బెంగళూరు, జూలై 17,
అసలే పోటాపోటీగా అధికార, ప్రతిపక్ష కూటములు సమావేశాలు ఏర్పాటు చేశాయి. ఎవరికి వారుగా తమ బలాన్ని, ఐక్యతను చాటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కూటమిలో ముఖ్య నేత ఎవరైనా హాజరుకాలేదంటే.. కారణమేదైనా సరే ఎన్నో అర్థాలు, అపార్థాలు, ఊహాగానాలు మొదలవుతాయి. సాకులు చూపి సమావేశానికి డుమ్మా కొట్టారని ఎద్దేవా కూడా చేస్తారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితే ప్రతిపక్ష కూటమికి ఎదురైంది.కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల ఐక్యవేదిక సమావేశానికి మమత బెనర్జీ హాజరు కాలేనని తెలియజేశారు. కాలికి తగిలిన గాయం కారణంగానే తాను హాజరుకాలేకపోతున్నానని, అయితే తన తరఫున ప్రతినిధిని సమావేశానికి పంపిస్తానని చెప్పారు. ఈసారి సమావేశం నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్, మమత బెనర్జీ ఇచ్చిన సమాచారంతో నిరుత్సాహానికి గురైంది. ఆమె గైర్హాజరుపై జరిగే ప్రచారం, పర్యవసానాలను ఊహించింది. ఎలాగైనా సరే మమతను సమావేశానికి రప్పించాలని భావించింది. అంతే ఏకంగా సోనియా గాంధీయే రంగంలోకి దిగారు. నేరుగా మమతకు ఫోన్ చేశారు. ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకు అధికారపక్షం చేస్తున్న కుట్రలు, తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చోటు చేసుకున్న పరిణామాలు ఉదహరిస్తూ వీలైనంత వరకు హాజరుకావడానికే ప్రయత్నించాలని కోరారు. ఈసారి సమావేశానికి తాను కూడా హాజరవుతానని చెప్పినట్టు తెలిసింది. సోనియా గాంధీయే స్వయంగా ఫోన్ చేసినందున మమత బెనర్జీ కూడా మనసు మార్చుకున్నారని సమాచారం.బెంగళూరులో జరిగే విపక్షాల సమావేశంలో ఈసారి మొత్తం 24 పార్టీలు పాల్గొంటున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జూన్‌లో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాట్నాలో ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల తొలి సమావేశానికి 15 పార్టీల నేతలు మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ముఖ్య నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈసారి కాంగ్రెస్ పార్టీయే సమావేశాన్ని నిర్వహిస్తున్నందున ఈ ఇద్దరు నేతలతో పాటు సోనియా గాంధీ కూడా హాజరవుతారని తెలుస్తోంది. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పాల్గొననుంది. అయితే ఢిల్లీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ విషయంలో ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య వాగ్వాదం నెలకొంది. ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో ఆమోదించకుండా అడ్డుకోవాలంటే కాంగ్రెస్ వ్యతిరేకించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తోంది. దీనిపై ప్రతిపక్షాల్లో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు.బెంగళూరు సమావేశంలో ప్రతిపక్షాలకు సంబంధించి ఉమ్మడి ఎజెండాపై చర్చించనున్నారు. దీంతోపాటు మూడు కార్యవర్గాల ఏర్పాటుపై కూడా సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తుకు సంబంధించిన పూర్తి రూపురేఖలను సిద్ధం చేయడమే కార్యవర్గం పని. ఎన్నికల్లో పోటీ చేసే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థులపై ఎవరిని నిలబెట్టాలి… గెలుపు కోసం ఎలాంటి వ్యూహం అనుసరించాలనేది కార్యవర్గం నిర్ణయిస్తుంది. దేశవ్యాప్తంగా 450 నియోజకవర్గాల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని ఇదివరకటి సమావేశంలోనే నిర్ణయించుకున్నాయి. అయితే ఇదంత ఆషామాషీ వ్యవహారం కాదు. పైకి ఒక వేదికపై చేతులు కలిపి ఐక్యతను చాటే ప్రయత్నం చేస్తున్న ఈ పార్టీలు, వివిధ రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయి. పైగా ఉమ్మడి అభ్యర్థి అనేసరికి ఆయా పార్టీల్లో టికెట్ ఆశించే అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వారిలో సొంత బలం ఉన్న నేతలు తిరుగుబాటు అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఆయా పార్టీలు అసంతృప్త నేతలను బుజ్జగించినా.. వారు ఎన్నికల్లో సహకరించే అవకాశాలు తగ్గిపోతాయి. ఈ పరిస్థితులను డీల్ చేయడం కోసమే ప్రతిపక్షాలు కార్యవర్గాలను రూపొందించుకోవాలని భావిస్తున్నాయి.