YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎన్నికల దాకా..లైవ్ లోనే ఫ్రీ కరెంట్... పార్టీల వ్యూహం

ఎన్నికల దాకా..లైవ్ లోనే ఫ్రీ కరెంట్... పార్టీల వ్యూహం

హైదరాబాద్, జూలై 15, 
తెలంగాణలో ఉచిత విద్యుత్ మాటల మంటలు ఇప్పట్లో తగ్గేలా లేవు. ఏ క్షణంలో రేవంత్ రెడ్డి ఏం చెప్పాలనుకుని ఏ కామెంట్లు చేశారో కానీ ఆ క్షణమే భారత రాష్ట్ర సమితి నాయకులకు కొన్ని నెలలకు సరిపడా ఫీడింగ్ ఇచ్చినట్లయ్యింది. బీఆర్ఎస్ కీలక నేతలు మంత్రులు కేటీరామారావు, హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ మొదలుకుని రాష్ట్ర, జిల్లా నాయకులంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ పథకానికి తిలోదకాలిస్తారంటూ వాడవాడలా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఇపుడు ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేసే పని తప్పిపోయి.. ఉచిత విద్యుత్ పథకం కొనసాగిస్తామన్న క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఉచిత విద్యుత్ పథకం క్రెడిట్ వందశాతం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందనడంలో సందేహమే లేదు. ఎల్బీ స్టేడియం వేదికగా రైతాంగానికి ఉచిత విద్యుత్ అమలు చేస్తూ ఏ క్షణంలో వైఎస్ఆర్ సంతకం చేశారో కానీ ఆ పథకాన్ని ఎవ్వరూ రద్దు చేయలేని .. కనీసం సవరించలేని పథకంగా మారింది. విద్యుత్ ట్రాన్స్‌కాంలకు నష్టాలను మూటగడుతున్నా పథకాన్ని కొనసాగించాల్సిన కంపల్షన్ ఇపుడు అధికారంలో ఎవరు వున్నా వారిపై పడుతోంది. నిజానికి ఉచిత విద్యుత్ సౌకర్యం అందరికీ వర్తింప చేయాల్సిన అవసరం లేదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు వందల ఎకరాలలో పంటలు పండించే భూస్వామ్య రైతులు కూడా ఉచిత విద్యుత్ ఫలాలను పొందుతున్నారు. నిజానికి వారందరికీ వర్తింప చేయాల్సిన అవసరం లేదు. ఎందరో టాక్స్ పేయర్లు చెల్లిస్తున్న పన్నుల రూపంలో వచ్చి పడుతున్న నిధులను ఇలా ధనిక రైతులకు కూడా వర్తింపజేయడం సమంజసం కూడా కాదు. కానీ ఉచిత విద్యుత్ పథకంలో కనీసం సవరణ చేయాలన్నా కూడా ప్రభుత్వాధినేతలు జంకాల్సిన పరిస్థితి నెలకొంది. ‘‘ఉచితాలపై సమీక్ష’’ జరగాలని సాక్షాత్తు సుప్రీం కోర్టు చెప్పినా దానికి ఆచరణలో పెట్టేందుకు ఏ ఒక్క రాజకీయ పార్టీ సాహించలేని పరిస్థితి. ఉచిత విద్యుత్ ఒక్కటే కాదు.. రకరకాల కారణాలు, వర్గాల పేరిట కోట్లాది మందికి నగదు పంపిణీ పథకం కూడా ప్రజలను సోమరులను చేసేదే. కానీ, ఓట్ల వేటలో ప్రతీ రాజకీయ పార్టీ ఉచితాలను నమ్ముకుంటోంది. మొన్నటి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఉచితాల పేరిట ఓట్ల వేట మరింత ముదిరిపోయింది. వచ్చే ఎన్నికల నాటికి ఇంకెన్ని ఉచితాలను చూడాల్సి వస్తుందోనని రకరకాల పన్నులను క్రమం తప్పకుండా కడుతున్న వేతన జీవులు, మధ్యతరగతి ఉద్యోగులు బెదిరిపోతూ చూస్తున్నారు.
ఈ అంశాన్ని పక్కన పెడితే, ఉచిత విద్యుత్ పథకం గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తాజాగా 2000లో హైదరాబాద్ బషీర్‌బాగ్ కాల్పుల అంశాన్ని ప్రస్తావించారు. ఆనాటి కాల్పులకు అంతర్గత కారకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పేందుకు యత్నించారు. నిజానికి ఆనాడు కేసీఆర్ మంత్రి పదవిని కాంక్షించి భంగపడి.. దక్కిన డిప్యూటీ స్పీకర్ పదవిని ఆస్వాదించలేని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. భవిష్యత్ రాజకీయానికి కొత్త పంథాను వెతుక్కుంటూ తెలంగాణ ఉద్యమ ప్రారంభ సన్నాహాలలో ఉన్నారు. అలాంటి అసంతృప్త నేత ఆనాడు రాజకీయ చాణక్యునిగా కొందరిచే కీర్తింపబడుతున్న నారా చంద్రబాబునాయుడుని ఏ మేరకు, ఏ మార్గంలో ప్రభావితం చేయగలడన్నది ఆలోచించాల్సిన ప్రశ్నే. 