విశాఖపట్టణం, జూన్ 29,
ఓ ఆరునెలల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం వచ్చారు. అప్పుడు జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ద్వంద్వంగా ఓ మాట చెప్పారు. ‘మాకు రాష్ట్ర సంక్షేమమే ముఖ్యం సార్. మీరు పెద్ద మనసు చేసుకుని రాష్ట్రాభివృద్ధికి సహకరించండి సార్. మా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రానికి మేము అన్ని రకాలుగా మద్దతు ఇస్తాం సార్' అని అశేష జనవాహిని ముందు వెల్లడిరచారు. ప్రతీ సందర్భంలోనూ జగన్ ప్రభుత్వం మోదీ నిర్ణయాలను సమర్ధిస్తోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎన్నడూ ప్రవర్తించలేదు. ఈ విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. అందుకే ఇటీవల కాలంలో దాదాపు 26000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. విభజన లోటు కింద 10 వేల కోట్లు, పోలవరం పునరావాస సాయం కింద 16 వేల కోట్లను విడుదల చేసింది. ఈ క్రమంలోనే అమరావతిలో పేదల కోసం 47000 ఇళ్ల నిర్మాణానికి దాదాపు ఏడువందల కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి శుభవార్త చెప్పింది. ఇతర ప్రాంతాల్లో ఇళ్ల మంజూరు వేరు. అమరావతి వేరు. అక్కడ పేదలకు ఇళ్లు మంజూరు చేయడాన్ని రాజధానికి కోసం భూములిచ్చిన రైతులు, తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ మీడియా వ్యతిరేకిస్తున్నాయి. అమరావతిలోని రీజియన్`5 లో దాదాపు 1400 ఎకరాల్లో యాభై వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు వరకూ స్థానిక రైతులు, నాయకులు వెళ్లడం, ప్రభుత్వ నిర్ణయం మీద స్టే ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించడం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేసింది. జులై ఎనిమిదిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించడానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇళ్లు త్వరితగతిన పూర్తి కావడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం అభ్యర్థించింది. దీనికి వ్యతిరేకంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు లాంటి వాళ్లు కేంద్రానికి లేఖలు రాసినా, మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. 47,000 ఇళ్ల నిర్మాణానికి 705 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తీపి కబురు అందించింది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయని రాజకీయవర్గాలు, మీడియా భావించాయి. అయితే రాజకీయం వేరు. ప్రభుత్వాల మధ్య సహాయ సహకారాలు వేరు అని అటు మోదీ ప్రభుత్వం, ఇటు జగన్ ప్రభుత్వం రుజువు చేస్తున్నాయి. అందుకే జగన్ ప్రతీ అభ్యర్థనకు మోదీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేయూత ఇస్తోంది.