ముంబై, జూలై 15,
సుదీర్ఘ చర్చల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇప్పుడు భారతదేశంలో తన కార్లను తయారు చేసేందుకు సిద్ధం అయింది. కథనం ప్రకారం ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారతదేశంలో తన తయారీ యూనిట్లను ఏర్పాటు చేసి విక్రయించేందుకు ప్రాథమిక ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించింది.ఏడాదికి ఐదు లక్షల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో గిగాఫ్యాక్టరీని నిర్మించాలని టెస్లా పరిశీలిస్తుంది. టెస్లా తన ఎలక్ట్రిక్ వాహనాల బలమైన శ్రేణిని భారతదేశంలో పెద్ద ఎత్తున ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాని కోసం బలమైన మౌలిక సదుపాయాలను కూడా కలిగి ఉంది. అలాగే కంపెనీ తన ఎలక్ట్రిక్ కారును తక్కువ ధరలోనే భారతదేశంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ కారు గురించి ఎలాంటి సమాచారం రాలేదు.టెస్లా భారతదేశానికి రావడంలో విజయవంతమైతే మారుతి, హ్యుందాయ్ తర్వాత భారతదేశంలో మూడో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా ఆవిర్భవించవచ్చు. ప్రభుత్వం, టెస్లా అధికారులు భారతదేశంలో టెస్లా ప్లాన్లు, గిగాఫ్యాక్టరీకి సరైన స్థలాన్ని కనుగొనడం కోసం చర్చిస్తూనే ఉన్నారు.ఇది కాకుండా టెస్లాకు సాయం చేయడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ రెండో దశను అమలు చేయడాన్ని ప్రభుత్వం పరిగణించవచ్చు. ఫేమ్ 2 పథకం 2024 మార్చిలో ముగియనున్నందున, ఫేమ్ 3 పథకంతో ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ఇప్పటికే పరిశ్రమతో చర్చలు జరుపుతోంది. భారతదేశంలో టెస్లా గురించిన వార్తలు మొదటిసారిగా 2021 చివరలో తెరపైకి వచ్చాయి. అప్పటి నుంచి టెస్లా మనదేశంలో వార్తల్లో ఉంటూనే ఉంది.