YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వెదురుగట్టల్లో చిట్టడవి

వెదురుగట్టల్లో చిట్టడవి

కరీంనగర్, జూలై 10,
చొప్పదండి మండలంలోని వెదురుగట్ట శివారులోని గుట్టల్లో చిట్టడవి రూపుదిద్దుకున్నది. అటవీశాఖ అధికారుల కృషితో 175 ఎకరాల్లో పచ్చదనం పరుచుకున్నది. ఇన్నాళ్లూ రాళ్లూ, రప్పలతో ఉన్న ప్రాంతం నేడు తీరొక్క చెట్లతో కళకళలాడుతున్నది. ఎడారిని తలపించిన ప్రాంతం ప్రకృతి అందాలకు నెలవుగా మారింది. వేలాదిగా వన్యప్రాణులు, పక్షులకు ఆవాసంగా రూపుదిద్దుకున్నది. కొత్తగా రూపొందించిన ‘రిజర్వు ఫారెస్ట్‌’ జాబితాలో ముందు వరుసలో నిలిచి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నది.కరీంనగర్‌ జిల్లాకేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న చొప్పదండి మండలంలోని వెదురుగట్ట శివారులోని ప్రాంతం మూడేండ్ల కిందటి వరకు నిరుపయోగంగా ఉండేది. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అటవీ భూములను కేటాయించింది. ఇందుకు బదులుగా వెదురుగట్ట గుట్టల వద్ద గల సర్వే నంబర్‌ 354లో 175 ఎకరాలను అటవీశాఖకు కేటాయించింది. నష్టపోయిన అటవీ విస్తీర్ణానికి తగ్గట్టుగా ఈ ప్రాంతంలో చిట్టడవిని సృష్టించాలని అటవీశాఖ యంత్రాంగం నిర్ణయించింది. వెంటనే చుట్టూ హద్దులు ఏర్పాటు చేసి ఆధీనంలోకి తీసుకున్నది.నాటిన మొక్కలను కాపాడడంతో పాటు ఎండిన మొక్కల స్థానాల్లో కొత్తవి పెట్టారు. మూడేండ్లుగా శ్రమించడంతో 160 ఎకరాల్లో నాటిన మొక్కలన్నీ బతికాయి. ఒక్కో మొక్క ప్రస్తుతం పన్నెండు అడుగుల వరకు పెరిగింది. కొమ్మలు విస్తరించడంతో దట్టమైన అడవిని తలపిస్తున్నది. గుట్టల పైభాగాల నుంచి చూస్తే లోయ ప్రాంతాలన్నీ పచ్చదనంతో హరిత శోభ సంతరించుకున్నది. ఈ ప్రాంతాన్ని రిజర్వు ఫారెస్టు జాబితాలో చేర్చేందుకు ముందు వరుసలో ఉన్నది.ఏపుగా పెరిగిన మొక్కలతో వెదురుగట్ట గుట్ట చిట్టడవిని తలపిస్తున్నది. పండ్ల మొక్కలతో పాటు మొత్తం 23 రకాలను నాటారు. రావి, మర్రి, వెలగ, సీతాఫల్‌, ఇరికి, మామిడి, తాని, నేరేడు, దిరిసినం, బాదం, ఉసిరి, బబుల్‌, ఇరుమద్ది, వేప, తాప్సి, చిందుగ, నెమలినార, జిట్రేగి, సిసో, గుమ్మడి టేకు, నారేప, బట్టగనం, కానుగ ఉన్నాయి. మొక్కలన్నీ పెరిగి దట్టంగా మారడంతో వన్యప్రాణులకు సురక్షితమైన ఆవాసంగా మారింది. మామిడి, బాదం, ఉసిరి, వెలగ, నేరుడు, సీతాఫలం, ఇరికి ఫలాలు కోతులు, ఇతర ప్రాణుల ఆహారానికి నెలవుగా ఉంది. అడవిలోని ఆహ్లాదకర వాతావరణంలో వేల సంఖ్యలో నెమళ్లు, జింకలు, కుందేళ్లు, కోతులు, పలు రకాల పక్షులు ఆవాసం ఏర్పరుచుకున్నాయి.