YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శృతి మించుతున్న సోషల్ మీడియా వార్

శృతి మించుతున్న సోషల్ మీడియా వార్

విజయవాడ, జూన్ 29, 
ఏపీలో ప్రధాన పార్టీ మధ్య ఫేక్‌ ప్రచారం పతాక స్థాయికి చేరింది. అసత్య ప్రచారాలు హద్దులు దాటేసి మార్ఫింగ్ ఫోటోల స్థాయికి ఎదిగాయి. అబద్దాల ప్రచారంలో పార్టీలు పోటీలు పడుతున్నాయి. సోషల్ మీడియాలో హద్దు, అదుపు లేకుండా ముసుగు ముఖాలు చెలరేగిపోతున్నాయి.ఏపీలో పొలిటికల్‌ వార్ బయట కంటే సోషల్‌ మీడియాలోనే ఎక్కువ జరుగుతోంది. రాజకీయ పార్టీల తరపున వాటి సోషల్‌ మీడియా ఖాతాల్లో అభిమానులు తమ పార్టీల తరపున చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో మార్ఫింగ్ ఫోటోలు, నకిలీ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ట్విట్టర్‌ టీడీపీ,వైసీపీల మధ్య చిన్నపాటి యుద్దమే నడిచింది. టీడీపీ అనుకూలంగా పోస్టులు పెట్టే మహిళపై వైసీపీ అభిమానులు విరుచుకుపడ్డారు. ఆమె వ్యక్తిగత ఫోటోలను ట్రోల్ చేశారు. దీంతో అవి మార్ఫింగ్ అంటూ బాధితురాలు వీడియో ద్వారా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలకు కారణం మీరంటే మీరేనని ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు.సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు గిరాకీ పెరగడంతో రాజకీయ పార్టీల తరపున వకాల్తా పుచ్చుకుని అభిప్రాయాలు వ్యక్తం చేసే వారికి గిరాకీ పెరిగింది. ఈ క్రమంలో అయా వ్యక్తులు నిరాధార ఆరోపణలతో సోషల్‌ మీడియాలో తమ పరపతి పెంచుకునే ప్రయత్నాలు చేయడమే ఈ వివాదాలకు అసలు కారణంగా కనిపిస్తోంది.ఏపీ అన్ని ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున సోషల్ మీడియా బృందాలను సమకూర్చుకున్నాయి. వీటికి తోడు అయా పార్టీలకు కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్న సంస్థలు కూడా ఫేక్ ప్రచారాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి.రాజకీయ విమర్శల పేరుతో జనం మెదళ్లలో విషప్రచారాల ద్వారా అనుమానాలు నెలకొల్పడం వీటి కార్యకలాపాల్లో ప్రధాన భాగం అయిపోయింది.తాజాాగా టీడీపీ, వైసీపీల మధ్య తలెత్తిన వివాదం వివేకా హత్య కేసు దర్యాప్తుతో ప్రారంభమైంది. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డి పాత్ర గురించి టీడీపీ పెద్ద ఎత్తున ట్రోల్ చేసింది. ఈ క్రమంలో 2019లో వివేకా హత్య సమాచారం తాడేపల్లికి తెల్లవారు జామునే తెలిసిందని కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను ఆధారంగా చేసుకుని ముఖ‌్యమైన వ్యక్తుల కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసుకుని ట్రోలింగ్ ప్రారంభించారు. ఓ దశలో ఇవి శృతి మించిపోయాయి.ఈ తరహా ప్రచారాల్లో నిజనిజాలు బయటకు తెలిసే అవకాశం ఎప్పటికీ ఉండదు. కానీ వ్యక్తిత్వ హననం, సోషల్ మీడియా దుష్ప్రచారాలతో దుమ్మెత్తిపోయడం ఓ పథకం ప్రకారం జరుగుతుంటుంది. కొన్నాళ్లకు అవే జనం మనసులో నాటుకుపోతాయి. సోషల్ మీడియాలో ఈ తరహా పోస్టులు పెట్టే వారెవరికి అసలు ముఖాలు, పేర్లు కూడా ఉండవు. వారు పెట్టే పోస్టులను బట్టి ఏ పార్టీకి చెందిన వారు అనేది తెలుసుకోవాల్సిందే.తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా విదేశాల నుంచి పోస్టులు పెట్టే ఎన్నారై మహిళ, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై అనుచితంగా పోస్టులు పెట్టారంటూ వైసీపీ శ్రేణులు సోమవారం చెలరేగిపోయాయి. ఆ పోస్టులు పెట్టిన మహిళను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను తెరపైకి తెచ్చారు. పద్ధతి మార్చుకోకపోతే వీడియోలు కూడా రిలీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇవన్నీ మార్ఫింగ్ ఫోటోలని బాధితురాలు వివరణ ఇచ్చింది.సోషల్ మీడియాలో సాగుతున్న ఈ తరహా అనైతిక పోరాటాలకు ప్రధాన పార్టీల బాధ్యత కూడా ఉంది. ఏపీలో ప్రధానమైన టీడీపీ, వైసీపీలు జీతాలు చెల్లించి మరీ ఈ తరహా అల్లరి మూకల్ని, డిజిటల్ సైన్యాన్ని పోషిస్తున్నాయి. ప్రత్యర్థులపై విమర్శించే క్రమంలో హద్దులు చెరిపేయడంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. రాజకీయ విమర్శల పేరుతో మహిళల్ని కించపరచడం, దూషించడం యథేచ్ఛగా సాగిపోతోంది. ప్రత్యర్థి పార్టీలను విమర్శించే క్రమంలో వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి నేతల కుటుంబాలను, మహిళలను టార్గెట్ చేయడం పరిపాటై పోయింది.ఈ తరహా పోరాటాలు తాము ప్రారంభించలేదు కాబట్టి ప్రత్యర్థులదే పూర్తి బాధ్యత అని రెండు పక్షాలు సమర్ధించుకోవడం గమనార్హం. వైసీపీ ట్రోలింగ్‌కు గురైన బాధిత మహిళకు మద్దతుగా టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ ట్వీట్ చేస్తే, తమ జోలికి వస్తే ఇలాంటి దాడులు తప్పవని వైసీపీ శిబిరం హెచ్చరించింది. సోషల్ మీడియా చూసే వారికి మాత్రం రెండు పార్టీలు వీధిన పడి కొట్టుకోవడం వినోదాన్ని పంచుతోంది.

Related Posts