గుంటూరు, జూన్ 30,
గత కొద్ది రోజులుగా క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ రంగంవైపు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది వారాల క్రితం అంబటి రాయుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారు. అదే సమయంలో ఐపీఎల్‌కు కూడా రిటర్మెంట్ ప్రకటించారు. దీంతో ఆయన ప్రజా సేవ కోసమే బయలుదేరుతున్నారనే వాదన మరింత బలపడింది.తాజాగా అంబటి రాయుడు విద్యార్థులను కలిసి వారితో మాట్లాడడం ఆసక్తి కలిగించింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో అంబటి రాయుడు పర్యటించారు. తొలుత పునీత శౌరివారి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఫాదర్ మార్నేని దిలీప్ కుమార్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్థానిక శౌరివారి జిల్లా పరిషత్ హై స్కూలును సందర్శించారు. పాఠశాల ప్రారంభం అయిన నాటి నుంచి అక్కడ ఏర్పడ్డ వసతులు, ఇటీవలి పదో తరగతి ఫలితాల గురించి ప్రధానోపాధ్యాయుడు జోస్పిన్ ను గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం జగనన్న గోరుముద్ద పథకంలోని భోజనం తిన్నారు.అనంతరం అంబటి తిరుపతి రాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రజాసేవకు వచ్చినప్పుడు ఏ ప్రాంతంలో ఏయే పనులు అవసరాలు ఉన్నాయో తెలుసుకునేందుకు పర్యటిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్ ప్రణాళికను కొద్ది నెలల్లో చెబుతానని అన్నారు. జిల్లాలో ప్రతి ప్రాంతం, ప్రతి ఊరు తిరుగుతున్నానని అన్నారు. వాటిని ఒక ప్రణాళిక ప్రకారం నెరవేర్చుకుంటూ వెళ్తానని అన్నారు. అందుకోసమే అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నానని, అందరి సమస్యలు తెలుసుకుంటానని వివరించారు.