2000లో విద్యుత్ సంస్కరణలను శరవేగంగా అమలు చేస్తున్న సీఎంగా చంద్రబాబు దేశంలో అందరి దృష్టినీ ఆకర్షించారు. ఉత్తరాది రాష్ట్రాలు సంస్కరణలపై కనీసం ఆలోచన కూడా చేయని తరుణంలో చంద్రబాబు విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తూ ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్ఈబీ)ని మూడు ముక్కలు చేసి.. విద్యుత్ జనరేషన్, విద్యుత్ ట్రాన్స్‌మిషన్, విద్యుత్ డిస్ట్రిబ్యూషన్‌లను మూడు కార్పొరేషన్లుగా చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ ప్రక్రియ 1997 నుంచి 2000 దాకా కొనసాగింది.విద్యుత్ రంగాన్ని ప్రయివేటుపరం చేయడాన్ని ఆనాడు వామపక్షాలు గట్టిగా వ్యతిరేకించాయి. ప్రైవేటీకరణతో విద్యుత్ వినియోగదారులపై భారీగా భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. అనుకున్నట్లుగానే 2000లో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగాయి. దీన్ని కమ్యూనిస్టులు గట్టిగానే వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగారు. ఈ ఉద్యమంలో భాగస్వామిగా మారిన కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలను కొనసాగించింది. అదే క్రమంలో ఆగస్టు 28, 2000న చలో అసెంబ్లీకి రాజకీయ పక్షాలు పిలుపునిచ్చాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో అసెంబుల్ అయిన సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ శ్రేణులు అసెంబ్లీ వైపు ర్యాలీలుగా వస్తున్న క్రమంలో బషీర్‌‌బాగ్ ఉద్యమ కేంద్రంగా మారింది. అక్కడే కాల్పులకు తెగబడ్డాయి ఆనాటి పోలీసు బలగాలు. ఫలితంగా స్పాట్ ఇద్దరు.. ఆసుపత్రిలో మరికొందరు మరణించారు. ఈ కాల్పుల ఉదంతం చంద్రబాబు రాజకీయ చరిత్రలో మచ్చగా నిలిచింది అని చెప్పక తప్పదు. ఈ క్రమంలోనే ఆనాటి విపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం దాకా పాదయాత్ర చేశారు. తాము అధికారంలోకి వస్తు రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. ఈ ఉచిత హామీ అప్పుడప్పుడే గాడిలో పడుతున్న విద్యుత్ రంగానికి పెనుభారంగా పరిణమిస్తుందని సీఎం చంద్రబాబు సహా అధికారంలో వున్న వారంతా వాదించారు. భారమైన రైతులకోసం భరించాల్సిందేనన్న వైఎస్ఆర్ తాను ముఖ్యమంత్రి కాగానే తొలి ఫైలుగా ఉచిత విద్యుత్ పథకాన్ని ఆమోదించారు. గత 19 ఏళ్ళుగా ఉచిత విద్యుత్ స్కీంకు అలవాటు పడిపోయారు రైతులు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఈ స్కీంని రెండు తెలుగు రాష్ట్రాలు కొనసాగిస్తూనే వున్నాయి.ఇపుడు రేవంత్ రెడ్డి అయినా మరొకరు అయినా ఉచిత విద్యుత్‌లో చిన్న మార్పు కూడా చేయలేని పరిస్థితి. ఆ సంగతి రాజకీయ పార్టీలన్నింటికీ తెలుసు. కానీ అందివచ్చిన అవకాశాన్ని ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు వదులుకోడు. క్లారిటీతో ప్రకటన చేయలేకపోయిన రేవంత్ రెడ్డి.. అధికార బీఆర్ఎస్ నేతలకు చక్కని అంశాన్ని అందించారు. ఇపుడు క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అగత్యాన్ని సొంత పార్టీ నేతలకు కల్పించారు. బీఆర్ఎస్ నాయకులు ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి కామెంట్లను ఇప్పుడే వదులుకోవు. ఇంకా చెప్పాలంటే వచ్చే ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మాటల వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల స్క్రీన్స్‌పై ప్లే అవుతాయి. దీనిని తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకులకు మరేదైనా పెద్ద అంశం దొరికితే తప్ప ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్, కాంగ్రస్ నాయకుల మధ్య మాటల తూటాలు ఇప్పట్లో ఆగవనే చెప్పాలి.

Related Posts