. ఆయనకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి ఆహ్వానించారు. అనంతరం ఆయనను సన్మానించారు. శ్రీవేంకటేశ్వర స్వామివారి జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు.  ఈ కార్యక్రమానికి పలువురు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, శాసన మండలి- శాసన సభ సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, పోలీస్ డైరెక్టర్ జనరల్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ భారతి.. చేతికి కట్టుతో కనిపించారు. కుడి చేతికి కట్టు కట్టుకున్నారు. ఆమె చెయ్యి బెణకడం వల్లే కట్టు కట్టుకున్నారు. ఈ గాయం ఎలా అయిందనేది తెలియరావట్లేదు. కుడి చేతి భుజానికి అయిన గాయానికి డాక్టర్ల సలహా మేరకు వైఎస్ భారతి కట్టు కట్టుకున్నారు. కార్యక్రమం మొత్తం ఆమె కట్టుతోనే కనిపించారు. ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. చర్చనీయాంశమైంది.

Related Posts