YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మూడు రాజధానుల కథ కంచికేనా

మూడు రాజధానుల కథ కంచికేనా

విజయవాడ, జూలై 15 , 
ఇక మూడు రాజధానుల ముచ్చట మూలకు చేరినట్లేనా..?  ఈ ప్రభుత్వ కాలపరిమితి ముగిసేలోగా జరిగే పనైతే కాదు. రాజధాని కేసును డిసెంబర్ కు వాయిదా వేయడంతో ఈ విషయం రూఢీ అయిపోయింది. రాష్ట్రానికి సంబంధించి చాలా కీలకమైన ఆ పరిణామం అతి మామూలుగా ముగిసింది. సుప్రీంకోర్టులో రోజూ జరిగే వేలాది కేసుల్లో ఒకటిలాగా దాన్ని వాయిదా వేశారు. ఇందులో పార్టీలైన రాష్ట్ర ప్రభుత్వం కానీ.. దాని అపోనెంట్స్ కానీ ఎవరూ కూడా పెద్దగా స్పందించలేదు. ఊహించిందే లే అన్నట్లుగా కథ ముగిసింది. బహుశా రెండు పార్టీలూ కోరుకుంది ఇదే అనుకుంటా..!
2015 లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించి నోటిఫై చేసింది. ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమిని సేకరించి పనులు మొదలుపెట్టింది. ఈ లోగా ప్రభుత్వం మారిపోయింది. రాజధానిపై కొత్త ప్రభుత్వం తీరూ మారింది. మూడేళ్ల కిందట మూడు రాజధానుల ప్రస్తావనతో అగ్గి రాజేసింది.. జగన్ ప్రభుత్వం. ప్రతిపక్షంలో ఉంటూ రాజధానిగా విజయవాడ ప్రాంతానికి మద్దతిచ్చి.. అంతకు ముందు ఎన్నికల సభల్లో రాజధాని ఎలా ఉండాలో ఎంతుండాలో సెలవిచ్చిన జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చాక మూడురాజధానుల రాగం అందుకున్నారు. 'అధికార వికేంద్రీకరణ' పేరుతో మూడు రాజధానులు చేస్తున్నామని ప్రభుత్వం 2020లో అసెంబ్లీలో ప్రకటించింది. అప్పటికే ఉన్న సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ.. అమరావతి, విశాఖ, కర్నూలు కేంద్రాలుగా  అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామని మరో బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. అధికార వికేంద్రీకరణ చట్టంపై తమ మాట నెగ్గడం లేదని అప్పట్లో శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం కూడా చేశారు. తిరుగులేని మెజార్జీ ఉన్న తమకు జరగంది లేదని.. అనుకుంటే రాజధాని మారిపోవాలన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించింది. కానీ ఇది ఎంత సంక్లిష్టమో తర్వాత తెలిసొచ్చింది. ఈ మధ్య కాలంలో  మండలి రద్దు విషయాన్ని పక్కన పెట్టడం.. ఆ రెండు చట్టాలను మళ్లీ వెనక్కు తీసుకోవడం.. మూడు రాజధానులు విషయంలోనూ అనేక పిల్లిమెగ్గలు వేయడం కూడా జరిగాయి. ముందు మూడు రాజధానులు అని.. ఆ తర్వాత విశాఖనే ఏకైక రాజధాని అని చేప్పారు. త్వరలోనే విశాఖకు అని ప్రకటనలు తరచుగా వచ్చేశాయి. సుప్రీం కోర్టులో కేసు ఉండగానే.. నేడో రేపో విశాఖకు అన్నట్లుగా మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకూ ప్రతి ఒక్కరూ ప్రకటించేవారు. తాజాగా రాజధాని షిఫ్టింగ్ డెడ్ లైన్ సెప్టెంబర్. ఇప్పటికే అనేక సార్లు ఇది వాయిదా పడినందున ఈసారైనా జరుగుతుందో లేదో తెలీదు. ఈ విషయాన్ని పక్కన పెడితే మూడు రాజధానులు అనే ప్రతిపాదన ఎలా డైల్యూట్ అవుతూ వచ్చిందో చూద్దాం.