YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నియోజకవర్గంలో 100 మందికి లక్ష సాయం

నియోజకవర్గంలో 100 మందికి లక్ష సాయం

హైదరాబాద్, జూలై 15, 
బీసీల్లో వెనుకబడిన చేతివృత్తులు, కుల వృత్తుల కుటుంబాలకు ఇవాళ్టి నుంచి రూ. లక్ష సాయం అందించనుంది సర్కార్. తొలి విడతలో భాగంగా లబ్ధిదారులను గుర్తించింది. తెలంగాణలోని బీసీ చేతి, కుల వృత్తుల వారికి రూ.లక్ష ఆర్థికసాయం పథకాన్ని తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తికాగా.... లబ్ధిదారుల ఎంపిక పై కసరత్తు పూర్తి చేసింది. తొలి విడతలో భాగంగా… ఎంపికైన లబ్ధిదారులకు ఇవాళ్టి నుంచి చెక్కులను అందజేయనుంది. ప్రతి నియోజకవర్గానికి 300 మంది చొప్పున ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,700 మందికి రూ.లక్ష సాయం అందనుంది.చెక్కులను స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇవ్వనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ స్కీమ్ ను దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంచిర్యాల వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు చెక్కులను కూడా అందజేసిన సంగతి తెలిసిందే. రూ. లక్ష సాయం కోసం రాష్ట్రవ్యాప్తంగా భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 5,28,862 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వీటిని పరిశీలించిన తర్వాత... తొలి విడతలో భాగంగా ఎవరిని ఎంపిక చేయాలనే దాన్ని నిర్ణయించారు అధికారులు. ఇందులో భాగంగా... ఇవాళ లబ్ధిదారులకు చెక్కులను అందజేస్తారు.మరికొన్ని విడతల్లో అర్హులైన వారిన ఎంపిక చేస్తారు. జూలై 18 నుంచి మిగిలిన దరఖాస్తుల పరిశీలన ప్రారంభం కానున్నది. ఇదే విషయంపై ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. విడతల వారీగా ప్రతి నెల 15వ తేదీన చెక్కులను అందజేస్తామని పేర్కొంది. ప్రతి నెల 5వ తేదీలోపు కలెక్టర్లు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపిస్తారు. ఇన్‌చార్జి మంత్రులు ధ్రువీకరించిన జాబితాలోని లబ్ధిదారులకు ప్రతి నెలా 15లోగా స్థానిక ఎమ్మెల్యేలు రూ.లక్ష ఆర్థికసాయం అందజేస్తారు. దరఖాస్తు ఫారంను ఏ ఆఫీసులోనూ, ఏ అధికారికి అందజేయాల్సిన అవసరం లేదు. లబ్ధిదారులు నెలరోజుల్లోగా తమకు నచ్చిన, కావాల్సిన పనిముట్లను, సామగ్రిని కొనుకోవాలని…. ఆ నిర్ణయాధికారం పూర్తిగా లబ్ధిదారులదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంకొనుగోలు చేసిన యూనిట్ల ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
స్కీమ్ మార్గదర్శకాలు…
- లక్ష రూపాయ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారులు అర్హులు అవుతారు.
-కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వృత్తుల అభ్యున్నతికి ఆర్థిక సాయం అందిస్తారు.
- ఆయా కులాల పనిముట్ల కొనుగోలు, ఆధునీకరణ లేదా ముడిసరుకు కొనుగోలుకు మాత్రమే ఆర్థిక సాయం అందిస్తారు.
- దరఖాస్తుదారుల వయస్సు జూన్‌ 2 నాటికి 18 -55 ఏళ్లు ఉండాలి.
- వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.
-దరఖాస్తు తేదీ నుంచి గత 5 ఏండ్లలో ఏ ప్రభుత్వ శాఖ ద్వారా కూడా లబ్ధిపొందినవారు అర్హులు కారు.
ఇక 2017-18లో రూ.50 వేల ఆర్థిక సాయం పొందిన వారు ఈ స్కీమ్ కు అనర్హులు అవుతారు.
- జూన్‌ 20 తేదీ వరకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. రేషన్‌కార్డు, కుల, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో కూడిన దరఖాస్తులను స్వీకరించారు.

Related Posts