న్యూఢిల్లీ, జూలై 18,
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్రాల నాయకత్వం విషయంలో సందిగ్ధతను ఎదుర్కొంటోంది. జాతీయస్థాయిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా రూపంలో ఆ పార్టీకి బలమైన, తిరుగులేని ఆదరణ కల్గిన నాయకత్వం ఉన్నప్పటికీ, రాష్ట్రాల్లో నాయకత్వం ఆదరణ కోల్పోయి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. పార్టీకి బలం అనుకున్న నేతలే బరువుగా మారిన పరిస్థితులు నెలకొన్నాయి. అలాగని ఆ నేతలను పూర్తిగా కాదనలేక, అవుననలేక అధిష్టానం ఇరకాటంలో పడింది. ముఖ్యంగా కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోబోతున్న చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్, మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్, రాజస్థాన్‌లో వసుంధరా రాజే నేతృత్వంలో ఎన్నికలను ఎదుర్కోడానికి పార్టీ అధిష్టానం మొగ్గుచూపడం లేదు. అలాగని ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అప్పటికప్పుడు తయారుచేయడం సాధ్యం కాదని అధిష్టానానికి తెలుసు. అయితే ఎప్పటికైనా ప్రత్యామ్నాయం అవసరమే అన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ల రూపంలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రజలకు పరిచయం చేస్తోంది. ఇప్పటికే కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఓటమిని చవిచూసిన పార్టీ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తోంది.మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత సుదీర్ఘకాలం చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్ సింగ్ భవితవ్యం ప్రస్తుతం ప్రశ్నార్థకంలో పడింది. 2003 నుంచి 2018 వరకు వరుసగా మూడు పర్యాయాలు పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న ఆయన ప్రాభవం 2018లో ఓడిపోయినప్పటి నుంచి ఒక్కసారిగా పతనమవుతూ వచ్చింది. పరాజయం తర్వాత రాజకీయాల్లో పెద్దగా క్రియాశీలంగా కనిపించకపోయినా సరే.. ఇప్పటికీ ఆ రాష్ట్రంలో బీజేపీకి ఆయనే పెద్ద దిక్కు. రమణ్ సింగ్ పాపులారిటీ, జనబాహుళ్యంలో ఉన్న ఆదరణను చూసి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకే మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అవకాశం ఇస్తారని పార్టీ శ్రేణులు భావించాయి. కానీ ఆ రాష్ట్ర ఇంచార్జిగా పనిచేసిన పురందేశ్వరి రాష్ట్ర పార్టీలో ప్రత్యామ్నాయ నాయకత్వం అవసరం గురించి, అవకాశాల గురించి చాలా వివరంగా చెప్పారు. రాబోయే ఎన్నికల్లో అభివృద్ధే ప్రధానాంశంగా మారాలని సూచించారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో రమణ్ సింగ్ కుమారుడు అభిషేక్ సింగ్‌కు టిక్కెట్ ఇవ్వకుండా పార్టీ తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. మరోవైపు రమణ్‌సింగ్‌కు సొంత పార్టీలో ప్రత్యర్థిగా మారిన రాజ్‌సభ ఎంపీ సరోజ్ పాండేతో పాటు రమణ్‌సింగ్ మద్దతుదారులకు సైతం టిక్కెట్లను తగ్గించింది. అప్పటి నుంచే రమణ్ సింగ్‌కు ప్రత్యామ్నాయ శక్తి కోసం అధిష్టానం గాలిస్తోందన్న సంకేతాలు పార్టీలో విస్తృతంగా వెళ్లాయి. రమణ్ సింగ్ మద్దతుదారులు ఇప్పటికీ రాష్ట్ర పార్టీలో బలమైన పట్టు కలిగి ఉన్నారు. కానీ పార్టీ అధిష్టానం ఆలోచనలు మాత్రం రమణ్ సింగ్‌కు వ్యతిరేక దిశలో సాగుతున్నాయి.గత కొన్ని దశాబ్దాలుగా ప్రతి ఐదేళ్లకు అధికార మార్పిడి జరుగుతున్న రాజస్థాన్ రాష్ట్రంలో వసుంధర రాజే సింధియా బీజేపీ జాతీయ నాయకత్వానికి ఎప్పటికప్పుడు సవాల్ విసురుతూనే ఉన్నారు. కర్ణాటకలో యెడ్యూరప్ప లేని బీజేపీ ఎలాగో, రాజస్థాన్‌లో వసుంధర రాజే లేని బీజేపీ కూడా అలాగే అన్నట్టుగా ఉంది. ఆమెను కాదంటే జరిగే నష్టం కూడా జాతీయ నాయకత్వానికి తెలుసు. అలాగని ఆమెనే కొనసాగించడానికి ఇష్టపడడం లేదు. మధ్యప్రదేశ్ తరహాలో 2020లో రాజస్థాన్‌లో కూడా కమలదళం ఆపరేషన్ లోటస్ చేపట్టింది. అయితే అశోక్ గెహ్లాట్ ఈ ప్రయత్నాలకు చెక్ పెట్టి కమలనాథుల ప్రయత్నాలు బెడిసికొట్టేలా చేయగలిగాడు. గెహ్లాట్‌కు వసుంధరా రాజే సహకరించడం వల్లనే బీజేపీ ఆపరేషన్ విఫలమైందని అధినాయకత్వం అనుమానిస్తోంది. వసుంధర రాజే, అశోక్ గెహ్లాట్ మధ్య స్నేహ బంధం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. అధికార మార్పిడి అనంతరం ఒకరి తప్పిదాలను మరొకరు ఎత్తిచూపకుండా, ప్రశ్నించకుండా లోపాయకారి అవగాహన ఉందని చెప్పుకుంటారు. అందుకే వసుంధర హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై గెహ్లాట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఇదే కారణంగా చూపుతూ సచిన్ పైలట్ సొంత ప్రభుత్వంపైనే తిరుగుబావుటా ఎగరేశారు.