ముందు మూడు రాజధానులు అన్నారు. ఆ తర్వాత దానిని క్రమక్రమంగా ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తూ వచ్చింది. ఫైనల్ గా విశాఖనే ఫిక్స్ అనే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వం మూడు రాజధానుల నుంచి వెనక్కు మళ్లడం వెనుక అనేక న్యాయపరమైన , చట్టపరమైన చిక్కులున్నట్లు ఈ మూడేళ్లలో ప్రభుత్వ పెద్దలకు బాగానే అర్థం అయింది. ప్రభుత్వం చెబుతున్న తరహాలో న్యాయ రాజధాని అంటే హైకోర్టు బెంచ్ లేదా పూర్తి కోర్టు ఏర్పాటు చేయాలన్నా సుప్రీంకోర్టు అనుమతి ఉండాలి. ఒకసారి రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇచ్చాక అది తిరుగులేని శాసనం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలోనే అని నోటిఫై చేశారు. దానిని మార్చడం అంత సులభం కాదు అని కూడా గుర్తించకుండా.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని.. అదేదో రాష్ట్ర ప్రభుత్వం చేతులో ఉన్నట్లుగా జగన్ ప్రకటన చేశారు. అదెంత క్లిష్టమైన విషయం అంటే.. అమరావతిపై హైకోర్టులో విచారణ సందర్భంగా హైకోర్టును అమరావతిలో ఉంచుతున్నట్లుగా ప్రభుత్వం అఫిడవిట్ లో ప్రస్తావించాల్సి వచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు బిల్లులు మండలిలో ఆమోదం పొందకపోవడంతో దానికి వాలిడిటీ ఉందో లేదో తెలీక ముందే.. ఈ బిల్లులను వెనక్కు తీసుకున్నారు. ఈలోగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రెండు బిల్లులను కొట్టేసి.. అమరావతిని అభివృద్ధి చేయాలని స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వం కేసను సుప్రీంకోర్టుకు తీసుకెళ్లింది. మొదట్లో రాజధాని విషయంలో పూర్తి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం .. తర్వాత తన వాదన మార్చుకుంది. రాజధాని విషయమై ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5, 6 ని ప్రస్తావించింది. శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. . అమరావతి నిర్మాణానికి తాము నిధులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ.. పార్టీ పరంగా తమ మద్దతు అమరావతికే అని స్పష్టంగా ప్రకటించింది. అసలు పునర్వ్యవస్థీకరణ చట్టంలో మూడు రాజధానులు అనే ప్రస్తావన లేదని.. ఏ కేపిటల్ అనే పదబంధం మాత్రమే ఉన్నందున రాజధాని అంటే కేవలం ఒకటే అవుతుందన్న వాదన కూడా ఉంది.ఇవన్నీ గుర్తించిన తర్వాతే .. ప్రభుత్వం కూడా న్యాయ రాజధాని ఊసెత్తడం మానేసి.. విశాఖనే రాజధాని అని చెప్పడం మొదలుపెట్టింది. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన మూడు రాజాధానులు అన్నది “మిస్ కమ్యూనికేషన్” అన్నట్లుగా తేల్చేశారు.  ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా విశాఖనే కేపిటల్ అన్నట్లుగా మాట్లాడుతున్నారు కానీ మూడు రాజధానులు అన్న మాటను మచ్చుకైనా తేవడం లేదు. ఇవన్నీ ఇలా ఉన్నా కూడా విశాఖకు షిఫ్ట్ అయిపోయి.. తాము అనుకున్నది సాధించామని చెప్పడానికి ప్రభుత్వం చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. కానీ అది కూడా జరగడం లేదు. విశాఖ ముహూర్తం ఇప్పటికే మూడు సార్లు వాయాదా పడింది. ఇంగ్లీషు సంవత్సరం, తెలుగు సంవత్సరాలు కూడా మారిపోయాయి. తాజా ప్రకటన ప్రకారం సెప్టెంబరుకు షిఫ్టింగు. కానీ రుషికొండలో నిర్మాణాలు పూర్తి కాకుండా అక్కడకు వెళ్లే పరిస్థితి లేదు. మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న