YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలే కీలకం

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలే కీలకం

హైదరాబాద్
బీసీ బంధుపై బీఆర్ఎస్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బీసీల ఓట్లు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కీలకం కానుండటంతో వారిని ఆకట్టుకునేందుకు ప్లాన్ చేస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు బీసీలను దూరం చేయాలంటే ఇదొకటే మార్గమని భావిస్తున్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలు అన్నిపార్టీలకు కీలకం కానున్నాయి. విపక్షాలు ఉనికి కోసం, అధికారంకోసం సర్వశక్తులు ఒడ్డేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. బీఆర్ఎస్ సైతం మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే గులాబీ బాస్ దూకుడు పెంచారు. పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా బీసీలను ఆకట్టుకునే ప్లాన్ చేస్తున్నారు. దళితబంధుతో బీసీలు గుర్రుగా ఉన్నారు. బీసీబంధు డిమాండ్ సైతం తెరమీదకు వచ్చింది.
అయితే ముందుస్తుగా లక్షసాయాన్ని తెరమీదకు తెచ్చిన కేసీఆర్.. మొదటగా కేవలం 14 కులాలవారికే సాయమని ప్రకటించడంతో మిగతా కులాలు సైతం ఆగ్రహంతో ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపోటములను డిసైడ్ చేసేది బీసీలు కావడంతో వారికి గాలం వేసే పనిలో గులాబీ బాస్ నిమగ్నమయ్యారు. అందులో బాగంగానే బీసీబంధును తెచ్చేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. లబ్దిదారుల ఎంపిక ఎలా? మార్గదర్శకాలు ఏలా ఉండాలి? అనేదానిపై సమాలోచన చేస్తున్నట్లు సమాచారం.
5 లక్షలా.. 10 లక్షలా..
దళితబంధు పథకం లబ్దిదారులకు ప్రభుత్వం 10 లక్షలు అందజేస్తుంది. అయితే బీసీలు రాష్ట్ర జనాభాలో 50 శాతానికిపైగా ఉండటంతో వారికి ఆస్థాయిలో అందజేస్తే ఎంతఖర్చు చేయాల్సి ఉంటుందనేది బేరీజు వేస్తున్నట్లు సమాచారం. ఎక్కువ మందికి ఇవ్వాలంటే బీసీబంధును 10 లక్షలు కాకుండా 5లక్షలు అందజేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కేసీఆర్ చర్చిస్తున్నారు. బడ్జెట్‌లో ఎంత కేటాయించాలి.. బీసీలోని ఏయే కులాలకు కేటాయించాలనేదానిపై సైతం పలువురు నిపుణులతో చర్చించినట్లు సమాచారం.
మార్గాల అన్వేషణ
ఇప్పటికే ఒకవైపు దళితబంధును పూర్తిస్థాయిలో అమలు చేయడంలో సర్కార్ జాప్యం చేస్తుంది. ఈ తరుణంలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీబంధుపై కసరత్తును ప్రారంభించడంతో ఈ పథకానికి ఆదాయమార్గాల అన్వేషణపై దృష్టిసారించింది. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడా ఉన్నాయి.. వాటిని అమ్మితే వచ్చే ఆదాయం ఎంత..? విపక్షాలకు ఎన్నికల అస్త్రం కాకుండా ఎలా విక్రయించాలనేదానిపై కేసీఆర్ మంతనాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అన్ని సవ్యంగానే జరిగితే బీసీలకు బీసీబంధు వచ్చినట్లే.
కాంగ్రెస్, బీజేపీలో రెడ్డి నాయకత్వం
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో అదే ఎన్నికలకు అస్ర్తంగా కేసీఆర్ భావిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గాలతో బీసీలకు న్యాయం జరుగదని బీఆర్ఎస్‌తోనే సాధ్యమనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. కాంగ్రెస్‌లోని బీసీల పరిస్థితిపై ఆ పార్టీ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హాట్ కామెంట్స్ చేశారు. ఇతర పార్టీలలో బీసీలు ఎలా గెలవగలుగుతున్నారు?.. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు గెలవలేక పోతున్నారని ప్రశ్నించారు.

అత్యధిక శాతం కలిగిన బీసీలకు రాజకీయ కోణంలో అవకాశాలు కల్పించాలన్నారు. బీసీలను విస్మరిస్తే.. ఏ రాజకీయ పార్టీకి అయినా మనుగడ కష్టమన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ఎందుకు బీసీలకు విశ్వాసం కలిగించలేకపోతుందో.. కాంగ్రెస్ అధినాయకత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. పొన్నాల వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇదిలా ఉంటే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఎన్నికలకు ముందు మార్చడం చర్చకు దారితీసింది. బీసీని కాదని రెడ్డికి అప్పగించడంలో ఆంతర్యమేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీంతో ఆ పార్టీకి సైతం బీసీలు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీసీలకు బీఆర్ఎస్ దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే బీసీ బంధుతో ఆ వర్గాలను ఆకర్షించి రాబోయే ఎన్నికల్లో లబ్ది పొందాలని కేసీఆర్ భావిస్తున్నారు.

Related Posts