విజయవాడ, జూలై 10,
కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం. తిరుమల గిరులపై శ్రీమహావిష్ణువు.. వేంకటనాథుడిగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కలియుగదైవంగా కీర్తింపబడుతున్నాడు. ప్రతి హిందువు కల శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కలు తీర్చుకోవడం. అందుకనే తమకు వీలైనప్పుడల్లా.. తిరుమలకు వెళ్లి.. స్వామివారి దర్శనం చేసుకుంటారు. దర్శనానంతరం.. శ్రీవారి భోజనాన్ని మహా ప్రసాదంగా భావించి స్వీకరిస్తారు. కొండపై ఉన్నన్ని రోజులు ఉచితంగా లభించే ఈ భోజనం చేయడానికి ఇష్టపడతారు. ఎంతో రుచికరంగా ఉండే ఈ భోజనం వెనక.. అనేకమంది స్వామి వారి సేవకుల శ్రమ దాగి ఉంది తిరుమల కొండపై శ్రీవారిని రోజుకి దాదాపు డెబ్భై ఐదు వేల నుండి లక్ష మంది భక్తులు దర్శనం చేసుకుంటారని అంచనా.. మరి ఇంత మంది భక్తులకు రోజూ.. అన్నదానం చేయడం అంటే.. అది ఒక్క శ్రీవారికి సాధ్యమేమో.. అది కూడా భారీ ఎత్తున జరిగే ఈ అన్నదానము రుచిగా శుచిగా చేయడం విశేషం. తిరుమలలో నిత్యాన్నదానం 1983లో మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం నేటి వరకు అప్రతిహంగా సాగుతూనే ఉంది.తిరుమలలో ఒక్కరోజుకి జరిగే ఉచిత అన్నప్రసాద ఖర్చు సుమారు రూ. 35 లక్షలు ఉంటుందని అంచనా. అన్నప్రసాదం కోసం ఏడాదికి ఒకసారి.. బియ్యం భారీ మొత్తంలో స్వామి వారి డబ్బులతోనే కొనుగోలు చేస్తారు. మరి అంతమందికి అన్నంతో పాటు.. కూర, పప్పు, సాంబారు, పెరుగుని వడ్డిస్తారు.. మరి వేలాది మంది భక్తులకు సరిపడా కూరలు వండాలంటే.. రోజుకి ఎన్ని కూరగాయలు కావాలి. మరి భారీ సంఖ్యలో కూరగాయలు తిరుమలకి ఎలా చేరతాయని ఎప్పుడైనా ఆలోచించారా..తిరుమలలో నిత్యాన్నదానానికి వెళ్లే కూరగాయలు మొత్తం కేవలం ఒక తొమ్మిది మంది మహా భక్తుల సంకల్పంతో ఎన్నో సంవత్సరాల నుండి పూర్తిగా ఉచితంగా వెళ్తున్నాయన్న సంగతి తెలుసా.. అది కూడా ఈ తొమ్మిది మంది భక్తులు కూడా మన దక్షిణ భారతదేశం వారే. ఆంధ్రపదేశ్ లోని విజయవాడ, పలమనేరు, మదనపల్లె, కర్ణాటక లోని చింతామణి, చిక్బల్లాపూర్, తమిళనాడులోని కోయంబెడు , తిరుప్పూర్ ప్రాంతాలకి చెందిన భక్తులు తిరుమల క్షేత్రానికి నిత్యాన్నదానం కోసం కూరగాయలను సమర్పిస్తున్నారు. ఈ తొమ్మిది మంది భక్తులు తమ తమ ప్రాంతాల్లో పండే వివిధ రకాల కూరగాయలు పెంచుతున్న రైతుల వద్దకు వెళ్ళి కూరగాయలు సేకరిస్తారు. ఇలా సేకరించిన కూరగాయలను.. ఒకచోటికి చేర్చి, వాటిని తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన కూరగాయల ట్రక్ లోకి ఎక్కించి తిరుమలకి పంపిస్తారు. ఇలా ఒక్కొక్కొ ట్రక్ లో 10 టన్నుల కూరగాయలు తిరుమలకి చేరుకుంటాయి. ఇలా కూరగాయలను తిరుమల కొండకు చేర్చడానికి ఒకొక్క ట్రక్ పంపడానికి కనీసం లక్ష నుండి లక్షన్నర రూపాయల ఖర్చు అవుతుంది. రవాణా చార్జీలను కూడా ఈ తొమ్మిది మంది.. తమ ప్రాంతాలకు చెందిన భక్తుల నుంచి సేకరిస్తారు. నెలలో ఒక ప్రాంతం నుండి కనీసం రెండు ట్రక్కుల కూరగాయలు వెళ్తాయి. అయితే ఈ కూరగాయల సంఖ్య.. స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను బట్టి మారుతూ ఉంటుంది. విజయవాడ లోని శ్రీవారి భక్తుడు శ్రీనివాస్ సంకల్పంతో, 2014 లో మొదలైన కూరగాయల పంపిణీ కార్యక్రమం.. నేటికీ నిరాటంకంగా నడుస్తోంది. ఈ ప్రాంతంలోని శ్రీవారి భక్తులు వెంకటేశ్వర భక్త సమాజంగా ఏర్పడ్డారు. తమ ప్రాంతాల రైతులని సంప్రదించి కూరగాయలు సేకరించి..స్వామివారి అన్నదానాన్ని అందజేస్తూ.. ఒక యజ్ఞంలా ఈ కార్యాన్ని నడుస్తున్నారు. ఇలా ఈ విజయవాడ ప్రాంతంలోని వారు ఇప్పటివరకు 111 ట్రక్కుల కూరగాయలు స్వామి నిత్యఅన్నదానానికి పంపించారు. ఈ కార్యక్రమానికి శ్రీవారి ప్రధాన అర్చకులు సకుటుంబ సపరివారంగా హాజరు అయ్యి విజయవాడ భక్త సమాజం వారికి తమ ఆశీస్సులు అందించారు. ఎన్ని సమస్యలు.. ఒత్తిళ్ళు ఉన్నా.. శ్రీవారికి, భక్తులకి ఎలాంటి సేవలందించడానికయినా ఈ భక్త సమాజం ముందు ఉంటుంది. ఎవరైనా ఈ మహా కార్యంలో భాగస్వామ్యులు కావాలి అనుకుంటే.. ఈ భక్త సమాజాన్ని సంప్రదించవచ్చు.