YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఉభయగోదావరి జిల్లాల కోసం మాస్టర్ ప్లాన్

ఉభయగోదావరి జిల్లాల కోసం మాస్టర్ ప్లాన్

కాకినాడ, జూన్ 28, 
వారాహి విజయ యాత్రను ప్రారంభించామని ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సంకేతాలను పరిశీలిస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బలంగా అర్థమవుతుందన్నారు. 2008 నుంచి రాజకీయ ప్రస్థానంలో ముందుకు వెళ్తున్నామన్నారు. మార్పు వచ్చే వరకు దాన్ని వదలకూడదని పట్టుదలతో ఉన్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఎన్ని లక్షలు పోసినా సభలకు ఇంత మంది రారని. రాజోలులో స్వచ్చందంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారన్నారు. మార్పు మొదలైందన్న దానికి ఇదే సంకేతం అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.ఇసుక రీచ్‌లో అడ్డగోలుగా జరిగిన దోపిడీ వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆదాయం పోకుండా కాలుష్యాన్ని పారద్రోలాలని, ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధి కోసం ఒక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. అందులో ముఖ్యమైన అంశం కాలుష్య నివారణ అని. ఆక్వా కల్చర్ వల్ల ఆదాయంతోపాటు ఆపద ఉందన్నారు. ఆదాయం పోకుండా కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.‘తూర్పు గోదావరి జిల్లాలో గ్రామాల్లో కూడా నీరు పచ్చగా వస్తోంది. ఇలాంటి పరిస్థితులు కిడ్నీలు లాంటి అవయవాలను దెబ్బతీస్తున్నాయి. ఉద్దానం లాంటి పరిస్థితులు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వచ్చేస్తున్నాయి’ అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పచ్చదనం దెబ్బ తినకుండా ప్రజలు ఉపాధి అవకాశాలు కోల్పోకుండా ఆదాయం రావాలని, దాని కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని జనసేనాని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న దివ్వ క్షేత్రాలను అనుసంధానం చేసే విధంగా డివోషనల్ సర్క్యూట్ రూట్ ఏర్పాటు చేసి పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నరసాపురంలో కాలువలు ఉన్నా కేరళ తరహా పర్యాటకం అభివృద్ధి చేయలేకపోతున్నామని, బలమైన వ్యూ ఉంటేనే అది సాధ్యమవుతుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.జనసేన నేతలు, జనసైనికుల ఆత్మగౌరవాన్ని ఎట్టి పరిస్థితుల్లో తాకట్టు పెట్టనని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. మన దగ్గర పెట్టుబడి పెట్టే వారు లేరన్న ఆయన ముఖ్యమంత్రికి , నాయకులకు కాంట్రాక్టులు , అక్రమార్జనలు ఉన్నాయన్నారు. ‘నేను ఒక వ్యవస్థ నడుపుతున్నాను. నాకు అలాంటి అక్రమార్జన ఉంటే ముందుకు వెళ్లగలిగేవాడిని కాదు. నేను పార్టీ నడుపుతూ ఇన్నాళ్లు దెబ్బలు తిన్నాను తప్ప మీ ఆత్మగౌరవాన్ని ఎక్కడా తాకట్టు పెట్టలేదు. ఇప్పటి వరకు రాజకీయాల్లో ప్రలోభాలకు చోటివ్వకుండానే ఉన్నాం. ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా ఇంత అభిమానం రాదు. ఇవన్నీ డబ్బుతో కొనేవి కాదు. తెలంగాణ , తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లినా ఇదే స్థాయి అభిమానం ఉంటుంది. ఆ అభిమాన బలంతో ముందుగా ప్రజా సమస్యల పరిష్కారం మీద దృష్టి సారించాను. తర్వాత పార్టీ నిర్మాణం వైపు అడుగులు వేశాం.’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.జనసేన ప్రభుత్వంలో యూకే తరహా హెల్త్ పాలసీ తీసుకువస్తామన్న పవన్ కల్యాణ్ దీనిపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. దాతలు ఇచ్చిన కాలేజీ స్థలాలు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయని మండిపడ్డారు. పెద్దలు భావితరాల భవిష్యత్తు కోసం ఇచ్చిన భూములు దోచుకుంటున్న వారికి ప్రభుత్వాలు అండగా నిలిచినప్పుడు లక్ష్యాలు దెబ్బతింటాయని చెప్పారు. ‘ప్రభుత్వ స్కూళ్లు , కళాశాలలను బలోపేతం చేయాలి. ఉపాధి అవకాశాలు ఉండాలి. ఇక్కడ ఐటీ పరిశ్రమలు లేవు. తెలంగాణలో 1500 , కర్ణాటకలో 2000 ఐటీ హబ్బులు ఉంటే .. మన రాష్ట్రంలో ఆ స్థాయిలో ఎందుకు లేవు. ఇది మన నేల అన్న తపన ఉన్న నాయకులు పూనుకుంటేనే అది సాధ్యపడుతుంది. మనం నోరెత్తకపోతే సమాజం నాశనం అయిపోతుంది. అందుకే నేను ఉభయ గోదావరి జిల్లాల బాధ్యత స్వీకరించాజ.’ అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. 

Related Posts