విజయవాడ, జూలై 7,
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్‌పై విశాఖ ఎయిర్ పోర్టులో కోడి కత్తి దాడి జరిగిన సంగతి జరిగింది. 2018 అక్టోబర్ 25న 294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్ జగన్ హైదరాబాద్ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయంకు రాగా.. అదే విమానాశ్రయం క్యాంటీన్ లో పనిచేస్తున్న వెయిటర్ సెల్ఫీ తీసుకుంటానని వైఎస్ జగన్ వద్దకు వచ్చారు. అతను వస్తూనే జగన్‌పై కోళ్ల పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్ జగన్ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వైఎస్ జగన్ భుజానికి కత్తి తగిలింది. అది చిన్న గాయం కావడంతో వెంటనే జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు. కానీ, అక్కడ నుండే అసలు సినిమా మొదలైంది. జగన్ హైదరాబాద్ చేరుకున్న తరవాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరి మూడు వారాల వరకూ అక్కడే ఉన్నారు. దీంతో అదే పెద్ద సంచలనం అయింది.అప్పట్లో కోడికత్తి జగన్ మోహన్ రెడ్డికి ఎంత గాయం చేసిందో ఆ ఆసుపత్రి వైద్యులకే తెలుసు కానీ.. దాని వలన జగన్ పొందిన లబ్ది ఎంతన్నది మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఈ దాడిని కూడా జగన్ తనకు సానుభూతి దక్కేలా మలచుకున్నారు. చిన్నదో పెద్దదో దాడి అయితే జరిగింది కదా. ఎవరు చేశారు ఎందుకు చేశారనేది అనవసరం. అసలే ఎన్నికల సమయం. జరిగిన దానిని తనకు ఎంత అనుకూలంగా మలచుకుంటే అంత బెనిఫిట్. అందుకే చిన్న గాయానికి ఆసుపత్రిలో మూడు వారాల రెస్ట్ అవసరం అయింది. ఆ తర్వాత ఈ కేసు అప్పటి టీడీపీ ప్రభుత్వం మెడకి చుట్టాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు కలిసి కుట్ర పన్ని సీఎం జగన్ పై హత్యాయత్నం చేశారని పెద్ద ఎత్తున విమర్శలకు దిగి ప్రజలలో అదే నిజం అనేలా ప్రయత్నించారు.కాగా, ఆ తర్వాత వైసీపీ గెలిచినా ఈ కేసు అప్పటి నుండి ఇప్పటికీ తేలలేదు. అసలు కుట్ర దారులు ఎవరు? ఈ దాడి వెనక ఉద్దేశ్యం ఏంటన్నది ఇప్పటికీ తేలలేదు. ఈ కేసులో నిందితుడు కోడి కత్తి శీనుకు శిక్ష పడిందా లేదా తెలియదు. అతనే దోషా.. దాని వెనక ఎవరూ లేరన్నది కూడా తేల్చలేదు. గత ఐదేళ్లుగా శీను జైల్లోనే మగ్గిపోతున్నాడు. ఈ కేసులో కొద్దిరోజుల క్రితం శ్రీనివాస్ కు ఎన్ఐఏ కోర్టు గతంలో బెయిల్ ఇవ్వగా ఆ బెయిల్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. దీంతో, శ్రీనివాస్ ఐదు సంవత్సరాల నుంచి జైల్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది తాజాగా ఎన్ఐఏ కోర్టులో మరోసారి వాదనలు వినిపించగా.. విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు శ్రీనివాస్ అభ్యర్థనను తిరస్కరించింది. బెయిల్ కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టాలని సూచిస్తూ తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది.
అయితే, తన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించడంతో శ్రీనివాస్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ కేసు విచారణలో జాప్యాన్ని నిరసిస్తూ శ్రీను జైల్లోనే నిరాహారదీక్ష చేపట్టనున్నాడట. శ్రీను జైల్లో దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నాడని ఆయన తరఫు లాయర్అబ్దుల్ సలీం కీలక వ్యాఖ్యలు చేశారు. 5 సంవత్సరాల నుంచి తన క్లయింట్ శ్రీనివాస్ జైల్లోనే మగ్గుతున్నాడని, కోర్టు అతనికి రెగ్యులర్ షెడ్యూల్ ప్రకటించాలని లాయర్ సలీం కోరారు. షెడ్యూల్ ప్రకటించకుంటే శ్రీనివాస్ నిరాహార దీక్ష చేస్తానంటున్నాడని ప్రకటించారు. మరి, ఈ వ్యవహారంపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది? కోర్టు ఈ కేసులో అసలు దోషులు ఎవరో? ఏ ఉద్దేశ్యంతో దాడి చేశారో తేలుస్తారా? ఈలోగా శ్రీను జీవితం జైల్లోనే మగ్గిపోవాలా? లేక బెయిల్ ఇచ్చి అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తారా అన్నది చూడాల్సి ఉంది.