అనేక ఇక్కట్లను అధిగమించి 160 ఎకరాల్లో కొత్తగా ఓ అడవిని సృష్టించడంతో రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కరీంనగర్‌ జిల్లాకు అడవి లేదనే లోటును తీర్చడంలో అటవీ అధికారులు సఫలీకృతులయ్యారు. వెదురుగట్ట అటవీ ప్రాజెక్టును సందర్శించిన అధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అటవీ అధికారుల కృషిని ప్రశంసించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సమీక్షల్లోనూ ఈ ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తుండడం గమనార్హం. సామాజిక మాధ్యమాల్లోనూ జిల్లా అధికారులను అభినందిస్తూ, మిగిలిన జిల్లాల్లోనూ ఇదే తరహా విధానాన్ని అవలంబించాలని నిర్దేస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్టు పరిధిలో బీట్‌ అధికారిని నియమిస్తే పర్యవేక్షణ మరింత సులభం కానున్నది.పెద్ద పెద్ద బండలు.. రాళ్లూ రప్పలతో ఉన్న ఈ ప్రాంతం మొక్కలు పెరిగేందుకు ఏ మాత్రం అనువైనది కాదు. నేల స్వభావం రీత్యా ఒక్క మొక్క కూడా బతికే పరిస్థితి లేదు. దీంతో ఇక్కడ మొక్కల పెంపకం అటవీ అధికారులకు పెద్ద సవాలుగా మారింది. ఉన్నతాధికారి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అంతా సమన్వయంతో కదిలారు. 175 ఎకరాల్లో సర్వే చేసి, మొత్తం 12 భాగాలుగా విభజించారు. 15 ఎకరాలను దారుల కోసం వదిలారు. మిగిలిన 160 ఎకరాల్లో మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించారు. 2019 జూన్‌లో వెదురుగట్ట అటవీ ప్రాజెక్టులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2019-20లో 45.60 హెక్టార్లలో 57,876 మొక్కలు నాటారు. ఉన్నతాధికారుల మార్గదర్శకత్వంలో కరీంనగర్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, సెక్షన్‌ అధికారులు నిర్విరామంగా శ్రమించి మొక్కలను సంరక్షించారు. ఆ తర్వాత సెమీ మెకానికల్‌, లేబర్‌ ఇంటెన్సివ్‌ పద్ధతుల్లో లక్ష మొక్కలు నాటారు.నిస్సారమైన భూముల్లో నాటిన మొక్కలను కాపాడేందుకు అధికారులు నీళ్ల కోసం భగీరథ యత్నం చేశారు. గుట్టల దిగువనున్న లోతట్టు ప్రదేశంలో బోరు వేయగా పుష్కలంగా నీళ్లు పడ్డాయి. 160 ఎకరాల్లోని మొక్కలకు నీరందించేందుకు గుట్టలపై మూడు చోట్ల కాంక్రీట్‌ ట్యాంకులు నిర్మించారు. దీంతోపాటు 5 వేల లీటర్ల సామర్థ్యంతో మరో రెండు ప్లాస్టిక్‌ ట్యాంకులు ఏర్పాటు చేశారు. ట్యాంకుల నుంచి గుట్టల దిగువకు పైప్‌లైన్లు వేశారు. నడి వేసవిలోనూ నీరందించి మొక్కలు ఎండిపోకుండా రక్షించారు. నాటిన ప్రతిమొక్కనూ పర్యవేక్షించేందుకు 10 హెక్టార్లకు ఒక వాచర్‌ను ఏర్పాటు చేశారు. గుట్టల చుట్టూ తవ్విన హద్దు కందకాల వెంట నాటిన వెదురు ఆకాశాన్నంటేలా పెరిగింది. గచ్చకాయ బయోఫెన్సింగ్‌లా అడవికి రక్షణగా నిలుస్తున్నది.అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమష్టి కృషితోనే వెదురుగట్ట గుట్టల్లో పచ్చదనం నెలకొన్నది. బండరాళ్లు, మొరంతో ఉన్న ఇక్కడి నేల స్వభావం రీత్యా మొక్కలు ఎదిగే అవకాశం చాలా తక్కువే. అయినా, ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకు న్నాం. ప్రతి మొక్కనూ కంటికి రెప్పలా కాపాడడంతోనే స్వల్ప సమయంలోనే అడవి రూపుదిద్దుకుంది. కోతులు, పక్షులకు ఆహార లభ్యతతో పాటు వన్యప్రాణులకు ఆవాసంగా మారింది.

Related Posts