YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొండెక్కిన కోడి ధరలు

కొండెక్కిన కోడి ధరలు

కోడి మాంసం ధరలు కొండెక్కాయి. వ్యాపారస్తులు ఒకరిని చూసి మరొకరు విపరీతంగా ధరలు పెంచేశారు. దీంతో సామాన్యులు కోడి మాంసం తినలేని పరిస్థితి ఏర్పడింది. పొట్టేలు తదితర మాంసాలతో కొవ్వు పెరుగుతుందని వైద్యులు చెప్పడంతో జనాలు క్రమేపి కోడి మాంసం వైపు మళ్లారు. వేసవిలో కోడి మాంసం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్పినా మాంసం రుచులకు అలవాటు పడిన ప్రజలు మానుకోలేక పోతున్నారు. దీంతో కోడి మాంసానికి డిమాండ్‌ ఉండడంతో ధరలు కొండెక్కాయి. మండలంలో మటన్‌ వ్యాపారుల సంఖ్య కంటే చికెన్‌ దుకాణాదారుల సంఖ్య అధికంగా ఉంది. మటన్‌ కిలో ధర రూ.450లు ఉంది. దీంతో జనమంతా తక్కువ ధరలున్న చికెన్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని చికెన్‌ వ్యాపారస్తులు కిలో కోడి మాంసం ధరలను రూ.160 నుంచి రూ.240లకు పెంచారు. గతేడాది వంద రూపాయలున్న ధర నేడు రెట్టింపైందని సామాన్యులు వాపోతున్నారు. వ్యాపారస్తులు ఇష్టారీతి ధరలు పెంచారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒంగోలు నగరంలో కంటే చుట్టుపక్కల మండలాల్లో రూ.30 నుంచి రూ.40లు అధికంగా అమ్మకాలు చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంతనూతలపాడు మండలంలో ఒక్క గుమ్మళంపాడులో తప్ప మిగిలిన గ్రామాలైన మంగమూరు, మైనంపాడు, చిలకపాడు, మద్దులూరు, గుడిపాడు తదితర ప్రాంతాల్లో చికెన్‌ దుకాణా దారులు ఐక్యంగా అధిక ధరలకు చికెన్‌ అమ్ముతున్నారు. వేసవిలో కోళ్లకి గిరాకి పెరిగిందని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. కోడి ధరలను బట్టే మాంసం అమ్మకం ధరలు ఆధారపడతాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. చికెన్‌ ధరలు విపరీతంగా పెరిగి పోవడంతో సామాన్యులు కోడి మాంసాన్ని తినలేని పరిస్థితి నెలకొంది.కోడి మాంసం ధరలు  రూ.240లు పలకడంతో చికెన్‌పకోడికి విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. 100 గ్రాముల చికెన్‌ పకోడి ఏకంగా రూ.40కి చేరింది. సాయంత్రం చికెన్‌ పకోడీని స్నాక్స్‌లాగా తీసుకోవడానికి అలవాటు పడిన వారికి నేడు చికెన్‌ పకోడి కొనాలంటే కాస్త ఇబ్బందిగా మారింది. మందుబాబులు సైతం చికెన్‌ పకోడీకి బదులు శనగపిండి పకోడితో సర్దుకుంటున్నారు. దీంతో పెరిగిన చికెన్‌ ధరలకు అన్ని వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts