YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టార్గెట్ టీడీపీయేనా... పురందరేశ్వరి వెనుక

టార్గెట్ టీడీపీయేనా... పురందరేశ్వరి వెనుక

ఒంగోలు, జూలై 5, 
బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ పదవుల ప్రక్షాళన చేపట్టింది. ఈ క్రమంలోనే బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఆ పార్టీ అధిష్ఠానం మాజీ సీఎం నందమూరి రామారావు కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించింది. ఇప్పటి వరకు పురంధేశ్వరి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగానే కాకుండా ఒడిశాకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా కూడా వ్యవహరింారు. ఇప్పుడు ఏపీ అధ్యక్షురాలిగా బీజేపీ అధిష్ఠానం నియమించింది. బీజేపీ అధ్యక్ష మార్పు ఊహాగానాలు రావడంతో సత్యకుమార్, సుజనా చౌదరి పేర్లు కూడా అధ్యక్ష రేసులో వినిపించాయి. కానీ అధిష్ఠానం చివరికి పురంధేశ్వరి పేరు ఖరారు చేస్తూ ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా ప్రకటించింది. సహజంగానే పురంధేశ్వరి సీనియర్ రాజకీయ నాయకురాలు కావడం, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు రాష్ట్రంలో కీలకమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, అన్నింటినీ మించి ఎన్టీఆర్ కుమార్తె కావడం ఆమెకు ఈ పదవిని తెచ్చిపెట్టినట్లుగా భావించాలి. ఆమె ఏ పార్టీలో ఉన్నారన్నది.. రాజకీయాలను పక్కన పెడితే పురంధేశ్వరి పనితీరును ఆక్షేపించాల్సిన పనిలేదు. పురంధేశ్వరి అనగానే గుర్తుకొచ్చేది ఎన్టీఆర్ కుమార్తె అనే అయినా ఆమె పనితీరుతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయంగా ఆమె ఎంట్రీకి వారసత్వం పనికి వచ్చినా.. మంత్రిగా ఆమె సమర్ధత, ఆమె హుందాతనం, వ్యవహార శైలి ఆమెకి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఇంకా చెప్పాలంటే సో కాల్డ్ మహిళా నేతలు ఆమెను చూసి నేర్చుకోవాల్సింది కొండంత.అయితే, ఇప్పటికిప్పుడు బీజేపీ పగ్గాలు పురంధేశ్వరికి అప్పగించడం వెనక బీజేపీ వ్యూహం ఏంటన్నది సహజంగానే చర్చకు తావిస్తున్నది. అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియామకం టీడీపీని దెబ్బతీసేందుకా.. లేక రాష్ట్రాన్ని గెలిచేందుకా అనే చర్చలు సాగుతున్నాయి. నిజానికి ఏపీలో బీజేపీకి అధ్యక్షులుగా ఎవరిని నియమించినా పెద్దగా చర్చ అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీకి అసలు స్టేక్ లేదు. ఈ పార్టీకి ఏపీలో ఒక  శాతం ఓట్లు దక్కడమే గగనం. అయితే ఇలాంటి చోట ఇంతలా చర్చ జరుగుతున్నదంటే దానికి కారణం బీజేపీ వ్యవహారశైలే. ఏమీ లేని చోట కూడా అవకాశాన్ని వెతుక్కోవడం బీజేపీ నైజం. దేశంలో చాలా రాష్ట్రాలలో ఇదే తరహా ప్రణాళికతో పని చేసిన బీజేపీ కొన్ని చోట్ల సక్సెస్ అయింది. ఈ కారణంగానే ఏపీలో బీజేపీ వ్యూహాన్ని అనుమానించాల్సి వస్తుంది.ఏపీలో రాజకీయ పరిస్థితులను చూస్తే టీడీపీ, వైసీపీ మధ్యనే ప్రజల పోలరైజేషన్ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి చోట నిలబడాలంటే ఏదొక పార్టీ స్థానాన్ని ఆక్రమించాలి. టీడీపీ, వైసీపీని పోలిస్తే బీజేపీ తన వైపుకు తిప్పుకోనేందుకు ఎక్కువ అవకాశం ఉన్న పార్టీ టీడీపీ. ఈ తరహా ఆలోచనతోనే బీజేపీ ఇన్నాళ్లు కాపు సామజిక వర్గానికి చెందిన వారికి పార్టీని అప్పగిస్తూ వచ్చింది. అయితే, ఇప్పుడు ఆ సామాజిక వర్గాన్ని కూడా జనసేన క్యాప్చర్ చేసుకొనే పనిలో ఉంది. దీంతో బీజేపీ ఇప్పటికే తనతో ఉన్న నేతలలో ఎక్కువ శాతం బలమైన నేతలుగా ఉన్న కమ్మ సామజిక వర్గ నేతలకు పార్టీని అప్పగించినట్లుగా కనిపిస్తుంది. అయితే, స్థానికంగా వేళ్లూనుకుపోయిన టీడీపీ దెబ్బకొట్టడం అంటే   ఆషామాషీ విషయం కాదు.ఇక బీజేపీ మరో ఆలోచనగా చర్చిస్తే ఇది టీడీపీ-జనసేనతో కలిసి రాష్ట్రాన్ని జయించేందుకు వేసిన ప్రణాళికగా కూడా భావించవచ్చు. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా రాజకీయాలు సాగుతుండగా.. జనసేన, బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ మూడవ ప్రత్యామ్నాయం కావాలని ఆశపడుతున్నాయి. అయితే, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజు కారణంగా ఇరు పార్టీల మధ్య పొత్తున్నా లేనట్లుగానే కనిపించింది. ఇలాంటి సమయంలో బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా కమ్మ-కాపు సామజిక వర్గాల కలయికను ప్రజలలోకి పంపినట్లే అవుతుంది. ప్రచారం జరుగుతున్నట్లుగా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఖరారైతే పురంధేశ్వరి, చంద్రబాబు కాంబినేషన్ తో ప్రజల మధ్యకి వెళ్లి అధికారాన్ని కొల్లగొట్టడం మరింత సులువు అవుతుందనే ఆలోచన కూడా చర్చకి వస్తున్నది. మరి బీజేపీ వ్యూహం ఏంటో..  

Related Posts