YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం..?

పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం..?

ఏలూరు, జూలై 5, 
పోలవరంలో ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమై ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణం కంటే ముందు కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని చేపట్టడానికి కేంద్ర జలసంఘం సూత్రప్రాయంగా అమోదం తెలిపింది. డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేపట్టడం కంటే కొత్త నిర్మాణం చేపట్టడమే మేలని భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ను పూర్తి చేయకుండా ప్రాజెక్టు ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడంతో కొత్త నిర్మాణం చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. వరదల్లో దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ స్థానంలో కొత్తగా మరో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించడానికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారాన్ని తెలిపింది. వచ్చే సోమవారంలోగా తుది నిర్ణయం చెప్పాలని అధికారులకు ఆదేశించారు.మరోవైపు పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తి చేయడానికి అవసరమైన రూ.17,148 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర కేబినెట్‌కు పంపాల్సిన ప్రతిపాదనలను ఈనెల 31లోగా సిద్ధంచేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ, సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సోమవారం ఢిల్లీలో సమీక్షించారు.పోలవరం ఎర్త్‌ కమ్ రాక్‌ ఫిల్‌ డ్యామ్ నిర్మించాల్సిన చోట దెబ్బతిన్న ప్రాంతాలపై చర్చించారు. గ్యాప్‌-2లో డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్న చోట, దానికి సమాంతరంగా 'యూ' ఆకారంలో కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించి పాత దానితో అనుసంధానం చేసే పనులపై నిర్మాణ సంస్థ మేఘా అనుమానాలు వ్యక్తంచేస్తోందని మంత్రి షెకావత్‌కు కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం వివరించారు.పాత డయాఫ్రమ్‌ వాల్‌లో దెబ్బతిన్న 30 శాతం చోట్ల కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందని, ప్రాజెక్టు గ్యాప్‌-2లో మొత్తం 1,396 మీటర్ల పొడవునా కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి షెకావత్‌ ప్రశ్నించారు.కేంద్ర మంత్రి సందేహాలపై సీడబ్ల్యూసీ చైర్మన్‌ కుశ్వీందర్‌సింగ్‌ వోరా స్పందిస్తూ.. పాత డయాఫ్రం వాల్‌లో దెబ్బతిన్న 30 శాతం చోట్ల కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణానికి రూ.400 కోట్లు ఖర్చయితే, మొత్తం 1,396 మీటర్ల పొడవున కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ వేయడానికి రూ.600 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. దీనిపై షెకావత్‌ స్పందిస్తూ కొత్త నిర్మాణం చేపట్టడానికిఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దీనిపై సాంకేతిక అంశాలపై సోమవారంలోగా తుది నిర్ణయాన్ని వెల్లడించాలని సీడబ్ల్యూసీ చైర్మన్‌ వోరాకు మంత్రి షెకావత్‌ సూచించారు.ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డి, పీపీఏ సీఈఓ శివ్‌నందన్‌కుమార్‌లు ప్రాజెక్టు వద్ద ప్రస్తుత పరిస్థితి వివరాలను తెలిపారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌-2లో వరదల ఉధృతికి ఏర్పడిన అగాథాలలో ఇసుక పూడ్చివేత పనులు పూర్తయ్యాయని, వైబ్రో కాంపాక్షన్‌ ద్వారా యథాస్థితికి తెచ్చే పనులు చేస్తున్నామని అధికారులు చెప్పారు. షెడ్యూలు ప్రకారమే పనులు చేస్తుండటంతో మంత్రి షెకావత్‌ సంతృప్తి వ్యక్తంచేశారు.ప్రాజెక్టు తొలిదశ పూర్తికి రూ.12,911.15 కోట్లను మంజూరు చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించింది. 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోకి మరో 36 గ్రామాలు వస్తాయని.. అక్కడి నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని శశిభూషణ్‌కుమార్‌ చెప్పారు. ఆ వ్యయాన్ని కూడా కలుపుకుంటే.. తొలిదశ పూర్తికి రూ.17,148 కోట్లు అవసరమని కేంద్ర మంత్రికి వివరించారు. ఇందుకు మంత్రి షెకావత్‌ అంగీకరించారు.పరిహారం చెల్లింపుకు సంబంధించిన ప్రతిపాదనలను ఈనెల 15లోగా సీడబ్ల్యూసీకి పోలవరం ప్రాజెక్టు అథారిటీ పంపాలని, ఈనెల 31లోగా కేంద్ర జల్‌శక్తి శాఖకు పంపాలని ఆదేశించారు. ఆ ప్రతిపాదనలు కేంద్ర కేబినెట్‌లో ప్రవేశపెట్టి, ఆమోదం తీసుకుని, ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తామని షెకావత్‌ హామీ ఇచ్చారు.

Related Posts