YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేంద్ర కేబినెట్ విస్తరణ అడుగులు..

కేంద్ర కేబినెట్ విస్తరణ అడుగులు..

హైదరాబాద్, జూన్ 27, 
తొమ్మిదేళ్ళ పరిపాలన పూర్తి చేసుకుని ఎన్నికల ఏడాదిలోకి అడుగు పెట్టింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. మరో 9, 10 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. మరోసారి నరేంద్ర మోదీ చరిష్మాను నమ్ముకునే భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు సిద్దమవుతోంది. అయితే, ఈసారి ఆయన చరిష్మానే బీజేపీని గట్టెక్కిస్తుందా అంటే గతంలో వున్నంత ధీమా కనిపించడం లేదు చాలామందిలో. బీజేపీ అభిమానులు సైతం మూడోసారి పార్టీ విజయంపై పూర్తిస్థాయి ధీమాలో లేరు. దానికి కారణం 2019నాటి బీజేపీకి 2023 నాటి బీజేపీకి తేడా కనిపిస్తోంది. ఆనాడు దేశంలో దాదాపు 75 శాతం భూభాగం బీజేపీ లేదా దాని మిత్ర పక్షాల పరిపాలనలో వుంది. కానీ ఇపుడు పరిస్థితి అలా లేదు. మరీ ముఖ్యంగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోయిందన్న విశ్లేషణలు మీడియాలోను, సోషల్ మీడియాలోను విస్తృతంగా వస్తున్నాయి. అదేసమయంలో నరేంద్ర మోదీకి పెరుగుతున్న ఇంటర్నేషనల్ ఇమేజీ మాత్రం ఎవరికీ అందనంత స్థాయికి చేరింది. తాజాగా అమెరికా, ఈజిప్టు పర్యటనల తర్వాత మోదీ చరిష్మా అమాంతం పెరిగిపోయింది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ వున్న నేతల మీద జరిగిన సర్వేలో మోదీ ఏకంగా 76 శాతం ఆమోదాన్ని పొందారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ జాబితాలో ఎక్కడో వున్నారు. ఇంకోవైపు ముస్లిం అధినేతలున్న దాదాపు 13 గల్ఫ్ కంట్రీస్ తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని నరేంద్ర మోదీకి ఇవ్వడం ద్వారా మోదీ పనితీరుకు ఫిదా అయినట్లు తేటతెల్లం చేశారు. ఇదంతా నాణేనికి ఒకవైపే. మరి ఎన్నికల సంవత్సరంలో మోదీ ఎలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా దేశీయంగా తన ప్రభుత్వం ఇమేజీని పెంచుతారు ? ఇదిపుడు చాలా మంది విశ్లేషిస్తున్న అంశం.చరిష్మాలో మోదీని కొట్టే నేత దేశంలో ఎవరు లేరన్నది కొందరికి జీర్ణం కాకపోయినా నిజమేనని చెప్పాలి. అయితే, ప్రభుత్వంలో ఒక్క మోదీ మాత్రమే ఆదరణీయ నాయకుడు అయితే చాలా ? మిగిలిన వారు కూడా అలా వున్నప్పుడే ఎన్నికల్లో ప్రజలను మెప్పించ గలరన్నది చాలా మంది అభిప్రాయం. భారత్ వంటి పెద్ద దేశంలో ఒక్క ప్రధాన మంత్రి మాత్రమే ప్రమాణాలు కలిగిన వ్యక్తి అయితే చాలదు. ఆయన మంత్రివర్గం కూడా ప్రజలను మెప్పించేదిగా వుండాలి. గత తొమ్మిదేళ్ళుగా అన్ని తానై పరిపాలిస్తున్న మోదీకి ఏదైనా మచ్చ వుంది అంటే అది ఆయన కేబినెటేనని చెప్పాలి. మోదీ కేబినెట్‌లో రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జయ శంకర్, పియూష్ గోయెల్, మన్‌సుఖ్ మాండవీయ వంటి వారు కాస్త ఇండిపెండెంట్‌గా వ్యవహరిస్తూ తమదైన ముద్ర ఆయా శాఖలపై వేస్తున్నారు. మిగిలిన వారిలో చాలా మంది స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారన్నది విశ్లేషకుల మాట. చాలా మంది క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నా.. ఒకరిద్దరు అసమర్థులుంటే చాలు మొత్తం మంత్రివర్గానికి చెడ్డపేరు రావడానికి. అలాంటి పరిస్థితే ఇపుడు మోదీ ప్రభుత్వంలో కనిపిస్తుంది. మొన్నటి ఒడిశా రైలు ప్రమాదంతో సంబంధిత మంత్రి అశ్వినీ వైష్ణవ్‌పై ఈ తరహా కామెంట్లే వచ్చాయి. నిజానికి ప్రమాదం జరగడానికి ఇంకా కారణాలు పూర్తిగా తేలకపోయినా ప్రమాదానికి మంత్రి వైఫల్యమూ ఒక కారణమనే చాలా మంది భావిస్తున్నారు. బహుశా ఈ అపప్రధ తప్పించుకోవడానికే కాబోలు అశ్వినీ వైష్ణవ్ .. ప్రమాదం జరిగిన తర్వాత తిరిగి రైళ్ళ పునరుద్ధరణ జరిగే వరకు అంటే దాదాపు 56 గంటల పాటు ప్రమాద స్థలాన్ని వీడలేదు. గతంలో ఏ మంత్రి పని చేయనంతగా గ్రౌండ్ లెవెల్లో అశ్వినీ వైష్ణవ్ పని చేశారు. రాత్రింబవళ్ళు అక్కడి కార్మికులతో మమేకమై ట్రాక్ పునరుద్దరణ జరిగేలా చూశారు. ఈరకంగా ఆయన కొంత మంది అభిమానాన్ని చూరగొనవచ్చు గాక… కానీ ప్రమాదం మచ్చను మాత్రం పూర్తిస్థాయిలో తప్పించలేకపోయారు.

Related Posts