తిరుపతి, జూన్ 27,
ఇటీవల అలిపిరి నడక దారిలో చిన్నారిపై చిరుత దాడి దురదృష్టకర ఘటన అని ప్రిన్సిపల్ చీఫ్ అటవీ సంరక్షణ అధికారి మధుసూదనా రెడ్డి అన్నారు. నడక దారికి ఇరువైపుల కంచె నిర్మాణం సాధ్యం కాదని, చీకటి పడ్డాక భక్తులు కొండపైకి గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. సోమవారం తిరుపతిలోని ఎర్రచందనం గోడౌన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అలిపిరి నడక మార్గంలో చీకటి పడ్డాక గుంపులుగా వెళ్ళాలని భక్తులకు సూచించారు. చిరుత అధికంగా సంచరించే ప్రదేశాల్లో మరిన్ని కెమెరా ట్రాప్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇంకా తల్లి చిరుత సంచరిస్తోంది అనడానికి ఆనవాళ్లు లేదని, చిరుత ఇక్కడ సాధారణంగా మనుషులపై దాడి చేయలేదని, చాలా అరుదుగానే ఈ ఘటన జరిగిందన్నారు. నడక దారిని శుభ్రంగా ఉంచాలని కోరారు. భక్తులు భయాందోళనకు గురి కాకుండా కాలి నడకన తిరుమలకు వెళ్ళవచ్చని ఆయన తెలిపారు. తిరుమల అటవీ ప్రాంతంలో ఎన్ని చిరుతలు ఉన్నాయన్న స్పష్టమైన సమాచారం తమ వద్ద లేదన్నారు. అలిపిరి నుంచి కొండపైకి నడకదారికి ఇరువైపులా కంచె నిర్మాణం సాధ్యం కాదని, కొన్ని ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. చిరుతలు స్వేచ్ఛగా తిరిగేలా కొన్ని మార్గాల్లో వాటికి ప్రత్యేక రహదారి నిర్మించే ప్రతిపాదన పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవోలతో చర్చించనున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల కోసం ఎలివేటెడ్ ఎక్స్ ప్రెస్ లు నిర్మించాల్సి ఉందని, చిత్తూరు జిల్లాలో ఏనుగుల బెడదపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల అటవీ అధికారులతోనూ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన తెలిపారు. 5400 మెట్రిక్ టన్నులు ఎర్రచందనం అమ్మకాలకు అనుమతి వచ్చిందని, మొదటి విడతలో కొంత విక్రయించామని, రెండవ విడత అమ్మకాలు త్వరలో ప్రారంభం అవుతుందన్నారు. ఎర్ర చందనానికి విదేశీ డిమాండ్ ఈ మాత్రం తగ్గలేదన్నారు. కొన్నేళ్ల కిందట నల్లమల నుంచి పెద్దపులి శేషాచల అడవుల్లోకి వచ్చినట్లు తమకు ఆనవాళ్లు లభించాయని, ఇటీవల కాలంలో ఇక్కడకు పెద్దపులి వచ్చిన దాఖలాలు లేవని చెప్పారు.అటవీ శాఖ గానీ, టీటీడీ గానీ ఎంత మానిటర్ చేసినా దట్టమైన అటవీ ప్రాంతంలో జరుగుతున్న వాటిని నియంత్రించడం అంత చిన్న విషయం కాదన్నారు. ఇక్కడ జంతువులు స్థిర నివాసం ఏర్పరుచుకుంటున్నాయి. గతానికి ఇప్పుడు పోల్చితే ఏనుగుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. న్యూ గ్రీన్ ఫిల్డ్ ఎక్స్ ప్రెస్ వే వస్తే జంతువులు ఈజీగా రోడ్లు క్రాస్ చేయడం సాధ్యపడుతుంది. ఏనుగులకు, ఇతర వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతాయని, వాటిని అన్నిచోట్ల అడ్డుకునే పరిస్థితి ఉండదన్నారు. ప్రతి చోట ఫెన్సింగ్ వేసి వన్య ప్రాణులు స్వేచ్ఛగా వెళ్లకుండా చేయలేమన్నారు. టీటీడీ అధికారులతో చర్చించి చిరుత, ఏనుగులు లాంటి వన్య ప్రాణులు ఫ్రీ పాసింగ్ అయ్యేలా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమని తెలిపారు. జూ పార్కుకు అవసరమైన నిధులను టీటీడీ అందిస్తుంది. కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేసి, తల్లి చిరుతను త్వరలోనే పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలివేస్తామని చెప్పుకొచ్చారు.