న్యూఢిల్లీ, జూన్ 28,
రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. వచ్చే నెల 24వ తేదిన పది రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రమంత్రి జై శంకర్ సహా పది మంది సభ్యుల పదవి కాలం పూర్తి కానుంది. అందుకోసమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనికి సంబంధించి షెడ్యుూల్ విడుదల చేసింది. ఈ ఏడాది జులై-ఆగస్ట్ మధ్య గోవా, గుజరాత్, పశ్చిమ బెంగాల్ నుంచి 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నట్లు తెలిపింది. అయితే పశ్చిమబెంగాల్ ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. గుజరాత్‌లో మూడు, గోవాలో ఒక స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్థానాలకు సంబంధించి జులై 6న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. జులై 13 వరకు నామినేషన్లు వేసుకోవచ్చని.. ఉపసంహరణకు జులై 17న చివరి తేది అని పేర్కొంది.ఇక చివరగా 24వ తేదిన ఉదయం 10 గంటల వరకు నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుందని తెలిపింది. అలాగే ఫలితాలు కూడా అదే రోజున ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా గత ఏడాది జులైలో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఇందులో బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు మూడు రాగా..రాజస్థాన్, మహారాష్ట్రలో ఒక్కో స్థానంలో గెలిచింది. అలాగే పశ్చిమ బెంగాల్‌లోని ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. గోవా మాజీ సీఎం లుజిన్హో ఫలేరో తన స్థానానికి, తృణమూల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయినట్లు పేర్కొంది.