YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పొత్తుపై తమ్ముళ్లలో చర్చోపచర్చలు

పొత్తుపై తమ్ముళ్లలో చర్చోపచర్చలు

తిరుపతి, జూలై 4, 
బీజేపీతో అంటకాగితే మనమూ మునిగిపోతాం. గాలికి పోయే కంపని గుడ్డకు తగిలించుకోవడం అవసరమా? అసలిప్పుడు మనమేంటి? మన రేంజ్‌ ఏంటి? బీజేపీతో పొత్తేంటి? టీడీపీలోని ఓ వర్గం నేతల్లో ఈ తరహా చర్చలు యమ జోరుగా జరుగుతున్నాయట. పువ్వు పార్టీతో కలిసి ప్రయాణం చేస్తే… మన సీట్లు చిరిగిపోతాయని, కాస్త వెనకా ముందూ ఆలోచించమని అధిష్టానానికి చెప్పాలనుకుంటున్నారట కొందరు టీడీపీ సీనియర్స్‌. వాళ్ళ లెక్కలేంటి? టచ్‌ మీ నాట్‌ అన్నట్టుగా ఉండమని ఎందుకు అంటున్నారు?అమిత్‌ షా-చంద్రబాబు భేటీ తర్వాత.. మళ్లీ 2014 ఎన్నికల కాంబినేషన్‌ రాబోతోందనే చర్చ ఏపీలో జోరుగా జరుగుతోంది. నాడు టీడీపీతో బీజేపీ జతకట్టి పోటీ చేస్తే.. జనసేన మద్దతిచ్చి పోటీకి దూరంగా ఉంది. ఇప్పుడు జనసేన కూడా యుద్ధానికి సిద్దమైనందున ముగ్గురూ కలిసే బరిలో దిగుతారన్న ప్రచారం బలంగా జరుగుతోంది. బీజేపీతో కలిస్తే… తమకు అడ్వాంటేజ్‌ ఉంటుందని ఇటీవలి వరకు టీడీపీ శ్రేణులు అనుకున్నా… ప్రస్తుతం ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో….కాషాయ పార్టీతో పొత్తంటే… అది అత్మహత్యా సదృశ్యమని అంటున్నారట ఎక్కువ మంది తెలుగుదేశం నాయకులు. కమలంతో పొత్తంటే…పక్కలో పదునైన కత్తిని పెట్టుకుని తిరిగినట్టేనన్న అభిప్రాయం పార్టీ వర్గాల్ల్లో బలంగా ఉందట. గత ఎన్నికల్లో వాళ్ళతో పొత్తు పెట్టుకోకుండా తప్పు చేశాం.. ఇప్పుడు పెట్టుకుంటే మళ్లీ తప్పు చేసిన వాళ్లం అవడంతోపాటు నిండా మునుగుతామని అధినాయకత్వానికి సూచనలు కూడా చేస్తున్నారట కొందరు సీనియర్స్‌.ఓవైపు కర్ణాటక ఫలితాలు.. జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలతో పాటు.. ఏపీలో బీజేపీని బూచిగా చూపే దిశగా వైసీపీ పావులు కదపడంపై టీడీపీలోని కొందరు నేతలు కలవరపడుతున్నారట. ఏపీలో నడ్డా, అమిత్‌ షా పర్యటనల తర్వాత బీజేపీ విషయంలో వైసీపీ వైఖరిలో మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. స్వయంగా సీఎం జగన్‌ బీజేపీ సపోర్ట్‌ మనకు ఉండదని చెప్పడమే కాకుండా.. బీజేపీని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తోంది అధికార పార్టీ. గతంలో విశాఖ టూర్‌కి వచ్చిన ప్రధాని మోడీ స్టీల్ ప్లాంట్‌ గురించిగాని, రైల్వే జోన్‌ గురించి గాని, ఇతరత్రా ఏపీకి సంబంధించిన పెండింగ్‌ అంశాల గురించి మాట్లడకున్నా మౌనంగా ఉన్న వైసీపీ.. ఇప్పుడు అమిత్‌ షా, నడ్డాలు తమ పర్యటనల్లో స్టీల్‌ ప్లాంట్‌, రైల్వే జోన్‌ వంటి డిమాండ్లపై మాట్లాడలేదని పదే పదే విమర్శలు గుప్పిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు సదరు టీడీపీ నాయకులు. ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. బలంగా ఉన్న ఉత్తరాంధ్రలో ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయని అంచనా వేస్తున్నారు.ఇదే సందర్భంలో పార్టీ వర్గాల్లో మరో చర్చ కూడా జరుగుతోంది. బీజేపీ చేసే రాజకీయాన్ని పూర్తిగా నమ్మలేమని, ఏపీకి వచ్చిన నడ్డా, అమిత్‌ షా జగన్‌ను.. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించినా.. అవినీతి ఆరోపణలు చేసినా.. వాటిని జనం పెద్దగా నమ్మడం లేదన్న అభిప్రాయం కూడా ఉందట. ఇప్పటికీ జగన్‌కు బీజేపీ తెర వెనుక మద్దతు ఉందనే అంటున్నారు చాలా మంది టీడీపీ నేతలు. వైసీపీని రాజకీయ ప్రత్యర్థిగా చూస్తూ…. ఏదో కామెంట్లు చేశారు తప్ప.. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా, వివిధ అంశాల్లో వ్యక్తిగతంగా జగన్‌కూ అటు కేంద్రం.. ఇటు బీజేపీ అగ్ర నేతలు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారన్నది ఎక్కువ మంది టీడీపీ నేతల మనసులో మాట. జరుగుతున్న పరిణామాలనే అందుకు ఉదాహరణలుగా చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ తన అవసరం కొద్దీ.. తెలంగాణ కోసం పొత్తు పెట్టుకున్నా.. వాళ్ళ మనస్సు మాత్రం జగన్‌తోనే ఉంటుందని అంటున్నారట. కొంత మంది నేతలు మనువు బీజేపీతో.. మనస్సు చంద్రబాబుతో అన్నట్టుగా ఉన్నారన్న విమర్శలు వస్తున్నా… వాస్తవానికి బీజేపీ జాతీయ నాయకత్వం మనస్సంతా జగనే నిండిపోయి ఉన్నారనేది ఏపీ టీడీపీలో లేటెస్ట్‌ టాక్‌. ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ప్లస్‌ కంటే మైనస్సే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుందనే విమర్శలు ఓవైపు రావడంతో పాటు.. జగన్‌ను టార్గెట్‌ చేసే విషయాన్ని బీజేపీ అధినాయకత్వం లైట్‌గా తీసుకుంటే.. పొత్తు నష్టమే తప్ప లాభమనేది ఉండదనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మరి చంద్రబాబు ఆలోచనేంటో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోననే ఆందోళన టీడీపీ వర్గాల్లో కన్పిస్తోంది.

Related Posts