YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సివిల్ కోడ్... ఏ పార్టీ వాదన ఏంటీ

 సివిల్ కోడ్... ఏ పార్టీ వాదన ఏంటీ

న్యూఢిల్లీ, జూలై 6, 
ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా మోడీ సర్కార్‌ తీసుకొచ్చే ఉమ్మడి పౌర స్మృతిపై దేశంలోని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఒకే పార్టీకి చెందిన నాయుకులే వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు కూడా భిన్న వాదనలను వినిపిస్తున్నాయి. యూనిఫాం సివిల్‌ కోడ్‌ (యుసిసి) కొన్ని పార్టీలు మద్దతిస్తే, మరికొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. మేఘాలయాలో ఎన్‌డిఎ ప్రధాన భాగస్వామ్య పక్షం నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పిపి) తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మేఘాలయ ముఖ్యమంత్రి, ఎన్‌పిపి అధ్యక్షుడు కాన్రాడ్‌ కె.సంగ్మా భారత వాస్తవ ఆలోచనకు యుసిసి విరుద్ధమని అన్నారు. యుసిసిని సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకించింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ యుసిసిపై బిజెపి ఉధృతంగా ప్రచారం చేస్తుందని, వచ్చే ఎన్నికల్లో ఓట్లను కొల్లగొట్టడం కోసం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. యుసిసిని కాంగ్రెస్‌, డిఎంకె, జెడియు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఆర్‌జెడి, సిపిఎం, సిపిఐ, టిఎంసి, ఐయుఎంఎల్‌ వంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. శివసేన (ఉద్దవ్‌ ఠాక్రే), ఆమ్‌ ఆద్మీ పార్టీలు దీనికి మద్దతిస్తున్నాయి.ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) మిత్ర పక్షమైన సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ (ఎస్‌బిఎస్‌పి) ఉమ్మడి పౌర స్మృతికి మద్దతు ప్రకటించింది. దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలని స్పష్టం చేసింది. ఎస్‌బిఎస్‌పి చీఫ్‌, ఎమ్మెల్యే ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ మాట్లాడుతూ, కేంద్రం యుసిసిని తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని, మద్దతిస్తానని చెప్పారు. అందరికీ ఒకే చట్టం ఉండాలని అన్నారు. దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నదానికి తాను మద్దతిస్తానని చెప్పారు. అలాగే యుసిసికి బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి) అధ్యక్షులు మాయావతి మద్దతు తెలిపారు. భారతీయులందరినీ యుసిసి కలిపి ఉంచుతుందని అన్నారు. యుసిసి అమలు వల్ల దేశానికి బలం చేకూరుతుందని, ప్రజల్లో సోదర భావాన్ని పెంపొంది స్తుందని చెప్పారు. అయితే, మోడీ ప్రభుత్వం బలవంతంగా ఈ సంస్కరణను చేపట్టేందుకు జరుపుతున్న ప్రయత్నాన్ని ఆమె తప్పుపట్టారు. 'యుసిసి అమలుకు మా పార్టీ వ్యతిరేకం కాదు. అయితే యుసిసి అమలు చేయడం కోసం బిజెపి అనుసరిస్తున్న వైఖరికి మేము మద్దతివ్వం. ఈ అంశాన్ని రాజకీయం చేసి, బలవంతంగా దేశంలో యుసిసి అమలు చేయాలని బిజెపి కోరుకుంటుంది' అని అని మాయావతి విమర్శించారు.యుసిసిని కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తున్నా.. దీనిపై పార్టీ నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ పిడబ్ల్యుడి శాఖ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ ప్రతిభ సింగ్‌, మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ తనయుడు, కాంగ్రెస్‌ నేత విక్రమాదిత్య సింగ్‌ యుసిసిని సమర్థిస్తూ మాట్లాడారు. యుసిసిని కాంగ్రెస్‌ సమర్థిస్తుందన్నారు.ఐకమత్యం, సమగ్రతలను మరింత ప్రోత్సహించేందుకు తమ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు. అయితే ప్రజలను తప్పుదోవపట్టించడానికే దీనిపై బిజెపి చర్చను ప్రారంభించిందని ఆరోపించారు. దాదాపు రెండు నెలల నుంచి మణిపూర్‌ తగులబడు తోందని, అంతర్యుద్ధం వచ్చే పరిస్థితి కనిపిస్తోందని, అయినాకానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇప్పటికీ బిజెపి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. దేశంలో వాస్తవ సమస్యల గురించి బిజెపి నోరు మెదపదన్నారు. విక్రమాదిత్య వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎంపి, సీనియర్‌ నేత ప్రమోద్‌ తివారీ స్పందిస్తూ, తమ పార్టీ వ్యూహ నిర్ణయ సమావేశంలో తీసుకునే నిర్ణయమే అంతిమమని, దీనికి భిన్నంగా ఎటువంటి అభిప్రాయానికి ప్రాధాన్యం లేదని చెప్పారు. యుసిసిపై వ్యూహాన్ని నిర్ణయించేందుకు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. యుసిసి ముసాయిదా వచ్చిన తర్వాత తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తామన్నారు. దేశంలోకి ఏకరూప సివిల్‌ కోడ్‌ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తమ పార్టీ అన్ని విధాలా వ్యతిరేకిస్తుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. 'యుసిసి సమాజంలో సమానత్వాన్ని సాధించే లక్ష్యాలను చేరుకోదు. యుసిసి వస్తే భిన్న మతాలు, కులాలకు చెందిన మహిళలు పక్షపాతానికి గురవుతారు. 2017లో చివరి రౌండ్‌ సంప్రదింపుల నుండి యుసిసిని వ్యతిరేకించింది, ఇది రాజకీయంగా ప్రేరేపితం'' అని అన్నారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ యుసిసి ఒక నిర్దిష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటుందని, ఈ కసరత్తుకు పార్లమెంటు నాయకత్వం వహించాలని, లా ప్యానెల్‌ కాదని అన్నారు. 'యుసిసిపై ఏకాభిప్రాయం లేదు. ఇది ఒక నిర్దిష్ట సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు భావించబడింది. మేము లింగ సమానత్వం, లింగ సాధికారత, మహిళల హక్కులను అంగీకరిస్తాము. ఎందుకు లా కమిషన్‌ ఈ కసరత్తు చేస్తోంది. పార్లమెంటు ఉంది. మన ప్రజాస్వామ్యంలో పార్లమెంటు అత్యున్నతమైనది. ఏది చర్చించాలన్నా అక్కడ చర్చించాలి' అని అన్నారు. మరోవైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో యుసిసి బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతోంది.

Related Posts