YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బీజేపీలో దగ్గుబాటి మార్క్...

బీజేపీలో దగ్గుబాటి మార్క్...

విజయవాడ, జూలై 19, 
న్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే అధ్యక్షుల మార్పు జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో సోము వీర్రాజు, తెలంగాణలో బండి సంజయిలను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన బీజేపీ హైకమాండ్.. ఏపీలో దగ్గుపాటి పురందేశ్వరిని నియమించింది. అలాగే బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నియామకం తర్వాత తనదైన శైలిలో స్పీడ్ పెంచారు. పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో బాపట్ల నియోజకవర్గం నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె 2009లో విశాఖ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికై యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో వాణిజ్యం, ప‌రిశ్ర‌మ‌ల, మానవ వనరుల అభివృద్ధి శాఖ స‌హాయ‌మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన పురందేశ్వరి.. తక్కువ సమయంలోనే దూకుడు పెంచారు. వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. మద్యం అక్రమ రవాణా, మద్యం అమ్మకాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోందని దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. ఇళ్లకు వైసీపీ రంగులు వేయడంపై ఉన్న శ్రద్ధ.. ఇళ్ల నిర్మాణంపై లేదంటూ ఎద్దేవా చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు దారిమళ్లింపు చేస్తున్నారని పురందేశ్వరి ద్వజమెత్తారు. జగన్ సర్కార్ ఏపీ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని విమర్శించారు.బీజేపీ, టీడీపీల మధ్యే సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి బలపడేందుకు, పార్టీ చేపట్టే కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెల్లాలని సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా పనిచేసే నేతలను ఎంపిక చేసి రాబోయే రోజుల్లో ప్రత్యేకమైన కార్యక్రమాల్లో వారికి బాధ్యతలు అప్పగించాలని బిజేపి పార్టీ నిర్ణయించింది. బిజేపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు సమయంలో బీజేపీకి అనుకున్నంత ఊపు లేదు. పురంధేశ్వరి నియామకం తర్వాత పార్టీకి హైపు వస్తోందా? మాజీముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల కమిటీ చైర్మన్ గా నియమించిన తర్వాత బీజేపీలో ఎటువంటి మార్పులు జరుగుతాయే చూడాలి. కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ అనుభవం పార్టీకి కొత్త వైభవం తెస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్ర కమిటీల్లో మార్పులు చేర్పులతోపాటు సంస్థాగత అంశాలపై దగ్గుబాటి పురంధేశ్వరి ఫోకస్ పెట్టారు. తనపై గురుతర బాధ్యతలు ఉన్నాయని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి వల్లే సాధ్యం కాదన్న ఆమె ప్రతీ కార్యకర్త సహకారం అవసరం అని చెప్పుకొచ్చారు. క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజలకు చేరువ చేసేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ముందు కసరత్తు చేయాలని అధినాయకత్వం సూచించిందని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో అన్ని స్థాయిల్లోని కమిటీలను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. పార్టీ కమిటీలలో మార్పులు చేర్పులు చేసి ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. అయితే గత బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులు కమిటీల నియామకాల్లో విభేదాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా చిన్నమ్మ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేవారికే పదవులు కేటాయించాలని పురంధేశ్వరి నిర్ణయించినట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో ఎన్నికలకు నెలల వ్యవధి మాత్రమే ఉండటంతో దగ్గుబాటి పురంధేశ్వరి ప్రజల్లో ఉండేందుకు కార్యచరణ సైతం సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ప్రజల వద్దకు ఏయే అంశాలతో వెళ్లాలి.. వారిని బీజేపీకి ఎలా ఆకర్షితులను చేయాలి అనే అంశాలపై పార్టీ క్యాడర్‌కు పురంధేశ్వరి దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 23న ప్రొద్దుటూరులో రాయలసీమ నేతలతో పురంధేశ్వరి సమావేశం కానున్నారు. ఈ నెల 25న గుంటూరులో కోస్తా జిల్లాల నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అలాగే ఈ నెల 26న రాజమహేంద్రవరంలో గోదావరి జిల్లాల నేతలతో పురంధేశ్వరి భేటీ కానున్నారు. అనంతరం ఈ నెల 27న విశాఖలో ఉత్తరాంధ్ర నేతలతో బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి సమావేశం కానున్నారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే ఎన్నికల సమరానికి శ్రేణులను సిద్ధం చేసేందుకు పురంధేశ్వరి దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Related Posts