YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సింహభాగం కోసం పవన్ ఆశలు

సింహభాగం కోసం పవన్ ఆశలు

కాకినాడ, జూలై 5, 
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉమ్మడి జిల్లాల్లో ఏ పార్టీకి అత్యధిక సీట్లు వస్తే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తుందని సర్వత్రా చర్చ జరుగుతోంది. రెండు జిల్లాలు కలిపి 34 అసెంబ్లీ స్థానాలను కలిగి ఉన్నాయి. ఇది ఆంధ్ర అసెంబ్లీలోని మొత్తం సీట్ల సంఖ్యలో ఐదవ వంతు. కాబట్టి, ప్రతి రాజకీయ పార్టీ ఈ జిల్లాల్లో గరిష్ట సంఖ్యలో సీట్లను కైవసం చేసుకోవడంపై దృష్టి పెడుతుంది. ఇప్పుడు ఈ రెండు జిల్లాలు ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి మధ్య హోరాహోరీగా మారబోతున్నాయి.అయితే ఈ ప్రాంతంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన పట్టును నిలుపుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ జిల్లాల్లో టీడీపీకి బలమైన క్యాడర్‌ బేస్‌ ఉంది, పొత్తు కుదిరినా జన సేనకు మొత్తం గ్రౌండ్‌ను కేటాయించదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఆంధ్రా రాజకీయాలపై పట్టు సాధించాలంటే తనకు కీలకమైన ఈ రెండు జిల్లాల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ చాలా భావిస్తున్నట్లు తెలుస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు, ఆయనకు అక్కడ బలమైన కాపు ఓటు బ్యాంకు కూడా ఉంది.కాబట్టి, ఈసారి జనసేన మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తే మలుపు తిరుగుతుందని ఆయన ధీమాగా ఉన్నారు. అందుకే అధికార పార్టీకి ఒక్క సీటు కూడా రానివ్వనని శపథం చేశారు. అయితే గోదావ‌రి జిల్లాల్లోని ప‌లు ప్రాంతాల్లో టీడీపీ కూడా చాలా ప‌టిష్టంగా ఉంది. ప‌వ‌న్ ఇక్క‌డ గ‌రిష్ఠ సీట్లు డిమాండ్ చేస్తే చంద్రబాబుకు గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. ఒకవేళ జేఎస్పీకి ఎక్కువ సీట్లు ఇస్తే, ఆ పార్టీ సీనియర్ నేతల నుంచి ఆయన తీవ్ర తిరుగుబాటును ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు గోదావరి జిల్లాల్లో రెండు పార్టీల మధ్య పొత్తు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
రెండు జిల్లాల్లో 20 శాతం
ఇంకా ఎన్నికలకు పది నెలల సమయం ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఇప్పట్నుంచే వేడెక్కుతోంది. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్ర ప్రారంభించడం, గోదావరి జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అధికార పార్టీ మీద ఘాటైన విమర్శలు చేయడం ఎన్నికల సీజన్‌ను తలపిస్తున్నాయి. పవన్‌పై మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రతి విమర్శలు చేయడం, ఓ దశలో స్వయంగా ముఖ్యమంత్రి జనసేనానిఇ పెళ్ళిళ్ల గురించి మాట్లాడటం.. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌ పాలిటిక్స్‌ను రసకందాయంగా మారుస్తున్నాయి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న 34 సీట్లలో ఒక్కటి కూడా వైసీపీకి దక్కనివ్వబోమని చెబుతున్నారు. తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా? పొత్తులతో ముందుకు వెళ్తుందా అనే విషయమై ఆయన క్లారిటీ ఇవ్వడం లేదు. వైకాపాను గెలవనివ్వబోమని చెప్పడమంటే, అన్ని సీట్లకూ తాము పోటీ చేయడం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. గోదావరి జిల్లాల్లో మొత్తం 34 సీట్లు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో 20 శాతం సీట్లు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలే అందిస్తున్నాయి. సాధారణంగా గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకునే పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే ప్రచారం ఉంది. గత ఎన్నికలన్నీ ఈ విషయాన్నే ధృవీకరించాయి. ఈ జిల్లాల్లో కాపుల తర్వాత ఎస్సీ సామాజికవర్గానిదే పై చేయి. అందుకే కొన్ని నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వ్‌ అయి ఉంటాయి. దాదాపు అన్ని నియోకవర్గాల్లో కాపులు నిర్ణయాత్మక శక్తిగానే ఉంటారు. అందుకే పవన్‌ కళ్యాణ్‌ కూడా తన వారాహి యాత్రలో గోదావరి జిల్లాల మీదే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. 34 సీట్లూ వైకాపాకు దక్కనివ్వనని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే ఈ జిల్లాల నుంచే జనసేన ఎక్కువ సీట్లను డిమాండ్‌ చేయవచ్చనే వాదన వినిపిస్తోంది. రెండు పార్టీలు కలిసి గోదావరి జిల్లాల్లో 25 సీట్లు సాధించి, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో 65 సీట్లు దక్కించుకున్నా అధికారం చేజిక్కుంచుకోవచ్చనేది ఇరు పార్టీల అగ్రనాయకుల ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర, తెలుగుదేశం నేతల బస్సు యాత్రలకు, గోదావరి జిల్లాల్లో పవన్‌ మ్యాజిక్‌ కూడా తోడైతే అధికారం సులువుగానే దక్కవచ్చనేది వారి ఆలోచన. వీరికి బీజేపీ కూడా కలిస్తే వైకాపాను సులువుగా ఇంటికి పంపవచ్చనేది రాబోయే ఎన్నికల వ్యూహం కావచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Related Posts