విజయవాడ, జూలై 8,
స్థాయి పెరిగిన చిల్లర డబ్బుల మీద కక్కుర్తి మాత్రం పోదనే విషయం బెజవాడ నాయకుల విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. రోడ్లపై ఫుడ్ కోర్టుల పేరుతో దుకాణాలు ఏర్పాటు చేయించడం, వాటి నుంచి రోజువారీ వసూళ్ళు చేయడం లాభసాటిగా మారడంతో నేతల మధ్య పోటీ పెరిగింది.ఫుడ్ కోర్టులో వసూళ్లు కళ్లు చెదిరేలా ఉండటంతో దుకాణాల ఏర్పాటు విషయంలో అధికార పార్టీ నేతల మధ్య పోటీ నెలకొంది. విజయవాడలో ఈట్ స్ట్రీట్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రదేశంలో దుకాణాలను నిర్వహించే విషయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మీ వర్గాలు రోడ్డున పడి కొట్టుకున్నారు.ఫుడ్ కోర్టు వద్ద తోపుడు బండిపై బిర్యానీ దుకాణం ఏర్పాటు చేసే విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం ఏర్పడింది. ఈ ఘటనలో మేయర్ భాగ్యలక్ష్మి అనుచరుడిపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరులు దాడి చేయడం కలకలం రేపింది.విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టు పేరుతో ఏర్పాటు చేసిన 'ఈట్ స్ట్రీట్' లో వైసీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఆహ్లాదకరంగా ఉండాల్సిన ఈ ప్రాంతంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దుకాణాలు పెట్టేందుకు స్థానిక నేతలకు రోజువారీ అద్దెలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.ఫుడ్ కోర్టులో కేటాయించిన దుకాణాల్లో అనేక అవకతవకాలు జరిగాయని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కనుసన్నల్లోనే దుకాణాలు ఏర్పాటు చేయాలనే రూల్ అమలు చేయడంపై మిగిలిన నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి మేయర్ భాగ్యలక్ష్మి చెప్పారని నూతనంగా ఓ బిర్యానీ బండిని పెట్టించేందుకు ఇద్దరు వీఎంసీ ఉద్యోగులను ఫుడ్ కోర్టుకు పంపించారు.బండి ఏర్పాటు చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే విష్ణు అనుచరులు వచ్చి వీఎంసీ ఉద్యోగులను నిలదీశారు. ఫుడ్ కోర్టులో బండి పెట్టాలంటే ఎమ్యెల్యే అనుమతి కావాలని మేయర్ ఎవరు చెప్పడానికి అని వాగ్వాదానికి దిగారు. వీఎంసీ ఉద్యోగులతో పాటు బండి పెట్టేందుకు వచ్చిన వ్యక్తిపై దాడి చేశారు. మేయర్ పంపారని చెప్పినా ఎమ్మెల్యే అనుచరులు వారిపై దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఫుడ్‌కోర్టులో బండ్లు ఎలా పెడతారో చూస్తామంటూ పరస్పరం హెచ్చరికలు చేసుకున్నారు. ఈ ఘటనలో మాచవరం పోలీసుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా ఉందని తెలుస్తోంది. తరచూ గొడవలు జరుగుతున్నా వాటిని నియంత్రించడంలో మాత్రం విఫలం అవుతున్నారు.2015లో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నసమయంలో రాత్రి పూట అందరికి ఆహారం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఫుడ్ కోర్టుల్ని ప్రారంభించారు. మొదట్లో పూర్తిగా పోలీస్ శాఖ పర్యవేక్షణలో ఫుడ్ కోర్టు సాగేది. రాత్రి సమయంలో తిరిగే వారిని గుర్తించడం, నేరస్తుల సమాచారాన్ని తెలుసుకునే లక్ష్యాలతో నగరంలో వీటిని ఏర్పాటు చేశారు.మొదట్లో ఫుడ్ కోర్టులను పోలీసులు సమర్థంగా వ్యవహరించినా తర్వాత వాటిని రాజకీయ నేతల చేతుల్లోకి వదిలేశారు. వాటిలో వచ్చే చిల్లర డబ్బులు ఏరుకోడానికి అలవాటు పడిన నాయకులు నగరంలో ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై వ్యాపారాలు చేయించి రోజువారీ అద్దెలు వసూలు చేయించడం మొదలు పెట్టారు. నగరంలో అత్యధికంగా ఒక్క ఎమ్మెల్యేకే ఈ తరహా ఆదాయం సమకూరడం వైసీపీలో మిగిలిన వారికి కంటగింపుగా మారింది.