నెల్లూరు, జూన్ 27,
గన్ బయోపిక్ ను రెండు భాగాలుగా తీస్తున్న రామ్ గోపాల్ వర్మ తొలి పార్ట్ వ్యూహం టీజర్ ను రిలీజ్ చేశారు. అందులో నేరు చంద్రబాబు పేరు పెట్టి.. ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సన్నివేశాలు పెట్టారని క్లారిటీ వచ్చేసింది. గతంలో ఆర్జీవీ ప్రకటించిన దాని ప్రకారం వ్యూహం సినిమా జగన్ ఇమేజ్ ను పెంచడానికే అనుకున్నారు కానీ.. తర్వాత ప్లాన్ మార్చుకుని చంద్రబాబును టార్గెట్ చేసినట్లుగా తాజా ట్రైలర్ లో ఉందన్న భావన వ్యక్తమవుతోంది. తాను తీయబోయేది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్ అని గతంలో ఆర్జీవీ ప్రకటించారు. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయని ప్రకటించారు. అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి “వ్యూహం” కధ వచ్చిందన్నారు. రాజకీయ కుట్రల విషం తో నిండి వుంటుంది .రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం అని ఆర్జీవీ ప్రకటించారు. ఆ ప్రకారం టీజర్ చూస్తే.. హెలీకాఫ్టర్ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి మరణించడంతో ఈ టీజర్ మొదలైంది. ఆ తరవాత.. ప్రతిపక్షాలు పన్నే వ్యూహాలు, జగన్‌పై సీబీఐ ఎంక్వైరీ, అరెస్ట్… ఇలా టీజర్ సాగుతూ వెళ్లింది. ఇందులో వర్మ కొత్తగా చెప్పిన విషయాలేం లేవు. సంఘటల్ని గ్లోరిఫై చేయడం తప్ప. వర్మ పాత పద్ధతిలోనే జూనియర్ ఆర్టిస్టుల్లాంటి ఫేసుల్ని తెరపైకి తీసుకొచ్చి, సినిమాని చుట్టేసే ప్రయత్నం చేశాడన్న అభిప్రాయం సినిమా విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలంగా పొలిటికల్ బ్యాక్డ్రాప్ లోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. గతంలో ‘వంగవీటి’ సినిమాను తెరకెక్కించారు. తర్వాత 2019 ఎన్నికలకు ముందు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తీశారు. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. ఈ మూవీ తర్వాత మళ్లీ కొన్నాళ్ల తర్వాత ‘కొండా’ అనే పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో ఓ సినిమా చేశారు. ఆ సినిమా వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియలేదు. ప్రమోషన్స్ బాగానే చేసినా సినిమా అసలు ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మళ్లీ వై ఎస్ జగన్ లైఫ్ స్టోరీ బ్యాక్డ్రాప్ లో ఏకంగా రెండు సినిమాలు తెరకెక్కిస్తామని ప్రకటించాడు ఆర్జీవి. మరి ఈ సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతమేరకు ఆకట్టుకుంటాయో చూడాలి. ఈ మూవీ లు కూడా గత సినిమాల లాగా ఏమాత్రం బెడిసికొట్టినా అసలకే మోసం వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైఎస్ అభిమానులు. రెండు సినిమాలు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఇతరులతో తీయిస్తారని.. జగన్ బయోపిక్‌ను మాత్రం ఆయన స్వయంగా దర్శకత్వం చేస్తారని.. జగన్ కు ఎలివేషన్లు ఇచ్చేలా ఈ సినిమ ఉంటుందన్న అభిప్రాయం వినిపించింది. బయోపిక్ కాదు రియల్ పిక్ అని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా చెప్పారు కానీ.. అందులో చంద్రబాబుకు ప్రాధాన్యం ఇవ్వడం.. ఆయనను విలన్ గా చూపిస్తారని స్పష్టమవుతోంది. ఈ సినిమా వచ్చే ఎన్నికల ముందు రిలీజ్ చేసే అవకాశం ఉంది. స్వయంగా వైఎస్ఆర్‌సీపీ అధినేత , సీఎం జగన్ ఆసక్తితో నిర్మిస్తున్నారు కాబట్టి బడ్జెట్ సమస్య రాదని.. ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.