వసుంధరకు ప్రత్యామ్నాయం కోసం బీజేపీ జాతీయ నాయకత్వం నిరంతరం వెతుకుతూనే ఉంది. కానీ కొత్త నాయకత్వం బలాన్ని పూర్తిగా విశ్వసించలేకపోతోంది. వసుంధర రాజేకు బద్ధ వ్యతిరేకులుగా చెప్పుకునే ఇద్దరు నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా అవకాశం కల్పించింది. కానీ వసుంధర రాజేను పూర్తిగా పక్కన పెట్టడం మాత్రం పార్టీకి సాధ్యం కాలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వసుంధర రాజేను పూర్తిగా పక్కన పెట్టేంత రిస్క్ తీసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. కానీ వసుంధర కూడా రాజేయే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పడం మానుకుంది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన జాతీయ అధ్యక్షుడి పర్యటన సందర్భంగా వసుంధర వచ్చే ఎన్నికల్లో తన పాత్ర ఏంటని నిలదీసినట్టు సమాచారం.చత్తీస్‌గఢ్ రమణ్ సింగ్, రాజస్థాన్ వసుంధరా రాజేతో పోల్చితే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అంత పెద్దగా వ్యతిరేకత లేనప్పటికీ ఆ రాష్ట్రంలోనూ ప్రత్యామ్నాయ నాయకత్వంపై అధిష్టానం దృష్టి సారించింది. 18 ఏళ్లుగా శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ప్రభుత్వం కొనసాగుతూ వస్తోంది. 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకే ఓట్ల శాతం ఎక్కువగా వచ్చినా సీట్లు మాత్రం కాంగ్రెస్ కంటే తక్కువ వచ్చాయి. ఫలితంగా కమల్‌నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తర్వాత జ్యోతిరాదిత్య సింధియా రూపంలో తిరుగుబాటు జరిగి, పార్టీని చీల్చడంతో మళ్లీ శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఆ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు పార్టీ ప్రాధాన్యతనిస్తోంది. ఆయన్ను ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన గతంలో పార్టీకి రాష్ట్ర విభాగానికి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. పరోక్షంగా ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగని శివరాజ్ సింగ్ చౌహాన్‌ను దూరం పెడితే పరిణామాలు మరోలా ఉంటాయని కూడా పార్టీకి తెలుసు. ఆయన్ను జాతీయ నాయకత్వంలోకి తీసుకొచ్చి, రాష్ట్ర నాయకత్వాన్ని తోమర్‌కు అప్పగించవచ్చన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఈ మూడు రాష్ట్రాలతో పాటు ఇంకా అనేక రాష్ట్రాల్లో బీజేపీ ప్రత్యామ్నాయ నాయకత్వంపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. పార్టీని ఏ ఒక్కరి చేతిలోనో పెట్టకుండా బహుముఖ నాయకత్వాన్ని ప్రజల ముందు ఉంచుతోంది.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ అంతా తామే అన్నట్టుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కానీ స్థానికంగా రాష్ట్ర నాయకత్వం బలంగా లేకపోవడంతో ప్రజలు బీజేపీని తిరస్కరించి స్థానికంగా బలంగా ఉన్న కాంగ్రెస్ నాయకత్వానికి ఓటేశారు. కర్ణాటకలో మాత్రమే కాదు అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికంగా బలంగా ఉన్న రాజకీయ పార్టీలను ఓడించడం బీజేపీకి సాధ్యం కాలేదు. కర్ణాటక, బెంగాల్, ఒడిశా, బీహార్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌తో సహా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ మరియు ఢిల్లీలలో ప్రధాని తరచుగా పర్యటించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. బీజేపీ స్థానిక నాయకత్వం ప్రతిపక్ష నాయకుల కంటే బలంగా ఉన్నప్పుడే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించగల్గుతోంది. కర్నాటకలో బీజేపీకి బలమైన నాయకత్వాన్ని అందించిన యడ్యూరప్పను పక్కనపెట్టి బస్వరాజ్ బొమ్మైకి పగ్గాలు అప్పగించి చేసిన ప్రయోగం విజయవంతం కాలేదు. అదే సమయంలో హిమాచల్, పంజాబ్, ఢిల్లీ, బెంగాల్‌లలో ప్రత్యర్థులను ఢీకొట్టగలిగే బలమైన స్థానిక నాయకత్వాన్ని బీజేపీ తయారు చేయలేకపోయింది. ఉత్తరాఖండ్, గుజరాత్‌లలో బీజేపీ ఘన విజయాలు సాధించింది. ఇక్కడ ప్రధాని మోడీకి ఉన్న ఆదరణకు తోడు స్థానిక నాయకత్వం కూడా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడం వల్లనే విజయం సాధ్యపడింది. కర్ణాటక ఉదంతాన్ని పరిగణలోకి తీసుకుంటే బలమైన నాయకత్వాన్ని తప్పిస్తే పరిణామాలు వ్యతిరేకంగా మారతాయి. అలాగని బలమైన నేతలే బరువుగా మారినప్పుడు కొనసాగించడం అవివేకం. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాల్లో బలమైన నాయకత్వాన్ని కాదనకుండా ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది.