విజయవాడ, జూలై 7,
తెలంగాణలో 2014 తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో ఓపెన్ కోటా రిజర్వేషన్లను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఏపీలో కూడా కొత్త మెడికల్ కాలేజీలకు అవే నిబంధనలు వర్తింప చేయనున్నారు. దీంతో తెలంగాణ స్థానికత కలిగిన వారికి ఏపీలో సీట్లు కేటాయించరు. తెలంగాణ స్థానికత కలిగిన వారికే కొత్త మెడికల్ కాలేజీల్లో పూర్తిగా మెడికల్ సీట్లను కేటాయించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజషన్ యాక్ట్ మరియు ఆర్టికల్ 371D నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేశారు. ఈ నిబంధనల ప్రకారం 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.తెలంగాణ సర్కారు మెడికల్ కాలేజీ సీట్లలో ఓపెన్ కేటగిరీ క్లోజ్ చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మేల్కొంది. ఏపీలో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్ర విద్యార్థులకే చెందేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.మెడికల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో హెల్త్ వర్సిటీ అధికారులు బుధవారం సుదీర్ఘంగా చర్చించారు. 15శాతం ఓపెన్ కేటగిరీని తొలగిస్తే లాభమా? నష్టమా? అన్నదానిపై సమగ్రంగా చర్చించారు. ఎంబీబీఎస్‌తో పాటు పీజీ మెడికల్ సీట్ల భర్తీలో కూడా ఓపెన్ కేటగిరీని తొలగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా న్యాయ శాఖ సలహా తీసుకోనున్నారు. తెలంగాణ మాదిరి ఏపీలో ఓపెన్ కేటగిరీ రద్దుపై వెంటనే నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. తెలంగాణలో మెడికల్ సీట్లన్నీ మొత్తం ఒకే రీజియన్ పరిధిలో ఉంటాయి. స్థానికత ప్రకారం సీట్ల భర్తీ మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే ఉంటుంది.15 శాతం కోటా రద్దు చేస్తే మిగిలే సీట్లు ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యార్థులకు లభిస్తాయి. ఏపీలో అలాంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని రెండు రీజియన్లు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణలుగా మూడు రీజియన్ల వారీ సీట్ల కేటాయింపు జరిగేది.మెడికల్ సీట్లలో 15 శాతం ఓపెన్ కేటగిరీ రద్దు చేస్తే మొత్తం సీట్లను ఏ రీజియన్ విద్యార్థులు ఆ రీజియన్‌లోనే తీసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎంబీబీఎస్, పీజీ సీట్లు అత్యధికంగా ఆంధ్రా వర్సిటీ పరిధిలోనే ఉన్నాయి. ఎస్వీయూ పరిధిలో తక్కువగా ఉన్నాయి. దీంతో ఓపెన్ కేటగిరీ రద్దు చేస్తే ఎస్వీయూ పరిధిలోని విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.ఆంధ్రా, ఎస్వీయూ పరిధిలో 15 శాతం ఓపెన్ కేటగిరీ సీట్లను యథాతథంగా ఉంచితే తెలంగాణ విద్యార్ధులకు కూడా అందులో సీట్లు పొందే అవకాశం ఉంటుంది. 15 శాతం ఓపెన్ కేటగిరి రిజర్వేషన్ ఇస్తే ఎవరైనా వచ్చి సీటు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఆంధ్రా, రాయలసీమ రీజియన్లకు అమోదయోగ్యంగా ఉండేలా విధానాన్ని రూపొందించాలని భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో ఏపీ కూడా ఓపెన్ కేటగిరీ సీట్ల భర్తీ క్లోజ్ చేయాలని నిర్ణయించింది. గురువారం ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో హెల్త్ వర్సిటీ అధికారులు భేటీలో దీనిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.ఏపీలో కూడా పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో సీట్ల భర్తీలో రిజర్వేషన్ నిబంధనలు మారనుండటంతో స‌్థానిక విద్యార్ధులకు అదనంగా సీట్లు దక్కే అవకాశం ఉంది.