YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

డిజిటల్ ఎనర్జీ మైనింగ్ పేరేుతో మోసం

డిజిటల్ ఎనర్జీ మైనింగ్ పేరేుతో మోసం

విజయవాడ, జూన్ 28, 
ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ నియోజకవర్గంలో మరో మోసం బట్టబయలైంది. కొందరు కేటుగాళ్లు డిజిటల్ ఎనర్జీ మైనింగ్ ఆన్‌లైన్ యాప్ పేరుతో ప్రజల్ని మోసం చేశారు . వారిని నమ్మి చైన్ లింక్ పద్దతిలో ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన 800 మందికి పైగా సభ్యులు పెట్టుబడులు పెట్టారు . ఒక్క పెండ్యాల గ్రామంలోనే 5 కోట్లకు పైగా లావాదేవీలు చేశారు. చండీగఢ్ నుంచి పెండ్యాల గ్రామానికి చెందిన వ్యక్తి ద్వారా లింక్ రావడంతో నమ్మి పెట్టుబడులు పెట్టారు గ్రామస్తులు. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రెండు లక్షలు వస్తాయని నమ్మించారు. ఇంకేముంది..
పెట్టినదానికి డబుల్‌ వస్తాయనుకుని.. కోట్లలో పెట్టుబడులు పెట్టారు. స్థాయిని బట్టి లావాదేవీలు చేసిన గ్రామస్తులు.. వేలతో మొదలు పెట్టి లక్షల్లోనూ ట్రాన్సాక్షన్లు నిర్వహించారు. మొదట్లో లావాదేవీలు బాగానే నడిచాయి. ఆ తర్వాత డబ్బులు తిరిగి వచ్చే సమయానికి యాప్‌ పనిచేయకుండా పోయింది. 16వ తేదీ నుంచి డిజిటల్ ఎనర్జీ మైనింగ్ పేరుతోనున్న యాప్ పనిచేయకపోవడంతో తాము మోసపోయినట్లు బాధితులు గుర్తించారు . యాప్‌ పనిచేయకపోవడంతో పెట్టుబడులు బాధితులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. అధిక డబ్బులు వస్తాయని.. అత్యాశకు పోయి.. నిండా మునిగామంటూ ఆవేదన చెందుతున్నారు. అయితే.. లక్షల్లో నష్టపోయినా.. మోసాన్ని బయటకు చెప్పేందుకు మాత్రం సాహసించడం లేదు బాధితులు. కొందరు మాత్రం.. తమలా మరెవరూ మోసపోవద్దని సూచిస్తున్నారు. ఇక.. డిజిటల్ ఎనర్జీ మైనింగ్ ఆన్‌లైన్ యాప్ నిర్వాహకుల మోసంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. మొత్తంగా.. లోన్‌ యాప్‌ మోసాలు నగరాలు, పట్టణాల నుంచి గ్రామాలకు చేరడం కలవరపెడుతోంది.

Related Posts