YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతుల ఖాతాల్లోకి డబ్బులు

రైతుల ఖాతాల్లోకి డబ్బులు

హైదరాబాద్, జూన్ 26, 
అన్నదాతలకు ప్రతి సీజన్‌లో అందిస్తున్న పంట పెట్టుబడి సాయం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు బంధు సాయాన్ని జూన్ 26 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇక.. ఈ ఏడాది 70 లక్షల మంది రైతులకు రైతుబంధు అందనున్నట్లు కేసీఆర్‌ సర్కార్‌ తెలిపింది. గతేడాది కంటే 5 లక్షలమంది కొత్త లబ్దిదారులు పెరగనున్నట్లు వెల్లడించింది. అలాగే.. లక్షా 50 వేల మంది పోడు భూముల రైతులకు చెందిన సుమారు 4 లక్షల ఎకరాలకు కూడా రైతుబంధు జమ కానున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ వానాకాలం సీజన్‌లో మొత్తం 7,720 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఏడాది లబ్దిదారులు పెరగటంతో గతంలోకన్నా ప్రభుత్వంపై సుమారు 300 కోట్ల అదనపు భారం పడనుంది. 11వ విడతతో రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు జమ అయిన రైతు బంధు నిధులు 72వేల 910 కోట్లకు చేరనున్నాయి. కోటి 54 లక్షల ఎకరాలకు సాయం అందుతోందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.వానాకాలం రైతుబంధు నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రైతాంగం పక్షాన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి. గతంలో మాదిరిగానే ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ అవుతున్నాయన్నారు. ఈ సారి కొత్తగా రైతుబంధు సాయం తీసుకోనున్న రైతులు.. బ్యాంకు అకౌంటు వివరాలతో.. స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా.. దేశంలో ఏడాదికి ఎకరాకు 10 వేలు సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టిస్తోందన్నారు. రైతులు, వ్యవసాయం పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న ఆప్యాయతకు.. రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరెంట్‌, సాగునీటి సరఫరానే నిదర్శనాలని గుర్తు చేశారు నిరంజన్‌రెడ్డి. కాళేశ్వరంతో ఒక్క ఎకరా సాగులోకి రాలేదని విమర్శలు చేస్తున్న విపక్షాలు.. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వానికి రాసిన లేఖలు చూసి కళ్లు తెరవాలన్నారు. బియ్యం సరఫరాపై కేంద్రం చేతులు ఎత్తేస్తే పొరుగు రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఖర్చు ఎంతయినా రైతు నష్టపోకూడదన్నదే కేసీఆర్ ఆలోచన అన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి.మొత్తంగా… ఆలస్యంగా తొలకరి జల్లులు మొదలు కావడంతో రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో.. విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్న్ల రైతులకు రైతు బంధు సాయం ఖాతాల్లో జమ అవుతుండటం కాస్తా ఊరటనిస్తోంది.

Related Posts