విజయవాడ, జూన్ 28,
ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వరుసగా వారసులకు లైన్ క్లియర్ అవుతోంది. గుంటూరు శాసన సభ్యుడు ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమాకు సీట్ ఇచ్చేందుకు సీఎం జగన్ ఓకే చెప్పారనే ప్రచారం జోరుగా సాగుతోంది.వైఎస్ఆర్ సీపీలో వరుసగా వారసులకు లైన్ క్లియర్ అవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా వైసీపీ నేత, గుంటూరు శాసన సభ్యుడు ముస్తఫా స్థానంలో ఆయన కుమార్తె నూరి ఫాతిమాకు సీట్ ను ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకారం తెలిపినట్లుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు వరుసగా రెండు సార్లు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ముస్తఫా విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ ప్రకటించిన నాటి నుండి ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. జగన్ రెండు సార్లు టిక్కెట్ ఇవ్వటంతో వరుసగా రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంది జగన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. మైనార్టీ వర్గాల ఓట్ బ్యాంక్ కీలకంగా ఉండే గుంటూరు తూర్పులో ఈ సారి ముస్తఫా తన కుమార్తెకు అవకాశం ఇవ్వాలని గతంలో అనేక సార్లు జగన్ వద్ద ప్రస్తావించారు. అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆయన కుమార్తెకు సీటు ఇచ్చే విషయంలో జగన్ క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. తన తండ్రి రాజకీయంగా ప్రోత్సహించటంతో నూరి ఫాతిమా ఇప్పటికే నియోజకవర్గంలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. తండ్రి తో పాటుగా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఆమె పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రజల వద్దకు వెళ్ళి వారితో మీటింగ్ లు పెట్టి, సమస్యలపై స్థానికంగా ఉన్న అధికారులను సైతం సంప్రదించి, వాటిని కొలిక్కి తీసుకురావటం లో కూడ ఆమె కీ రోల్ పోషిస్తున్నారు. ముస్లిం వర్గానికి చెందిన మహిళ కావటం, అందులోనూ తండ్రి వరుసగా రెండు సార్లు నియోజకవర్గంలో విజయం సాధించిన రికార్డ్ కూడ ఉండటంతో ఆమె గెలుపుపై ఇప్పటికే పార్టీ వర్గాలు అంచనాకు వచ్చారని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక సర్వే తరువాత, జగన్ ముస్తఫా రాజకీయ వారసురాలికి లైన్ క్లియర్ చేశారని అంటున్నారు.ఎమ్మెల్యే ముస్తఫా రాజకీయ వారసురాలుగా ఎంట్రీ ఇవ్వనున్న నూరి ఫాతిమా ఇప్పటికే శాసన సభ్యురాలు అంటూ గతంలో పోస్టర్లు సైతం వెలిశాయి. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గోనేందుకు వస్తున్న ఆమెకు నిర్వాహకులు శాసన సభ్యురాలుగా పేర్కొంటూ బ్యానర్లు వేశారు. అయితే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా పేర్కొంటూ బ్యానర్ వేయటంతో అది కాస్త వైరల్ గా మారి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తండ్రి తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేస్తుంటే, కుమార్తె పశ్చిమ నియోజకవర్గం నుండి సీట్ ఎలా వస్తుందని చర్చ సైతం జరిగింది. అయితే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టిలో సీట్ రాకపోతే, తన కుమార్తె కోసం ముస్తాఫా తెలుగు దేశం పార్టీలో జాయిన్ అయ్యేందుకు సైతం సై అన్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది.వైఎస్సార్ సీపలో వారసులకు వరుసగా అవకాశాలు దక్కేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మచిలీపట్టణం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పేర్ని నాని శాసన సభ్యుడిగా ఉన్నారు.
జగన్ మెదటి క్యాబినేట్ లో పేర్ని నానికి మంత్రి పదవి కూడా దక్కింది. ఆ తరువాత నుంచి పేర్ని మరింత దూకుడుగా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటూ, ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తూ జగన్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. దీంతో ఆయన విన్నపం మేరకు పేర్ని నాని వారసుడు, పేర్ని కిట్టుకు సీట్ ఇచ్చేందుకు జగన్ అంగీకారం తెలిపారని అంటున్నారు. ఇప్పుడు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి మైనార్టీ వర్గానికి చెందిన ముస్తఫా కుమార్తెకు సీట్ దక్కిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.