తన తండ్రి దేవెగౌడ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని సీఎం కుమారస్వామి అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కుమారస్వామి శుక్రవారం బలపరీక్షను ఎదుర్కొన్నారు.విశ్వాసతీర్మానాన్ని కుమారస్వామి సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో బీజేపీతో కలిసి దేవెగౌడ మనసు గాయపరిచానన్నారు. దేవెగౌడ సెక్యులర్ భావాలు గల వ్యక్తని, తన ఎమ్మెల్యేలను రిసార్ట్స్‌లో ఉంచడం చాలా బాధ కలిగించిందని అన్నారు. 2006లో బీజేపీతో పొత్తుపెట్టుకోవడం తన జీవితంలో మాయని మచ్చని ఆయన అన్నారు. తమ కుటుంబానికి, పార్టీకి రైతు ప్రయోజనాలే ముఖ్యమని కుమారస్వామి స్పష్టం చేశారు. రైతు శ్రేయస్సే కర్ణాటక ప్రభుత్వ ధ్యేయమని, రైతు శ్రేయస్సు గురించి బీజేపీ నేతల నుంచి తెలుసుకోవాల్సిన అవసరంలేదన్నారు. ఏ ఒక్క ప్రాంతానికి, వర్గానికి, కులానికి పరిమితమైన వ్యక్తిని కాదని తనకు అన్ని ప్రాంతాలు, అందరు వ్యక్తులూ సమానమేనని కుమారస్వామి పేర్కొన్నారు.