కాకినాడ, జూన్ 27,
జనసేనాని వారాహి విజయ యాత్ర అవిభజిత తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా ముగిసిందనే చెప్పాలి. ’వారాహి’ని లేటుగా ప్రారంభించినా రాజకీయవర్గాల దృష్టిని ఆకర్షించడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్రతో పోలిస్తే పవన్ యాత్రకు బాగానే స్పందన వచ్చింది. పన్నెండు రోజులపాటు రాజమండ్రి, కాకినాడ, డా.అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. చేనేత, మత్స్యకార, వెనుకబడిన వర్గాలతో పాటు ముస్లింలతో కూడా భేటీ అయ్యారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని గతంలో చేసిన పవన్ ప్రకటనలకు భిన్నంగా ‘వారాహి’ ముందుకు వెళ్లింది. జనమంతా ఓట్లేసి తనను సీఎం చేయాలని పవన్ రెండో రోజే ప్రకటించడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిమీద తెలుగుదేశం నాయకులు టీవీ చర్చల్లో మండి పడ్డారు. ‘అసెంబ్లీ గేటు దాటలేని వాళ్లు సీఎం ఎలా అవుతారం’టూ నిలదీశారు. ఓ రెండ్రోజుల తర్వాత మళ్లీ పవన్ మాట మార్చారు. తాను గెలుస్తానని ఖచ్చితంగా చెప్పలేనని, అందరూ సంఘటితం కాకపోతే వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తుందని తన భయాన్ని వ్యక్తం చేశారు.తన అభిమానులను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో పవన్ వాడిన భాష కూడా వివాదాస్పదమైంది. తోలుతీస్తా, కింద పడుకోబెడతా, గుండు గీయిస్తా లాంటి పదాలపై సీనియర్ కాపు నాయకుడు ముద్రగడ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన సంధించిన లేఖాస్త్రం కాపుల్లో ఉన్న అనైక్యతను మరోసారి బహిర్గతం చేసింది. పవన్, అతని అభిమానులు ముద్రగడను టార్గెట్ చేయడంతో ఆయన మరోసారి ముప్పయ్ ప్రశ్నలతో మరో బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ పూర్తయ్యే సమయానికి రాజకీయాల్లోకి ముద్రగడ రీ ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల బరిలో దిగితే ఆయన జగన్ పక్షాన చేరుతారనేది బహిరంగ రహస్యం, గోదావరి జిల్లాల్లో ఉన్న కాపు ఓట్లన్నీ తనకే పడాలని, అన్ని సీట్లూ తానే సాధించాలని పవన్ ఆశిస్తున్నారు. అదే విషయాన్ని ఆయన బహిరంగంగా చెప్పారు. కులాలన్నీ సంఘటితంగా ఉండాలని, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన చెబుతున్నారు. కానీ తన రాజకీయమంతా ఉభయ గోదావరి జిల్లాల చుట్టూనే తిరుగుతోంది. కులం వద్దు అని మాట్లాడుతూ ఆ రెండు జిల్లాల్లో ఉన్న కాపుల ఓట్ల కోసం పవన్ తాపత్రయ పడటం విశేషం. తన మొఖం చూసి తమ కూటమికి ఓటేయాలని, భాజపా విషయం పట్టించుకోవద్దని ముస్లింలతో జరిగిన సమావేశంలో అడగడం గమనార్హం. నూటికి తొంభై శాతం మంది ముస్లింలు భాజపాకు ఓటు వేయరు. గత తొమ్మిదేళ్లలో ముస్లింల విషయంలో భాజపా తీరు పట్ల వాళ్లు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ చెబితే వాళ్లు మారిపోతారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. Also ఇక ఎప్పట్లానే వైకాపాపై ఒంటికాలిపై లేస్తున్నారు జనసేనాని. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని ఆరోపిస్తున్నారు. వైకాపా రౌడీయిజాన్ని జనం భరించలేకపోతున్నారని, ఆ పాలన నుంచి విముక్తి లభించాలని పేర్కొంటున్నారు. 100 మంది సొమ్మును 30, 40 మందికి పంచుతున్నారని ఆయన వైకాపా సంక్షేమ పథకాలను విమర్శించారు. ఎన్నికల్లో ఒంటరి పోరా? తెలుగుదేశంతో కలుస్తారా? అనే విషయంలో కూడా జనసేనాని క్లారిటీ ఇవ్వడం లేదు. లోకేష్ పాదయాత్ర రాయలసీమ దాటిన తర్వాతే వారాహి యాత్ర ప్రారంభమైందన్న ప్రత్యర్థుల ఆరోపణలపై కూడా ఆయన నోరు మెదపడం లేదు. పొత్తుల గురించి పవన్ ఏమీ మాట్లాడకపోయినా, ఎన్నికల సమయానికి తెలుగుదేశంతో కలుస్తారని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలను గురించి ఒక్క విమర్శ చేయకపోవడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. మొత్తమ్మీద కాపు ఓట్లను ఏకం చేసే ఉద్దేశంతోనే వారాహి యాత్ర సాగుతుండటం ఎవరూ కాదనలేని సత్యం.