గుంటూరు, జూన్ 29,
భూమిలో లభ్యమయ్యే అమ్యూమైన సంపదల్లో ఒకటి రంగురాళ్లు. అదృష్టం బాగుంది ఒక్క చిన్న రాయి దొరికినా చాలు రాత్రికి రాత్రే లక్షాధికారులయిపోవచ్చు అని భావిస్తారు. ఈ నేపథ్యంలో తొలకరి జల్లు పడితే చాలు రంగు రాళ్లను దక్కించుకునేందుకు సామాన్యుల నుంచి మాఫియా వరకూ అనేకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా సహజ సంపదను, అటవీ సంపదను దోచుకునే ఓ ముఠా రంగురాళ్ళపై కన్నేసింది.. తమ దోపిడికి అడ్డువచ్చిన అటవీ శాఖ సిబ్బందిపై సైతం దాడులకు తెగబడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శంకరాపురంలో రంగురాళ్ల మాఫియా రెచ్చిపోయింది. అటవీ సంపదను దోచుకోవడానికి తెగబడింది.. అందుకు అడ్డువచ్చిన అటవీ అధికారులపై దాడులకు సైతం పాల్పడింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ అటవీ అధికారిని ఆటోతో ఢీకొట్టే ప్రయత్నం చేసింది. అంతేకాదు.. పరిసర గ్రామాల ప్రజలను పోగేసి అటవీ అధికారులపైకి దాడి చేయడానికి ఉసిగొలిపే ప్రయత్నం చేయడంతో అటవీ అధికారులు.. పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలంటూ పోలీస్స్టేషన్ తలుపులు తట్టారు. రంగురాళ్ల అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు పారెస్ట్ అధికారులు ఘటన స్థలానికి వెళ్లగా.. వారిపై రంగురాళ్ల గ్యాంగ్ దాడికి తెగబడ్డారు. ఆటో ఎక్కించే ప్రయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మురళీ ఫిర్యాదు చేసినట్లు పారెస్ట్ అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దాడికి తెగబడిన వారిని గుర్తించి వారిపై చర్యలు చేపడతామన్నారు