నిర్మాణ సంస్థ: ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్మెంట్స్
నటీనటులు: రవితేజ, మాళవికా శర్మ, జగపతిబాబు, పోసాని కృష్ణమురళి, అలీ
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
ఛాయాగ్రహణం: ముఖేష్.జి
కూర్పు: ఛోటా కె.ప్రసాద్
కథనం : సత్యానంద్
నిర్మాత: రామ్ తాళ్లూరి
దర్శకత్వం: కల్యాణ్ కృష్ణ కురసాల
కథ:
నేలటిక్కెట్టుగాడు(రవితేజ) ఓ అనాథ. హైదరాబాద్‌లో తన స్నేహితులతో కలిసి ఉంటాడు. అనాథ కావడంతో ప్రతి ఒక్కరినీ ఏదో ఒక బంధంతో పిలుచుకుంటూ ఉంటాడు. ఓ సందర్భంలో డాక్టర్ కోర్సు చదువుతున్న మాళవిక(మాళవికా శర్మ)ను చూసి ప్రేమలో పడతాడు. మరోవైపు ఆనంద్ భూపతి(శరత్‌బాబు) చాలా మంచి వ్యక్తి. అనాథల కోసం ఆనంద నిలయంను నిర్మించాలనుకుంటాడు. అది అతని జీవితాశయం. మరో ఆశ తన కొడుకు అజయ్ భూపతి(జగపతిబాబు)ని మంత్రిగా చూడాలనుకుంటాడు. ఆనంద్ భూపతి కొడుకు కావడంతో అజయ్ ఎలక్షన్స్‌లో గెలిచి.. మంత్రి అవుతాడు. ఓరోజు అజయ్ భూపతి కారుపై టెర్రరిస్ట్ ఏటాక్ జరుగుతుంది. ఆ ఏటాక్‌లో అజయ్ భూపతి తప్పించుకుంటాడు. కానీ ఆనంద భూపతి చనిపోతాడు. ఆనంద భూపతి టెర్రరిస్ట్ ఏటాక్ వల్ల చనిపోలేదని.. ప్లానింగ్ ప్రకారం జరిగిన మర్డర్ అని తెలుస్తుంది. అదే సమయంలో నేలటిక్కెట్టుకి, హోమ్ మినిష్టర్‌కి మధ్య గొడవలు జరుగుతాయి. అసలు ఈ గొడవలకు కారణం ఏంటి? ఇద్దరి మధ్య సంబంధం ఏంటి? ఆనంద భూపతి హత్య వెనుక కారణమేంటి? మనుషులు ముఖ్యమనుకునే నేలటిక్కెట్ చివరకు ఎలా గెలుపు సాధించాడు..? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
చుట్టూ జనం మధ్యలో మనం అనే కాన్సెప్ట్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. బడా బాబులు అనాథాశ్రమాల మీద కన్ను వేయడం, దానికి సంబంధించిన డబ్బును చేజిక్కించుకోవడం, స్థలాలను కబ్జాచేయడం.. వారి బారి నుంచి హీరో వాటిని కాపాడటం వంటివి మామూలుగా ఇంతకు ముందే చాలా సినిమాల్లో చూశాం. అయితే అనాథాశ్రమంలో పెరిగిన ఓ కుర్రాడే అలాంటి పని చేయడమన్నది ఇందులో కొత్త కాన్సెప్ట్. పాయింట్‌గా చుట్టూ జనం మధ్యలో మనం అనేది బావుంది కానీ, దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు మాత్రం పేలవంగా ఉన్నాయి. బోలెడన్ని సన్నివేశాలు, ఒక్కో సన్నివేశంలోనూ ఫ్రేమ్ నిండా మనుషులు.. దేన్ని ఎందుకు చూస్తున్నామో, ఏది ఎక్కడ ఎందుకు వస్తుందో కూడా అర్థం కానట్టుగా కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది. బ్రహ్మానందంలాంటి స్టార్ కమెడియన్ ఈ సినిమాలోని పాత్రను ఎందుకు అంగీకరించారో అర్థం కాదు. అయన పాత్రే కాదు, చాలా పాత్రలు ఎందుకు వస్తాయో, ఎందుకు పోతాయో తెలియదు. వెయ్యి సమస్యలను ఒక్క తాటిమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ల్యాగ్ బాగా ఎక్కువైంది.
తొలిసగంలో అసలు కథేంటో అర్థం కాదు. రెండో సగంలో కథ నత్త నడక నడుస్తుంది. రవితేజ చేసిన చాలా కమర్షియల్ చిత్రాల్లో ఇదీ ఒక్కటి అన్నట్టే ఉంది. `నేలటిక్కెట్`గాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు..` వంటి డైలాగులు అక్కడక్కడా మాస్‌ను ఆకట్టుకుంటాయి. హీరోయిన్ గ్లామర్ సన్నివేశాల్లో ఓకే గానీ, నటిగా ఇంకా మెరుగు పడాలి. రవితేజలో ఉన్న టైమింగ్‌ని ఇంకా బాగా వాడుకోవాల్సింది. అలీ, ప్రియదర్శి, పృథ్వి వంటివారున్నా ఎక్కడా కామెడీ పండలేదు. నేపథ్య సంగీతం కూడా సోసోగా ఉంది. క్లైమాక్స్ లో వచ్చే నమస్తే పాట సన్నివేశాలను మించి బరువుగా అనిపించింది. `వీడి నోట్లో నోరు పెట్టడమంటే టీవీ చానెళ్లలో లైవ్‌కి వెళ్లినట్టే` అని మీడియా మీద సెటైర్ ఎందుకు వేయాల్సి వచ్చిందో అర్థం కాదు. ఓ హోమ్ మినిస్టర్‌ని అత్యంత సామాన్యుడు దొంగ దెబ్బ తీయడం అంత తేలిక కాదు. ఐపీయస్ అధికారి ఏమీ చేతకానివాడిలా చేతులు ముడుచుకుని కూర్చుని ఓ సామాన్యుడి చేత మొత్తం గేమ్ ఆడించడం కూడా మింగుడుపడని వ్యవహారం. వాళ్లు పది ఇస్తే మేం 20 ఇస్తాం అని ఎమ్మెల్యేలకు ప్రియదర్శి బేరం పెట్టే సీన్‌ని చూస్తే కామెడీగా అనిపించదు. పైపెచ్చు ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎమ్మెల్యేలను కొనేయడం ఇంత తేలికా... ఎవరు పిలిచినా వాళ్లు వెళ్లిపోతారా? అన్నట్టే అనిపిస్తుంది. నేలటిక్కెట్ అనే టైటిల్ చూసి మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయనుకుని థియేటర్లకి వెళ్తే నిరాశ తప్పదు.
ప్లస్ పాయింట్స్:
- రవితేజ నటన
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- కథలో కొత్తదనం లేకపోవడం.. రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
- కథాంశం కొన్ని సార్లు పాతదే అయినా.. కథనం గ్రిప్పింగ్‌గా లేకపోవడం
- సంగీతం, నేపథ్య సంగీతం
- హీరోయిన్ పాత్రకు స్కోప్ లేకపోవడం
- ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడం
రేటింగ్: 2/5