కడప, జూలై 6,
జిల్లా వ్యవసాయ శాఖ 1.90 లక్షల ఎకరాల్లో సాగు ప్రణాళికను సిద్ధం చేసింది. జిల్లాలోని 36 మండలాల పరిధిలో 5,770 ఎకరాల్లోనే విత్తనం పడింది. 1.84 లక్షల ఎకరాల్లో విత్తనం పడాల్సి ఉంది. గతేడాది ఇదేసమయానికి సుమారు తొమ్మిది వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతేడాది సాగుతో పోలిస్తే 50 శాతం కూడా సాగుకు నోచుకోకపోవడం గమనార్హం. త్వరలో కడప-కర్నూలు కాల్వకు నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో 92 వేల ఎకరాల్లో వరి సాగు ఊపందుకునే అవకాశం ఉందనే అంచనాలో వ్యవసాయశాఖ నిమగమైంది. జిల్లా వ్యాప్తంగా వరి, ఇతర పంటల సాగు ఊపందుకునే అవకాశాలు ఉన్నాయనే అంచనా వేసుకుంటోంది.జిల్లాలో జూన్‌లో 68.2 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి నైరుతి తిరోగమనం కారణంగా 35.9 మి.మీ మాత్రమే వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగించింది. సీజన్ ఆరంభంలో మంచి వర్షపాతం నమోదైతే విత్తనం వేయడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఫలితంగా ఖరీఫ్ సీజన్ ఊపందు కునే అవకాశం ఉంటుంది. నమోదు స్థాయికి సగం మాత్రమే వర్షపాతం నమోదు కావడంతో వ్యవసాయ బోర్ల కింద మాత్రమే పంటల సాగు నడుస్తోంది. మెట్టప్రాంతాల్లో విత్తనం విత్తడానికి అవకాశం లేకుండా పోయింది.జులైలో 96.7 మి.మీ, ఆగస్టులో 118.4. మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. జులైలో 9.35 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావడంతో రైతాంగం సాగుకు సన్నద్ధమైంది. ప్రస్తుతం అల్పపీడన వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో కురుస్తున్న అడపాదడపా వర్షాలకు రైతాంగం ఆశాభావంతో ముందుకు కదులుతోంది. జులైలో నైరుతి ఏమే రకు సహకరిస్తుందనే అంశంపై ఖరీఫ్ సాగు ఆధారపడి ఉందని చెప్పవచ్చు.ఖరీఫ్ సీజన్‌లో అత్యధికంగా పత్తి సాగవుతోంది. 2,398 ఎకరాల్లో విత్తనం పడింది. 2,092 ఎకరాల్లో మినుములు, 4,487 ఎకరాల్లో వేరుశనగ విత్తనం పడింది. జిల్లాలోని ప్రధాన ఆహార పంటల్లో మినుములు 837 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా, 2092 ఎకరాల్లో విత్తనం పడడం గమనార్హం.53,268 ఎకరాల్లో పత్తి సాగు కావాల్సి ఉండగా 2,398 ఎకరాల్లోనే పడినట్లు తెలుస్తోంది. ఇతర పంటల సాగుదలను పరిశీలిస్తే మొక్కజొన్న 1407 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా 61 ఎకరాల్లో సాగుకు నోచుకుంది. పప్పుదినుల సాగులో కందులు 8528 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 18 ఎకరాల్లో మాత్రమే సాగు కావడం గమనార్హం. ఆయిల్ సీడ్స్ వివరాలను పరిశీలిస్తే పొద్దుతిరుగుడు 2889 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 89 ఎకరాల్లో సాగు కావడం ఆందోళన కలిగిస్తోంది. సోయా బీన్ 2119 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 2.5 ఎకరాల్లో మాత్రమే విత్తనం పడడం వర్షాభావ తీవ్రతను తెలుపుతోంది. మిరప 3,198 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 195 ఎకరాల్లోనే విత్తనం పడడం ఆందోళన కలిగిస్తోంది. ఉల్లి, ధనియాల పంటల సాగు ఆనవాలే కనిపించకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. మరో వాణిజ్య పంట పసుపు 7,518 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా ఒక్క ఎక రమూ సాగుకు నోచుకోకపోవడం గమనార్హం. జిల్లాలోని ప్రధాన ఆహారపు పంట వరి 82,041 ఎకరాలకు గానూ 261 ఎకరాల్లోనే సాగు కావడం గమనార్హం.