తిరుమల, జూలై 6,
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువు తీరిన ఆంధ్రప్రదేశ్ లోని తిరుమలకు ప్రతిరోజు కొన్ని వేల మంది శ్రీవారి భక్తులు వెలుతుంటారు. వీకెండ్, పండుగలు, వరుస సెలవుల సందర్బంలో ప్రతిరోజు లక్ష మందికి పైగా తిరుమల కొండ మీదకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇలాంటి తిరుమలలో భదత్రా పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అత్యాధునిక టెక్నాలజితో తిరుమలలో పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నట్లు, ఎలాంటి భద్రతాపరమైన సమస్యనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆక్టోపస్ అదనపు ఎస్పీ నగేష్ బాబు తెలిపారు. బుధవారం పీఎసీ- 4లోని సమావేశ మందిరంలో తిరుమల అదనపు ఎస్పీ ముని రామయ్యతో కలిసి అదనపు ఎస్పీ నాగేష్ బాబు ఆక్టోపస్, పోలీస్, ఫైర్, రెవెన్యూ, వైద్య, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్టోపస్ అదనపు ఎస్పీ నగేష్ బాబు మాట్లాడుతూ తిరుమలలో తరచుగా ఇటువంటి మాక్ డ్రిల్స్ నిర్వహించడం ద్వారా భద్రత లోపాలను అధిగమించవచ్చు అన్నారు. సంఘ విద్రోహులు తిరుమలలోని ఏదైనా ప్రదేశంపై దాడి చేసినప్పుడు ఎలా తిప్పికొట్టి భక్తులకు రక్షణ కల్పించాలి అనేది ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని ఆక్టోపస్ అదనపు ఎస్పీ నగేష్ బాబు తెలిపారు. ఈ విధంగా తిరుమలలోని ఒక విశ్రాంతి గృహంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. ఆక్టోపస్ డీఎస్పీ నరసింహారావు సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొనేటప్పుడు ఏ విభాగం అధికారులు, సిబ్బంది ఏ కార్యక్రమాలు నిర్వహించాలి అనే విషయమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బుధవారం రాత్రి 8 నుండి 11 గంటల వరకు తిరుమలలోని పద్మావతి విశ్రాంతి గృహం వద్ద ఆక్టోపస్ పోలీసు దళం, నిఘా మరియు భద్రతా విభాగం, పోలీసు, సంబంధిత శాఖల సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. తిరుమలకు వెళ్లే భక్తుల వాహనాలను, భక్తులను తిరుపతిలోని అలిపిరి దగ్గర నిలిపివేసి క్షుణ్ణంగా సోదాలు చేస్తారు. ఇక తిరుమలలోని పలు ప్రాంతాల్లో అనుమానం వస్తే భక్తులను సోదాలు చేస్తుంటారు. ఇక శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ల్లో పలు చోట్ల సోదాలు చేస్తుంటారు. ఎలక్ట్రానిక్ వస్తులు, మొబైల్ ఫోన్ లతో పాటు నిషేదిత వస్తువులను శ్రీవారి దర్శనం చేసుకునే భక్తులు తీసుకెళ్లడానికి ఎలాంటి అవకాశం లేదు.
బ్రేక్ దర్శనం పేరుతో మోసం
విఐపి బ్రేక్ దర్శనం టిక్కెట్ల పేరుతో తిరుమలలో హైదరాబాద్‌కు చెందిన భక్తుల్ని మోసం చేసిన ఘటన వెలుగు చేసింది. బ్రేక్ దర్శనం కోసం దళారుల్ని ఆశ్రయించడంతో నకిలీ టిక్కెట్లను విక్రయించి మోసానికి పాల్పడ్డారు. తిరుమలలో దళారులకు అడ్డుకట్ట వేయడానికి టీటీడీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అవి ఫలితాన్ని ఇవ్వడం లేదు. పెద్ద ఎత్తున దళారుల్ని అరెస్ట్ చేసినా అడపాదడపా తిరుమలకు వచ్చే భక్తులు వీరి బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు ఇప్పిస్తామని ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లను భక్తులకి అంటగట్టారు. హైదరాబాద్‌కు చెందిన భక్తులను మోసగించిన దళారుల ముఠాపై తిరుమల టూటౌన్ పోలీసులు రెండు రోజుల క్రితం కేసు నమోదయింది.ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన కామిశెట్టి వేణు శ్రీవారి దర్శనం కోసం దళారి అభిషేక్‌ను ఆశ్రయించాడు. నాలుగు వీఐపీ టికెట్లు ఇప్పిస్తానని చెప్పి వేణు వద్ద నుంచి రూ.11వేలు తీసుకున్నాడు. మరో దళారి శ్రీను ఫోన్ నంబరు ఇచ్చి టిక్కెట్ల కోసం అతన్ని సంప్రదించాలని సూచించాడు.కామిశెట్టి వేణు ఆయన్ని సంప్రదించడంతో అతడు అశోక్ నాయక్ అనే మరో దళారి నంబరు ఇచ్చి అతన్ని కలవాలని కోరాడు. భక్తుడు అతని వద్దకు వెళ్లగా నాలుగు ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లను ఇచ్చి, ఏటీసీ కూడలి నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మీదుగా వెళితే అక్కడ టికెట్ స్కానింగ్ చేసే శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్‌కు చెందిన శివనారాయణ ఉంటాడని అతను అన్నీ చూసుకుంటాడని చెప్పి పంపారు.వేణు వద్ద ఉన్న నకిలీ టిక్కెట్లు తీసుకుని శివనారాయణ టికెట్లను స్కాన్ చేసినట్లు నటించి దర్శనానికి పంపించేశాడు. బ్రేక్ దర్శనం ఇప్పిస్తానని ప్రత్యేక దర్శనానికి పంపిస్తుండడంతో మోసపోయినట్లు గుర్తించిన భక్తుడు తితిదే విజిలెన్స్ వింగ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు టికెట్లను తనిఖీ చేసి అవి ఎస్‌ఈడీ నకిలీ టిక్కెట్లుగా గుర్తించారు. ఈ ఘటనలో మోసానికి పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.