విజయవాడ, జూలై 17,
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే.. టక్కున సమాధానం చెప్పే పరిస్థితి లేదు. చట్టప్రకారమైతే.. ప్రస్తుతానికి అమరావతే రాజధాని. కానీ వైసీపీ ప్రభుత్వం.. 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చాక.. రాజధాని ఏది అనే ప్రశ్నకు కచ్చితమైన ఆన్సర్ లేని పరిస్థితి ఉంది. 3 రాజధానులకు మొగ్గు చూపిన ప్రభుత్వం.. పోనీ ఆ దిశగా అడుగులు వేసిందా అంటే అదీ లేదు. అందుకు న్యాయపరమైన అడ్డంకులు సవాలు విసరడంతో.. ఆ చిక్కులను సరిదిద్దుతూ ఉండగానే... నాలుగేళ్లు అయిపోయాయి. ఇప్పుడు ఎన్నికల ఏడాది వచ్చేసింది. ప్రజలంతా ఆ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో.. మళ్లీ రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారు ఓ నేత.టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కొన్ని ఆసక్తికర కామెంట్స్ తాజాగా చేశారు. త్వరలోనే విశాఖకు సీఎం క్యాంప్ ఆఫీస్ తరలిపోతుంది అని తెలిపారు. న్యాయపరమైన అడ్డంకుల వల్ల.. ఇప్పటివరకూ ఇది ఆలస్యం అయ్యిందని అన్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో సీఎం జగన్ విశాఖకు వెళ్లిపోయి.. అక్కడి నుంచే పరిపాలన సాగిస్తారు అని ఆయన చెప్పారు. దాంతో.. మళ్లీ 3 రాజధానుల అంశం తెరపైకి వచ్చినట్లైంది.సీఎం జగన్ తలచుకుంటే.. విశాఖకు వెళ్లి పరిపాలన సాగించడం పెద్ద మ్యాటరేమీ కాదు. ఐతే.. కోర్టుల్లో ఉన్న సమస్యలకు ఆన్సర్ దొరకాలి. అలా జరగకముందే విశాఖకు వెళ్తే.. తీరా కోర్టు తీర్పు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వస్తే.. అది ప్రభుత్వానికి మరో సమస్య అవుతుంది. అందువల్ల న్యాయపరమైన చిక్కుల్ని సెటిల్ చేసుకున్నాకే వెళ్లడం బెటరనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.విశాఖకు వెళ్లకుండా తాడేపల్లి నుంచే పనులు కానిస్తే.. వైసీపీ ప్రభుత్వానికి మరో రకమైన సమస్య వస్తుంది. మూడు రాజధానులపై ప్రభుత్వం ఏమీ చెయ్యలేకపోయిందని విపక్షాలు విమర్శించే ప్రమాదం ఉంది. అందువల్ల ఎన్నికలు వచ్చేలోపు.. ఎలాగైనా విశాఖ నుంచి పాలన సాగిస్తే.. పంతం నెగ్గించుకున్నట్లు అవుతుందనే వాదనను కొందరు పార్టీలో వినిపిస్తున్నారు. మరి సీఎం జగన్ ఏం చేస్తారన్నది ఆసక్తికరం.టైమ్ ప్రకారం ఎన్నికలు జరిగేటట్లైతే.. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో జరుగుతాయి. ఐతే.. సాధారణంగా ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచీ.. ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టవు. ఆ ప్రకారం చూస్తే.. అక్టోబర్ లోపే ప్రభుత్వం మూడు రాజధానులపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం కూడా ఉంది. అదే నిజమైతే.. విశాఖకు షిఫ్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు మళ్లీ ఈ అంశం హాట్ టాపిక్ అయ్యింది.