భోపాల్, జూన్ 28,
త్వరలో ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ ఒకటి. ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2023కి సంబంధించి తొలి ఒపీనియన్ పోల్ ఫలితాలు వచ్చేశాయి. మధ్యప్రదేశ్ ఎన్నికలలపై ఫస్ట్ ఒపీనియన్ పోల్ నిర్వహించి బీజేపీ, కాంగ్రెస్ లకు ఎన్ని సీట్లు వస్తాయో వెల్లడించింది. మొత్తం 230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో అధికారం ఈసారి కూడా రెండు పార్టీలను దోబూచులాడేలా కనిపిస్తోంది.మధ్యప్రదేశ్ లో అధికార పార్టీ బీజేపీకి 106 నుంచి 118 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి కనిష్టంగా 108, గరిష్టంగా 120 సీట్లు రావొచ్చునని తాజా ఒపీనియన్ పోల్ సర్వేలో తేలింది. బీఎస్పీకి 1 నుంచి 4 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే గత ఎన్నికల తరహాలోనే మధ్యప్రదేశ్ ఓటర్లు అటు బీజేపీకి గానీ, ఇటు కాంగ్రెస్ కు గానీ సంపూర్ణ మెజార్టీ ఇవ్వడం లేదు. హంగ్ వచ్చినా రావొచ్చునని తాజా సర్వే చెబుతోంది. అయితే ఓట్ల పరంగా చూసినా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు 44 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు.2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీకి నిలిచింది. సాధారణ మెజార్టీకి 2 సీట్లు తక్కువగా వచ్చాయి. బీజేపీ 109 స్థానాల్లో గెలుపొంది, రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేక పోయినప్పటికీ, 15 ఏళ్ల తరువాత మధ్యప్రదేశ్ లో హస్తం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మాజీ సీఎం కమల్ నాథ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఒక SP ఎమ్మెల్యే, నలుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. దాదాపు ఏడాదిపాటు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింది. కానీ అధిష్టానం తనను సీఎం చేయలేదని, తనకు గౌరవం దక్కడం లేదంటూ పార్టీని వీడి బీజేపీలో చేరారు. తనతో పాటు 22 మంది ఎమ్మెల్యేలను కాషాయపార్టీలోకి తీసుకెళ్లడంతో కమల్ నాథ్ సర్కార్ కూలిపోయింది. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతుతో మెజార్టీ రావడంతో శివరాజ్ సింగ్ చౌహాన్ నాల్గవసారి ముఖ్యమంత్రి అయ్యారు.త్వరలో జరగనున్న ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలను ఎదుర్కొని బీజేపీ అధికారంలోకి రావడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, ఏబీసీ సీ ఓటర్ తొలి ఒపీనియన్ పోల్ లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు షేర్ సమానంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే నాలుగైదు సీట్లు అధికంగా వస్తాయని తాజా సర్వేలో వచ్చింది.