అమరావతి రైతులు ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని లేకపోతే యథాతథ స్థితిని కొనసాగించాలని కోరుతున్నారు. కోర్టు కేసులు.. ఇతర వ్యవహారాలతో మూడేళ్లు కాలహరణం జరగడంతో సుప్రీంకోర్టులో కేసులో జాప్యం జరిగితే.. తర్వాత ప్రభుత్వం మారి తమకు న్యాయం జరుగుతుందన్నది అమరావతి మద్దతుదారుల ఆకాంక్ష. అయితే మొదట్లో ఈ విషయంలో దూకుడుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా తన తీరు మార్చుకుంది. అమరావతి కేసు హైకోర్టు, సుప్రీంకోర్టులో వెకేషన్ బెంచ్‌ కు వెళ్లినప్పుడు.. ప్రభుత్వం వాదనలు చూస్తే.. అలాగే అనిపించింది. అప్పట్లో ప్రభుత్వ లాయర్లే.. తమకు సమయం కావాలని.. రెండు మూడు నెలలు వాయిదా వేయమని కోరారు. తాజాగా సుప్రీంకోర్టు నిర్ణయంపై వీళ్ల స్పందన చూస్తే.. అంతా కోరుకున్నది ఇదేనా అనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ- మూడు రాజధానుల అంశాన్ని రాజకీయ అజెండాగా సెట్ చేసేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఇదే పాయింట్ తో ఎన్నికలకు వెళ్లాలన్నది ఆయన ఎలాగో కాలహరణం జరిగింది కాబట్టి.. ఇంకొన్నాళ్లు గడిపి ఎలక్షన్ అజెండాగా సెట్ చేయనున్నారు. కానీ ఇది వైసీపీకి ఎంతవరకో ఉపయోగపడుతుందో చూడాలి. ఎందుకంటే.. రాజధాని ఇస్తామన్నా విశాఖలో అంత సానుకూలత రాలేదు. మొన్న జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. పైగా అక్కడ ప్రజలు రాజధానిని వ్యతిరేకించకపోయినా.. తమకు రాజధాని కావాలనే బలమైన ఆకాంక్షను వ్యక్తపరచడం లేదు. ఇక రాయలసీమలో రాజధాని కావాలన్న ఆకాంక్ష తీవ్రంగా ఉన్నా.. వాళ్లకి ప్రామిస్ చేసిన న్యాయ రాజధాని అంత ఈజీగా వచ్చే పరిస్థితి లేదు. దీనిపై రాయలసీమ ప్రాంత వాసుల్లో అసంతృప్తి ఉంది. ఆచరణ సాధ్యం కానీ.. అంతగా ఉపయోగం లేని హైకోర్టు హామీతో తమను ఏమార్చారని సీమ వాసులు కూడా భావిస్తున్నారు. రాజధాని విషయంలో రాజకీయం చేసింది తప్ప.. న్యాయపరంగా కూడా సరిగ్గా పోరాడలేదని సీమ మేధావులు అంటున్నారు. రాజధాని మార్పు.. మూడు రాజధానుల ఏర్పాటు అనే నిర్ణయం రాజకీయంగా తీసుకోకుండా ఓ కమిటీ వేసి చేసి ఉంటే.. న్యాయస్థానాల్లో మన్నన దక్కేదన్న వాదన ఉంది. ఇక రాజధాని రైతుల భూములను ప్రభుత్వం తీసుకున్నందున వారికి పరిహారం విషయంలో ఉన్న చట్టబద్ధత విషయంలోకానీ.. , శివరామకృష్ణన్ కమిటీ ఈ ప్రాంతాన్ని రాజధానిగా వద్దు అనిచెప్పిన విషయాన్ని బలంగా తీసుకెళ్లే విషయంలో కానీ ప్రభుత్వం విఫలమైందని వారంటున్నారు. అసలు మూడు రాజధానులు అన్న కాన్సెప్టే ఇంత వరకూ ఎక్కడా లేదు. సౌతాఫ్రికాలో ఒక్కచోట పెట్టి వెనక్కు వెళ్లారు. ఇప్పటికే రాజధాని విషయాన్ని గందరగోళం చేసి.. రాష్ట్రానికి రాజధాని ఇదీ అని చెప్పుకునే అవకాశం లేకుండా చేశారని వైసీపీ ప్రభుత్వంపై ఓ అసంతృప్తి ఉంది. అసలు మూడు రాజధానులు అన్న కొత్త.. వింత కాన్సెప్ట్ట్ను ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారన్న అనుమానాలూ ఉన్నాయి. ఎందుకంటే.. రాజధాని అనే దానిపై అన్ని ప్రాంత ప్రజలకు భావోద్వేగపూరిత సంబంధాలుంటాయి. దానితో ఆటలంటే అగ్గితో చెలగాటమే మరి. మరి వైసీపీ దీనిని ఎలా డీల్ చేస్తుందో చూడాలి.

Related Posts