YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కుత్బుల్లాపూర్ ప్రభుత్వ భూ దందా....

కుత్బుల్లాపూర్ ప్రభుత్వ భూ దందా....

హైదరాబాద్, జూలై 5, 
తిల పాపం తలా పిడికెడు అన్నట్లు ఉంది కుత్బుల్లాపూర్ ప్రభుత్వ భూ దందా వ్యవహారం. ఒకప్పుడు ప్రభుత్వ భూములు ఎవరైనా కబ్జాకు ఉపక్రమిస్తే ప్రతిపక్షంలో ఉండే అన్ని పార్టీలు కలిసికట్టుగా వాటిపై పోరాటం చేసి కబ్జా నుంచి కాపాడే యత్నాలు జరిగేవి. ఆక్రమణ విషయం తెలియగానే తొలుత ఖండన మొదలుకొని సంబంధిత అధికారులకు వినతి పత్రాలు, అవసరమైతే ధర్నాలు రాస్తారోకాలు చేసి ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు సంయుక్తంగా పోరాడేవారు. కానీ ప్రస్తుతం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. వేలకోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న అధికార యంత్రాంగంతో పాటు ప్రతిపక్షాల నేతలు కూడా చూసి చూడనట్లు వ్యవహారించడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.నియోజకవర్గంలో ఉన్న నిజాంపేట్, గాజుల రామారం, దుండిగల్, పేట్ బషీరాబాద్ తదితర ప్రాంతాల్లో వందల ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఒక్క గాజులరామారం రెవెన్యూ రికార్డుల ప్రకారం 423 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇలా నియోజక వర్గంలో వందల ఎకరాలు సర్కారీ స్థలాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని పరిశ్రమల శాఖకు, మరి కొన్నింటిని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించారు. అయినా ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయి. దాదాపు రూ. 10 వేల కోట్ల విలువైన భూములు మాయ‌మవుతున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మేడ్చల్ జిల్లాలోని కబ్జా విషయంలో టాప్‌లో ఉన్నట్టు చెప్పవచ్చుఅత్యంత విలువచేసే ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్న కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న బిజెపి, కాంగ్రెస్, టిడిపి నేతలు ఎవరు కూడా వీటి విషయమై కనీసం మాట్లాడక పోవడం శోచనీయం. భవిష్యత్తులో ప్రజా అవసరాల కోసం ఉపయోగపడే ఈ భూములు క్రమంగా కోల్పోతున్నప్పటికీ అటు ప్రభుత్వానికి కానీ, ఇటు ప్రతిపక్షాలకు గాని ఏమాత్రం పట్టడం లేదు.నియోజకవర్గం నుంచి బిజెపి పార్టీ తరఫున బరిలోకి దిగనున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న సొంటి రెడ్డి పున్నారెడ్డి, కొలాను హన్మంత్ రెడ్డి, భూపతి రెడ్డిలు, కుత్బుల్లాపూర్‌లో ఒకప్పుడు చక్రం తిప్పిన ప్రస్తుత టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌లు ఇలా ఎవరు కూడా కబ్జాల అంశంపై నోరు మెదపడం లేదు. మీరందరూ కేవలం బస్తీలలో కాలనీలలో పర్యటనలు చేస్తూ సభలు నిర్వహిస్తూ గడుపుతున్నారు తప్ప ప్రజా సమస్యలపై పూర్తిస్థాయిలో పోరాటం లేదనే టాక్ ఉంది.స్థానికులకు ఎటువంటి చిన్న సమస్య వచ్చినా వాటిని పరిష్కరించాల్సిందిగా వామపక్ష నాయకులు రోడ్డెక్కి మరి పోరాటాలు ఉద్యమాలు చేసేవారు. ప్రస్తుతం నియోజవర్గంలో ఉన్న నాయకుల్లో కూన శ్రీశైలం గౌడ్, కాసాని జ్ఞానేశ్వర్లు అప్పట్లో ఈ తరహా పోరాటాలు చేసిన వారు. కానీ ప్రస్తుతం ఒక నాయకుడు కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న భూ కబ్జాలపై కనీసం ప్రశ్నించడానికి వెనకడుగు వేస్తున్నారు.నియోజకవర్గంలో జరుగుతున్న భూ అక్రమాలపై అడపాదడపా రాష్ట్ర అధ్యక్ష స్థాయిలో ఉన్న బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు మాట్లాడుతున్నప్పటికీ వారి స్ఫూర్తితో ఇక్కడివారు కనీసం అడుగులు వేయటం లేదు. ఇక్కడ జరిగే భూకబ్జాలపై వీరికి కూడా భాగస్వామ్యం ఉన్నదా..? లేదా ప్రశ్నిస్తే వారి వారి ముసుగులు బయటపడతాయా అనే భయంతో సైలెంట్ అయ్యారా అనే అనుమానాలున్నాయి.అయితే కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో జరుగుతున్న భూకబ్జాల విషయంపై ప్రశ్నించే వాళ్లలో ఇద్దరు వ్యక్తులు మాత్రం కనిపిస్తున్నారు. ఒకరు ఆకుల సతీష్, మరొకరు జయశంకర్ గౌడ్. వీరిద్దరు కూడా బిజెపి పార్టీకి చెందిన నాయకులే. ఆకుల సతీష్ నిజాంపేట్ కార్పొరేషన్‌లో జరుగుతున్న భూకబ్జాలు, ప్రజా సమస్యలపై నిత్యం అధికారులకు ఫిర్యాదు చేస్తూ పోరాటాలు చేస్తున్నారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ల పరిధిలో జరుగుతున్న భూకబ్జాలపై నల్ల జయశంకర్ గౌడ్ ఎప్పటికప్పుడు పూర్తి వివరాలతో సోషల్ మీడియా వేదికగా అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు.ఈ అంశంపై నల్ల జయశంకర్ గౌడ్‌కి బెదిరింపులు సైతం వచ్చాయి. జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన కనీసం కేసు నమోదు చేయలేదని జయశంకర్ గౌడ్ చెబుతున్నారు. వీరు చేస్తున్న పోరాటాలపై కనీసం బిజెపికి చెందిన నాయకులు కూన శ్రీశైలం గౌడ్, మల్లారెడ్డి‌లు మద్దతుగా నిలువకపోవడం‌పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు హరీష్ రెడ్డి జయశంకర్ గౌడ్ గతంలో మద్దతు తెలిపి, ఆ తర్వాత పోరాటాన్ని కొనసాగించలేక పోయారు. 

Related Posts