న్యూఢిల్లీ, జూలై 8,
పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు వస్తాయని మళ్లీ విస్త్రతమైన చర్చ ప్రారంభమయింది. వచ్చే నవంబర్, డిసెంబర్‌లోనే ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోందని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీజేపీని ప్రక్షాళన చేయడం, కేంద్ర మంత్రి వర్గ విస్తరణను చేయనుండటం మాత్రమే ఎన్డీఏను కూడా బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. కొత్త పార్టీలను చేర్చుకుంటున్నారు. అందుకే మందస్తుకు మోదీ కూడా రెడీ అయ్యారా అన్న అనుమానాలు రాజకీయవర్గాల్లో ప్రారంభమయ్యాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ఒక్క రాజస్థాన్ లో మాత్రమే బీజేపీ పరిస్థితి మెరుగ్గా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ రాష్ట్రాల్లో ఫలితాలు వచ్చిన తర్వాత మూడు నెలల వ్యవధిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ మార్చిమొదటి వారంలోనే ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో వ్యతిరేక ఫలితాలు వస్తే.. సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం పడుతుందేమోనన్న ఆందోళన బీజేపీ వర్గాల్లో ఉంది. కర్ణాటక ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తర్వాత మోదీ అజేయుడు కాదన్న అభిప్రాయాన్ని విపక్ష పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఏడాది చివరిలో జరగనున్న రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోతే… మోదీ మానియా అనేది అసలు లేదన్న అభిప్రాయం అంతటా వ్యాపిస్తుంది. మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌తో బీజేపీ ముఖాముఖి పోరాడుతోంది. తెలంగాణలో త్రిముఖ పోటీ ఉంది. కానీ అక్కడ ఇటీవల పరిణామాలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. ముఖాముఖి పోరులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే… ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటుంది. ఇప్పటికే కర్ణాటక ఇచ్చిన ఊపు ఉంది. ఇది బీజేపీకి ఇబ్బందికర పరిణామమే. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు కూడా బలం పెంచుకుంటున్నాయి. దక్షిణాదిలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే కీలకంగా ఉన్నాయి. ఈ పార్టీలన్నీ సంప్రదాయంగా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఓ వైపు కాంగ్రెస్ పుంజుకుని.. ఈ ప్రాంతీయ పార్టీలు కూడా.. అండగా నిలిస్తే.. బీజేపీకి ఇబ్బందికర పరిణామమే. పైగా ఇటీవల ప్రాంతీయ పార్టీలన్నీ కూటమిగా మారుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పటి వరకు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను అంచనా వేసుకుని.. సిద్ధాంతాల ప్రాతిపదికగా అందరూ ఒకే వేదికపైకి రావడానికి కొంత సమయం పడుతుంది. పట్నాలో ఓ సమావేశం అయింది. బెంగళూరులో రెండో సమావేశం కోసం ప్రయత్నిస్తున్నారు. విపక్ష పార్టీలన్నీ ఓ కూటమిగా మారే ప్రయత్నాల్లోఉండగానే.. ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన బీజేపీ చేస్తున్నట్లు సమాచారం. అలా చేయడం వల్ల ఎవరికి వారు పోటీ చేసి.. ఓట్లు చీలిపోయి.. లాభం పొందుతామని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు నిధుల సమస్య పట్టి పీడిస్తోంది. కాంగ్రెస్ పార్టీ రేసులోకి వచ్చినట్లు అనిపిస్తే.. ఆ పార్టీకి విరాళాలు వస్తాయి. ఇది బీజేపీకి చిక్కులు తెచ్చి పెట్టే అంశమే. అందుకే.. ఎన్నికల ఖర్చులు తగ్గించడానికి జమిలీ ఎన్నికలకు వెళ్తున్నామని.. ఆ దిశగా తొలి అడుగు వేస్తున్నామని బీజేపీ చెప్పుకునే అవకాశం ఉంది. ఈ దిశగా కేంద్రం ప్రయత్నిస్తుందా లేదా అన్నది మాత్రం ఓ వారం రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.