విజయవాడ, జూలై 8,
ఎన్నికలకు 10 నెలల ముందే మొదట విడత మేనిఫెస్టో ప్రకటించిన తెలుగుదేశం పార్టీ.. రెండో విడత మేనిఫెస్టోపై కసరత్తు మొదలుపెట్టింది. రాజమండ్రి మహానాడు వేదికగా ఫస్ట్ ఫేజ్ మేనిఫెస్టోను భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసారు. మహిళలు, యువత, రైతులు, బీసీలు, ఇంటింటికీ మంచినీరు,పూర్ టు రిచ్ వంటి ఆరు అంశాలతో తొలి మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లున్నారు పార్టీ నాయకులు.మొత్తం 5 జోన్ లలో బస్సుయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి మేనిఫెస్టోను వివరించడంతో పాటు వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు టీడీపీ నాయకులు.ఇక వచ్చే దసరాకు రెండో విడత మేనిఫెస్టోను ప్రకటించేలా టీడీపీ కసరత్తు మొదలుపెట్టింది. రెండో విడత మేనిఫెస్టోలో ఏయే అంశాలకు పెద్దపీట వేయనున్నారన్నది ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది. ఉద్యోగులతో పాటు మధ్యతరగతి వారికి సంబంధించిన అంశాలను రెండో విడతలో ప్రకటించనున్నట్లు తెలిసింది. అధికారంలోకి వస్తే అమరావతితో పాటు ఏపీ మొత్తం అభివృద్ది ఎలా చేస్తామనేది కూడా ఇందులో ప్రధానంగా పొందుపరచనున్నట్లు తెలిసింది.ఇప్పటికే మేనిఫెస్టో కమిటీ దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించింది. వైసీపీ హయాంలో రాష్ట్ర అభివృధ్ది ఏమాత్రం జరగలేదని చెబుతున్న టీడీపీ…తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లలో సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రఆన్ని గాడిలో పెడతామని చెప్పుకొస్తుంది.సంపద సృష్టించడం ద్వారా సంక్షేమ పథకాలకు నిధులు సమస్య లేకుండా చూస్తామంటున్నారు చంద్రబాబు. దీంతో పాటు మొదటి విడతలో మిగిలిన అంశాలతో పాటు బస్సు యాత్రల ద్వారా ప్రజల నుంచి వచ్చే సూచనలు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండో మేనిఫెస్టోను ప్రకటించాలనుకుంటోంది టీడీపీ అధిష్టానం.రెండో విడత మేనిఫెస్టోలో రాష్ట్రాభివృద్ధికి పెద్ద పీట వేయనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాభివృద్ధి తిరోగమనంలో పయనిస్తోందని మేనిఫెస్టో ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. రాష్ట్ర రాజధానితో పాటు ఏ జిల్లాను ఎలా అభివృద్ది చేస్తామనే విజన్ ను ముందుగానే ప్రకటిస్తారని చెబుతున్నారు. గతంలో కూడా జిల్లాల అభివృద్దిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ పలు కారణాల వల్ల పూర్తి స్థాయిలో అమలుచేయలేకపోయారు. ఈసారి మాత్రం జిల్లాల అభివృద్ది,సాగునీటి ప్రాజెక్ట్ లు,మౌళికవసతుల కల్పన,ఉపాధి కల్పనకు సంబంధించి నిర్ధిష్ట కాలపరిమితితో ముందుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారట. ఇవే అంశాలను రెండో విడత మేనిఫెస్టో లో పొందుపరుస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం.దసరా నాటికి 175 నియోజకవర్గాలకు ఇంచార్జిల నియామకం పూర్తి చేసి.. పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేసి ఎన్నికల బరిలో దిగాలనే ఆలోచనలో చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.