YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సైకిల్ ఎక్కనున్న ముత్యాల నాయుడు కొడుకు

సైకిల్ ఎక్కనున్న ముత్యాల నాయుడు కొడుకు

విజయనగరం, జూలై 3, 
ఉప ముఖ్యమంత్రిగా, కీలకశాఖల మంత్రిగా ఉన్న బూడి ముత్యాల నాయుడుకి సొంతింట్లోనే సవాళ్లు ఎదురవుతున్నాయి. మాడుగుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముత్యాలనాయుడుకి కొడుకే తల్నొప్పిగా మారుతున్నాడట. ముత్యాలనాయుడు కుమారుడు బూడి రవికుమార్ ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబును కలవడం చర్చనీయాంశమైంది. విజయనగరం జిల్లా ఎస్ కోటలో పర్యటించిన నేపథ్యంలో టీడీపీ నేత కోళ్ల అప్పలనాయుడు ఇంట్లో చంద్రబాబుని కలిశారట బూడి రవి. ఏదో మర్యాదకోసం కలవలేదట ఆయన. డిప్యూటీసీఎంగా ఉన్న తండ్రిపై పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంద్రబాబుని కోరారట రవి. తండ్రి వ్యక్తిగత, అవినీతి వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల మద్దతు కూడగట్టి విజయం గెలుస్తానంటూ..తన అంచనాల గణాంకాలను టీడీపీ అధినేత ముందుంచారట బూడి వారసుడు. దీనిపై ప్రతిపక్ష నేత ఎలా స్పందించారోగానీ ఈ వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా తో పాటు రాష్ట్రంలో సంచలనంగా మారింది.వైసీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడి కుమారుడు ఏకంగా ప్రతిపక్ష నాయకుడిని కలవడమంటే అసాధారణ విషయంగానే చూడాలన్నది కొందరి వాదన. అందులోనూ తన తండ్రి పైన పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరారన్న వార్త మరింత ఆసక్తి రేపుతోంది. తండ్రితో రవికుమార్ కి తేడా ఎక్కడొచ్చిందన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. బూడి ముత్యాల నాయుడి మొదటి భార్య కుమారుడు రవికుమార్. మొదటి భార్య ప్రమాదంలో మరణించిన తర్వాత ముత్యాల నాయుడు మరో వివాహం చేసుకున్నారు. రవికుమార్ ముత్యాల నాయుడు సొంత చెల్లెలు, తన అత్త నివాసంలో వాళ్ళతో కలిసి ఉంటున్నాడు. తండ్రి కూడా అదే ఊరు సాలువలో ఉంటున్నా ఇద్దరి మధ్య మాటల్లేవ్. తల్లి చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకుని వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారన్నది బుడి రవి కంప్లైంట్.ముత్యాలనాయుడు రెండో భార్య కూతురు అనురాధ కోటపాడు జడ్పీటీసీగా ఉన్నారు. ఆమె పోటీ సమయంలోనే తనకు దేవరపల్లి నుంచి జడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం కల్పించాలని తండ్రిని కోరాడట రవి. అయితే రవిని పక్కన పెట్టి రెండో భార్య కూతురికే ప్రాధాన్యం ఇచ్చారట డిప్యూటీ సీఎం. అనూరాధ జడ్పీటీసీగా గెలిచి నియోజకవర్గంలో తండ్రి తర్వాత అన్నీ తానే పర్యవేక్షిస్తుండటంతో.. బూడి వారసురాలు ఆమేనన్న ప్రచారం బలంగా ఉంది. ఈ పరిణామాలతో తండ్రిపై కోపంతో రగిలిపోతున్నాడట రవి. అందుకే ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి తండ్రిపై ఫిర్యాదు చేశారట. తండ్రి వ్యక్తిగత వ్యవహారాలతో పాటు కొన్ని అవినీతి ఆరోపణలు కూడా చేశాడట బూడి రవికుమార్. పాదయాత్ర సమయంలో అనకాపల్లి జిల్లాలో తన వెంట నడిచిన బూడి రవికుమార్‌తో సీఎంకి సాన్నిహిత్యం ఉందంటున్నారు. సీఎంని కలిశాక ఏమైందోకానీ తర్వాత బూడి రవి చంద్రబాబుని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు తావిచ్చింది.బూడి రవికుమార్ వివాహం చేసుకుంది ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి బంధువైన అప్పలనాయుడు కూతురినే. వారంతా టీడీపీలోనే ఉన్నారు. చంద్రబాబు విజయనగరం పర్యటనలో ఉన్నప్పుడు చంద్రబాబును కలిసి తన మనసులోని మాట చెప్పారట బూడి వారసుడు. చంద్రబాబు అన్నీ సావధానంగా విన్నా.. బూడి రవికుమార్ కి మాడుగుల టీడీపీనుంచి అవకాశం అంతా ఈజీ కాదన్న చర్చ జరుగుతోంది. మాడుగుల టీడీపీ ఇప్పటికే మూడు వర్గాలుగా విడిపోయి ఆధిపత్య పోరు సాగుతోంది. రామానాయుడు, పీవీజీ కుమార్‌ టికెట్‌కోసం నువ్వానేనా అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వారిద్దరినీ కాదని బూడి రవికి ఛాన్స్‌ కష్టమేనంటున్నారు. కానీ డిప్యూటీ సీఎం కొడుకు చంద్రబాబుని కలవడం మాత్రం వైసీపీలో చర్చనీయాంశమైంది. దీనిపై బూడి ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Posts