YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఉత్తరాంధ్రలో టీడీపీ ముక్కులాట...

ఉత్తరాంధ్రలో టీడీపీ ముక్కులాట...

శ్రీకాకుళం, జూలై 10, 
ఉత్తరాంధ్రలో కీలకంగా ఉండే ఉమ్మడి విజయనగరం జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అధినేతలు సైతం ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించేవారు. రోజులన్నీ ఒకేలా ఉండవన్నట్టు రాజకీయం మారిపోయింది. 2014 ఎన్నికల తర్వాత అది స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా.. పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు శిబిరంలో కొందరు… ఆయనంటే గిట్టని వారు మరో శిబిరంలో చేరిపోయారు.2014లో టీడీపీ గెలిచాక.. జిల్లా ఇంఛార్జ్‌ మంత్రిగా గంటా శ్రీనివాసరావు రావడంతో.. అశోక్‌ అంటే గిట్టని వారు.. ముఖ్యంగా కాపు సామాజికవర్గం ఆయనకు చేరువైంది. కిమిడి మృణాళిని.. కేఏ నాయుడు, కంది చంద్రశేఖర్‌, కర్రోతు బంగర్రాజు, మీసాల గీత వంటి నాయకులు తరచూ సమావేశమై వేడి పుట్టించేవారు. అశోక్‌ గజపతిరాజు కేంద్రమంత్రిగా ఉండటం.. ఆ సమయంలో జిల్లాపై ఆయన పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో ఆ శిబిరంలోని నేతలంతా అడ్వాన్స్‌ అయ్యారట. గంటా వెళ్లిపోయాక అశోక్‌ చేతికి పగ్గాలు రావడంతో ఆ శిబిరంలోని టీడీపీ నేతలు సైలెంట్‌ అయ్యారు. వాళ్లంతా సమయం కోసం ఎదురు చూస్తున్న వేళ కొత్త పరిణామాలు తెరపైకి వచ్చినట్టు చెవులు కొరుక్కుంటున్నారు.ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు.. ఉమ్మడి జిల్లాపై ఫోకస్‌ పెట్టారట. ఇన్నాళ్లూ కామ్‌గా ఉన్న కాపు సామాజికవర్గం నాయకులంతా ఆయనతో టచ్‌లోకి వెళ్లారట. కిమిడి కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చి.. నాగార్జునను పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిని చేయడం మొదలు పెట్టి.. నియోజకవర్గాల్లో అశోకవర్గానికి చెక్‌ పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. నెల్లిమర్ల, గజపతినగరం నియోజకవర్గాల్లో ఇంఛార్జులను నియమించకపోవడానికి ఆ వర్గపోరే కారణమని అభిప్రాయపడుతున్నారు.ఇక బాదుడే బాదుడు కార్యక్రమానికి విజయనగరం జిల్లాకు వచ్చిన చంద్రబాబుకు స్వాగతం పలకడంలోనూ టీడీపీలోని వర్గపోరు స్పష్టంగా కనిపించిందట. బాబుకు వెలక్కమ్‌ చెప్పడానికి బస్సు దగ్గరకు అశోక్‌ ముందే చేరుకున్నారు. తర్వాత వచ్చిన కళా వెంకట్రావు.. అశోక్‌ను కలవకుండా మరో చోట కూర్చున్నారు. కళాను చూడగానే.. జిల్లా టీడీపీ నేతలు మెల్లగా ఆయన దగ్గరకు వెళ్లారు. వర్గపోరుతో సంబంధంలేని వాళ్లకు అక్కడేం జరుగుతుందో అర్థం కాలేదట. అశోక్‌, కళాలను ఇద్దరికీ నమస్కారం పెట్టి దూరంగా కూర్చున్నారట తటస్థ నాయకులు.మొత్తానికి 2014 ముందు వరకు జిల్లాలో ఒక్క మాటపై నడిచిన టీడీపీ.. వర్గాలుగా విడిపోయి చెరో శిబిరంలో చేరడం చర్చగా మారింది. దీనికంతటికీ అశోక్‌ ఒంటెద్దు పోకడలే కారణమని కొందరు.. ఈ వర్గాల గోలేంటని మరికొందరు పరస్పరం మాటల తూటాలు దూసుకుంటున్నారు. వచ్చే ఎన్నికలు టీడీపీ కీలకంగా భావిస్తోంది. ఇలాంటి తరుణంలో వర్గాలను ఏకం చేస్తారా? దానికి పార్టీ పెద్దలు చొరవ తీసుకుంటారో లేదో చూడాలి.

Related Posts