రాజమండ్రి, జూన్ 26,
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి నాయకత్వాన్ని పటిష్టం చేసేందుకు చర్యలు వేగవంతం చేస్తోంది. త్వరలోనే ప్రత్యేక కార్యక్రమాలను ప్లాన్ చేయాలని భావిస్తోంది. ఎట్టి పరిస్దితుల్లో ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ మిగిలి పార్టీలతో పోటీగా రణక్షేత్రంలో నిలబడాలనే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రత్యర్థులు ఎలాంటి ఎత్తుగడలు వేసినా డోంట్ కేర్ అనేలా ఉండాలని స్కెచ్ వేస్తోంది. ముందుగానే క్లారిటితో పోటీలో భాగం కావాలనే ఆలోచనతో పార్టీని నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు టాక్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే తెలంగాణాలో కీలకంగా భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది. అయితే తెలంగాణాలో కన్నా ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని అనుకున్న స్థాయిలో బలోపేతం చేయలేకపోయారు. తెలంగాణలో కనిపించన దూకుడు ఆంధ్రప్రదేశ్ నాయకుల్లో లేదు. మీడియా ముందు కాస్త కూస్తో స్పీడున్నట్టు కనిపిస్తన్నా క్షేత్రస్థాయిలో ఆ ఊపు లేదన్నది బీజేపీ నేతల మాట. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తొమ్మిది సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా జిల్లాల వారీగా సభలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ చేసిన సహకరాన్ని గురించి వివరించే పనిలో నేతలు ఉన్నారు. కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పరివార్‌తోపాటుగా రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ నేతలు జిల్లాల వారీగా సమావేశాల్లో పాల్గొంటున్నారు. కేంద్రం అందిస్తున్న సహకారాన్ని వివరించటంతోపాటుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల ముందు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో చేరారు. దీంతో ఆయన్ను కేంద్రంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీని యాక్టివ్ చేయాలనే ఆలోచనలో కూడ కేంద్ర నాయకత్వం ఉందని అంటున్నారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రోడ్ షోలను నిర్వహించేందుకు అవసరమైన ప్లాన్ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారట. అయితే ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండేలా రూట్ మ్యాప్‌ను తయారు చేయాలని భావిస్తున్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతుంది.
ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేతల్లో రకరకాలుగా ఆలోచనలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరు ఎమన్నా, మాస్ క్రౌడ్‌ను సంపాదించుకునేందుకు పార్టీ విశ్వ ప్రయత్నాలు చేయాల్సి వస్తోంది. భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు జనాన్ని తరలించటం ప్రస్తుం సవాల్‌గా మారింది. అయితే పార్టీని మాస్‌లోకి తీసుకువెళ్ళాలంటే ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలు గురించి పార్టీ నేతలు నానా తంటాలు పడుతున్నారు.